‘‘చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది’’ ఇది జనుల వాడకంలో ఉండి, అందరి నోళ్లలోనూ నానుతూ ఉన్న మాట. పాపం అంటే ఇతరులకు అపకారం చేసినందువల్ల వచ్చే ఫలితం. దీనిని మామూలు మాటల్లో చెప్పాలంటే తప్పు. అందరూ అంగీకరించనిది. మానవమాత్రులు తప్పు చేయకుండా ఉండటం అసంభవం. తెలిసి కాకపోయినా, తెలియకుండా అయినా ఏదో ఒక తప్పు చేసే ఉంటారు.
తప్పు అంటే ఏదైనా ఇతరులకి బాధ కలిగించే పని కాని, ధర్మానికి విరుద్ధమైన పని కాని చేయటం. ఎదుటివారికి మంచి అనుకుని చేసినది వారికి హాని కలిగించవచ్చు. అనుకోకుండా చేసినట్టయితే దానిని ‘‘తప్పు అయి పోయింది’’ అని ఒప్పుకొని ఎవరికి హాని కలిగిందో వారిని క్షమించమని అడిగితే సరి చేసుకునే అవకాశం ఉంటుంది. పరిహారం సమర్పించో, మరొక విధంగానో సద్దుబాటు చేసుకునే వీలు ఉంటుంది. ధర్మానికి అపచారం జరిగితే? .. .. దానిని కూడా ఒప్పుకొని పరిహారానికి ప్రయత్నం చేయాలి. ఇవి చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అయితే పరిణామం వేరొక విధంగా ఉంటుంది.
చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది అంటే తాను చెప్పుకోవటమే కాదు. ఈ పాపం గురించి పదిమంది చెప్పుకుంటే అని. ఏదైనా విషయం గురించి ఎంత మంది మాట్లాడుకుంటే దాని ఫలితాన్ని అంతమంది పంచుకుంటారు కదా! ఆ విధంగా తాను చేసిన పనికి సంబంధించిన ఫలితాన్ని ఎంతోమంది పంచుకోవటం కారణంగా కర్తకి ఆ పనివల్ల కలగవలసిన తీవ్ర నష్టం సద్దుబాటు చేయబడుతుంది.
‘‘కర్తా కారాయితా చైవ ప్రేరకశ్చానుమోదకః / సుకృతే దుష్కృతే చైవ చత్వారినః సమ భాగినః’’. కారయితలు (చేయించినవారు), ప్రేరకులు కాకపోయినా దాని గురించి మాట్లాడుకున్నవారికి కొంత ఫలితం చెందుతుంది. కనుక కర్తకి స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. కొన్ని పనుల వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాని, అది చేయకూడని పని అయితే చేయగలిగినది ఏమీ ఉండదు.
తాను చేసిన తప్పుని చెప్పటానికి ఎంతో ధైర్యం కావాలి. అటువంటి ధైర్యం ధర్మమార్గంలో నడిచే వారికి మాత్రమే ఉంటుంది. ‘‘సత్యే ధర్మం ప్రతిష్ఠితా’’, ధర్మం సత్యంలోనే నిలిచి ఉంటుంది. కనుక ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు మాత్రమే ధర్మమార్గంలో ఉన్నట్టు. తన గొప్ప, ఘనతలు మాత్రమే కాక అపజయాలు, లోపాలు కూడా ఉన్నవి ఉన్నట్టుగా సందర్భం వచ్చినప్పుడు చెప్పగలగాలి. అప్పుడు అది ఎంతోమందికి మార్గదర్శక మౌతుంది.
పొరపాట్లు ఎట్లా దొర్లుతాయి? వాటిని ఏ విధంగా అధిగమించ వచ్చు? అని అవగాహన చేసుకోవటానికి గుణపాఠం అవుతుంది. తాను చేసిన పాపం అందరికీ తెలిస్తే గౌరవం తగ్గిపోతుందనే భయం ఉంటుంది సాధారణంగా. వాస్తవానికి తాత్కాలికంగా అదే జరిగినా, రాను రాను గౌరవం పెరుగుతుంది. నిజాయితీపరులు, మంచి చెడు తెలిసిన వారు అని. ఒకరి ద్వారా తెలియటం కాక తామే చెప్పటం వల్ల ఒక ఉపయోగం ఉంది. ఇతరులకి తెలిసి, వారు గోరంత విషయాన్ని కొండంత చేసి, ప్రచారం చేసే అవకాశం ఉండదు. ఈ పారదర్శకత నాయకుడుగా ఉండేవారికి తప్పని సరి.
చేసిన పాపం ఇతరులకి తెలిస్తే చులకన అయిపోతామేమో అనే ఆలోచనతో బయటికి చెప్పరు చాలమంది. చెప్పుకుంటే పరిహారం ఎట్లా చేయవచ్చో సూచనలు అందే అవకాశం ఉంటుంది. ఈ మాట అన్నంత మాత్రాన ప్రకటనలు చేయమని కాదు. శ్రేయోభిలాషుల వద్ద మనసులో ఉన్న బరువు దింపుకుంటే తేలిక అవుతుంది. లోలోపల కుమిలి పోవటం, బయట పడుతుందేమోననే భయం, ఆందోళన ఉండవు. అప్పుడు తరువాతి కర్తవ్యం గోచరిస్తుంది. ఇదంతా తప్పు చేశాననే భావన ఉన్న వారి విషయంలో. తప్పు అని ఒప్పుకోటానికే ఇష్టం లేనివారి గురించి చెప్పటానికి ఏమీ లేదు.
– ఎన్.అనంతలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment