షాపింగ్ నుంచి ఇంటికి వచ్చిన వసుధ తెచ్చిన వస్తువులన్నీ లోపల సర్దేసి, వచ్చి కూచుంది. సడెన్‌గా ఏదో గుర్తుకువచ్చినట్టు అయ్యి ఫోన్ కోసం వెతికింది. చూస్తే, ఎక్కడా కనిపించలేదు. బ్యాగ్, ఇంటిలోపల అంతా చెక్ చేసింది. ఫోన్ కనపడకపోయేసరికి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయ్యింది. ఖరీదైన ఫోన్, అందులో వందలాది కాంటాక్ట్ నంబర్లు, ముఖ్యమైన ఫొటోలు.. అనుకునేసరికి కాసేపటి వరకు ఏం చేయాలో అర్ధం కాలేదు. తన ముఖ్యమైన డేటా పోతే వచ్చే సమస్యలు తలుచుకుని చెమటలు పట్టేశాయి.
∙∙
వసుధ సమస్య చాలామంది ఎదుర్కొనే ఉంటారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? ఫోన్ ట్రాక్ చేయాలన్నా, మన వ్యక్తిగత డేటా సురక్షితంగా ఉండటానికి మార్గమే లేదా? అనుకునేవారికి సరైన సమాధానంగా సిఇఐఆర్ వరదాయినిగా మారింది. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (సిఇఐఆర్)ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
∙∙
నకిలీ మొబైల్ ఫోన్‌ల క్రయవిక్రయాలకు అడ్డుకట్టవేయడానికి, మొబైల్ ఫోన్ దొంగతనాన్ని అరికట్టడానికి, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల ద్వారా చట్టబద్ధమైన రక్షణ కలిగించడానికి సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (సిఇఐఆర్)ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) ఏర్పాటు చేసింది.
సిఇఐఆర్ పోర్టల్ ప్రయోజనాలు:
https://ceir.gov.in పోర్టల్ పోగొట్టుకున్న లేదా దొంగలించిన మొబైల్ పరికరాలను ట్రాక్ చేయడానికి ఐఎమ్‌ఇఐ నంబర్‌ను ఉపయోగిస్తుంది. సిఇఐఆర్ ద్వారా మొబైల్ పరికరం బ్లాక్ చేశాక, అది ఏ భారతీయ నెట్‌వర్క్ కంపెనీకి కనెక్ట్ చేయలేరు. ఆ పరికరాన్ని ఇక తిరిగి ఉపయోగించలేనిదిగా మార్చేస్తుంది.
పోర్టల్‌లో మొబైల్ ఫోన్‌ను బ్లాక్ చేయడానికి..
►ముందుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయాలి. లేదా కోల్పోయిన డివైజ్ సర్టిఫికెట్ లేదా మీ అక్నాలెడ్జ్ కాపీని తీసుకోవాలి.
►మీ సర్వీస్ ప్రొవైడర్ నుంచి డూప్లికేట్ సిమ్ తీసుకోవాలి.
►సిఇఐఆర్ పోర్టల్‌కు లాగిన్ అయ్యి, కంప్లైంట్ కాపీ, ఐడెంటిటీ (ఆధార్ కార్డ్) ప్రూఫ్‌ని యాడ్ చేయాలి.
https://www.ceir.gov.in/Request/CeirUserBlockRequestDirect.jsp
►మీ ఫారమ్ సబ్‌మిట్ చేసిన తర్వాత మీ రిక్వెస్ట్ ఐడీ జనరేట్ అవుతుంది.
►మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేయడానికి తగిన కారణం ఏంటో తెలియజేయాలి.
►మీ రిజిస్టర్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి, సబ్‌మిట్ చేయాలి.
ఐఎమ్‌ఇఐ నంబర్‌ను చెక్ చేయడానికి..
►ముందు పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి.
https://ceir.gov.in/ Device/CeirIMEI Verification.jsp
►మీ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి.
►మీ మొబైల్‌కి ఓటీపి వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి.
►15 అంకెల ఐఎమ్‌ఇఐ నంబర్‌ను నమోదు చేసి, చెక్ రిక్వెస్ట్ అనే దానిపై క్లిక్ చేయాలి.
►ఐఎమ్‌ఇఐ నంబర్ ధ్రువీకరణ అవుతుంది.
సిఇఐఆర్ పోర్టల్‌లో మీ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ చేయడానికి..
►పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి.
https://ceir.gov.in/Request/CeirRequestStatus.jsp
►రిక్వెస్ట్ స్టేటస్ ఆప్షన్‌ను చెక్ చేస్తే, తెలిసిపోతుంది.
పోర్టల్‌లో రికవరీ మొబైల్ ఫోన్‌ని అన్‌బ్లాక్ చేయడానికి..
https://ceir.gov.in/ Request/CeirUser UnblockRequest Direct.jsp పోర్టల్‌కు లాగిన్ అవ్వాలి.
►రిక్వెస్ట్ ఐడీని ఎంటర్ చేయాలి.
►మొబైల్ నంబర్‌ను అన్‌బ్లాక్ చేయడానికి కారణాన్ని ఇవ్వాలి.
డివైజ్‌ను గుర్తించాక డేటాను తొలగించడానికి..
►ఆండ్రాయిడ్ డివైజ్ డేటాను లాక్ లేదా ఎరేజ్ చేయడానికి
https://support.google.com/ accounts/answer/6160491?hl=en
►ఐ ఫోన్ అయితే.. iCloud.com లో ఫైండ్ మై ఐఫోన్ అని సెర్చ్ చేసి, డేటా తొలగించాలి.
https://support.apple.com/en-in/guide/icloud/mmfc0ef36f/icloud
పోయిన మొబైల్ డేటా సురక్షితంగా ఉంచడానికి..
►ఈ పోర్టల్ పూర్తిగా చట్టబద్ధమైనది. ఫోన్ ట్రాక్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తుంది. మీ డేటా, యాప్స్‌ను డీకంపైల్ చేయదు.
https://reports.exodus-privacy.eu.org/en/
►మీ మొబైల్ నంబర్‌లను నిర్ధారించడానికి, తీసేయడానికి టెలికాం విభాగాం అనుమతిస్తుంది. https://tafcop.dgtelecom.gov.in
►ఎస్సెమ్మెస్‌లు, బల్క్ ఎస్సెమ్మెస్‌లు పంపినవారిని గుర్తించడానికి అనుమతిస్తుంది. https://smsheader.trai.gov.in
►ఎస్సెమ్మెస్, వాట్సప్, ఇమెయిల్‌లో వచ్చిన షార్ట్ లింక్స్ మీ వ్యక్తిగత డేటాను డామేజీ చేయవచ్చు. అందుకని, షార్ట్ లింక్స్ పూర్తి యుఆర్ ఎల్ వివరాలను https://isitphishing.org/ ద్వారా చెక్‌చేయవచ్చు.
►యాంటీవైరస్, యాంటీ మాల్వేర్, సెక్యూరిటీ యాప్‌లను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసి ఉంటే వాటిని గుర్తించడంలో సహాయపడుతుంది.
∙అన్ని అప్లికేషన్లు, సోషల్‌మీడియా, ఇమెయిల్ అకౌంట్స్ కోసం రెండంచెల ప్రామాణీకరణను ఉపయోగిస్తే, డేటా సురక్షితంగా ఉంటుంది.
బ్లాక్ చేస్తే.. పనిచేయదు
బ్లాక్ లిస్ట్ చేసిన మొబైల్ పరికరాలను షేర్ చేయడానికి నెట్‌వర్క్ ఆపరేటర్‌లకు సెంట్రల్ సపోర్ట్ సిస్టమ్‌గా సేవలందిస్తూ, అన్ని మొబైల్ ఆపరేటర్ల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ (ఐఎమ్‌ఇఐ) డేటాబేస్‌లకు లింక్ చేస్తుంది. సబ్‌స్క్రయిబర్ ఐడెంటిటీ మాడ్యూల్ (సిమ్) కార్డ్ మార్చినప్పటికీ ఒక నెట్‌వర్క్‌లోని బ్లాక్ చేసిన పరికరాలు ఇతర నెట్‌వర్క్‌లలో పనిచేయవని ఇది నిర్ధారిస్తుంది.
ఇన్‌పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్‌బీయింగ్ ఎక్స్‌పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్
Comments
Please login to add a commentAdd a comment