మహిళలు నేసిన వారసత్వం, భవిష్యత్తు కోసం భద్రం.
భావోద్వేగాలతో నిండిన కార్పెట్
నేతలో పాల్గొన్న మహిళలకు ఆర్థిక అవకాశాలు.
ఏ దేశ చారిత్రక సంస్కృతి చూసినా అక్కడి స్థానిక మహిళల సంప్రదాయ వారసత్వం ఉనికిలోకి వస్తూనే ఉంటుంది. టర్కిలోని మధ్య–నల్ల సముద్రం ప్రాంతంలోని కిజిక్ గ్రామానికి ప్రత్యేకమైన సాంప్రదాయ కళ ఒకటుంది. ఆ వారసత్వం పేరు కిజిక్ కార్పెట్. సాంస్కృతికపరంగా, మహిళలకు ఆదాయ వనరుగా సంరక్షించబడుతోంది అక్కడి తివాచీ. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అధ్యయనాలు, జియొగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్‌తో కిజిక్ కార్పెట్ ఇప్పటికీ రక్షించబడుతుంది. భవిష్యత్ తరాలకు దాని నిరంతర ఉనికిని తెలియజేస్తుంది.
చారిత్రక జీవనశైలి
కిజిక్ గ్రామ మహిళల ఆనందం, దుఃఖం, ఆశ.. భావోద్వేగాలు, ఆలోచనలను ప్రతిబింబించే దాని సంక్లిష్టమైన మూలాంశాలతో కిజిక్ కార్పెట్ తయారీ విభిన్నంగా ఉంటుంది. ఈ తివాచీలు అలంకార వస్తువులు మాత్రమే కాదు. అవి లోతైన సాంస్కృతిక అర్థాన్ని కూడా కలిగి ఉంటాయి. కిజిక్ ప్రాంత చరిత్ర, జీవనశైలి, సంస్కృతిని ఈ కార్పెట్లు సూచిస్తాయి.
టోకాట్ ప్రావిన్షియల్ డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్, టోకాట్ మెచ్యూరేషన్ ఇన్‌స్టిట్యూట్ మధ్య సహకార ప్రయత్నం ద్వారా, విస్తృతమైన, ఫీల్డ్ పరిశోధనలు నిర్వహించారు. ఫలితంగా కిజిక్ కార్పెట్ భౌగోళిక సూచిక విజయవంతంగా నమోదయ్యింది. టోకాట్ మెచ్యూరేషన్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉపాధ్యాయురాలు సెరాప్ బుజ్లుదేరే, ఈ సాంస్కృతిక విలువలను కా΄ాడటంలో ప్రాముఖ్యతను హైలైట్ చేసింది.
మూలాంశాల ద్వారా సందేశం
తివాచీలలో ఉపయోగించే మూలాంశాలు తరచుగా స్త్రీల నుండి వారి కాబోయే భర్తలకు సందేశాలు, బహిరంగంగా తెలియజేయలేని భావోద్వేగాలను వ్యక్తపరుస్తాయి. కిజిక్ సంస్కృతి సంఘం అధ్యక్షుడు అహ్మెట్ ఓజ్టెక్, కిజిక్ తివాచీల చారిత్రక ప్రాముఖ్యతను చెబుతూ– ‘కిజిక్ ప్రజలు ఓఘుజ్ టర్క్‌లకు చెందినవారు. చారిత్రాత్మకంగా, వారు సంచార జీవితాన్ని గడిపారు. పశుశోషణ, మేకల పెంపకం ప్రధాన జీవనోపాధిగా ఉంది.
గొర్రెల నుండి ఉన్ని తివాచీలు తయారు చేయడంతో సహా వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించబడింది. సుధీర్ఘ శీతాకాలపు రాత్రులలో, పెద్దలు పర్యావరణం నుండి సేకరించిన సహజ మూలికలతో ఉన్నిని తయారుచేయడం, వాటికి రంగు వేయడం, తరువాత తివాచీలు, సంచులు, రగ్గులు వంటి ఇతర ఉత్పత్తులను నేసేవారు.
తమ కమ్యూనిటీలో ఎవరి వివాహం కుదిరినా, ఆ వధూవరులకు స్వయంగా తివాచీని తయారుచేసి, ఇచ్చేవారు’ అని వివరిస్తారు. ఈ తివాచీలు కేవలం గృహోపకరణాలు మాత్రమే కాదు, వ్యక్తిగత సందేశాలు, భావాలను కలిగి ఉంటాయి. అయితే, సాంప్రదాయ కిజిక్ తివాచీలు పారిశ్రామికీకరణతో సవాళ్లను ఎదుర్కొన్నాయి. కానీ, సాంస్కృతిక వారసత్వాన్ని ముందు తరాలకు సజీవంగా అందజేయడానికి కిజిక్ మహిళ కృషి జరుపుతూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment