ఢిల్లీ కేంద్రంగా వ్యాపార సంస్థను స్థాపించింది దీక్షా సింఘి. ఆమె స్థాపించిన స్టార్టప్ పేరు ‘ఎ లిటిల్ ఎక్స్‌ట్రా’. వినడానికి తేలికగానే ఉంది. కానీ ఈ పేరు వెనక చాలా బరువైన కథ ఉంది. అంతకంటే బరువైన ఆవేదన ఉంది. బాల్యం నుంచి ఎదుర్కొన్న అవహేళనలే ఆమెలో అక్షరవాహినికి విషయాంశాలయ్యాయి. ఆ తర్వాత రోజూ ఏదో ఒకటి రాయకపోతే తోచని స్థితికి చేరింది.
అచ్చంగా స్వచ్ఛంగా సాగే ఆమె అక్షరాలకు అభిమానులు లక్షలకు మించిపోయారు. బాడీ పాజిటివిటీ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా గుర్తింపు పొందింది దీక్ష. ఆ తర్వాత ఆమె స్థాపించిన అంకుర సంస్థ అనతి కాలంలోనే విజయపథంలో దూసుకుపోవడానికి ఆమెకు ఆమే బ్రాండ్ అంబాసిడర్. ఇంతకీ ఎ లిటిల్ ఎక్స్‌ట్రా పేరుతో తయారు చేస్తున్న ఉత్పత్తి ఏమిటంటే... ఫ్యాషన్ ఆభరణాలు. ఇరవై తొమ్మిదేళ్ల దీక్షా సింఘి తన విజయగాథను ఇలా వివరించారు.
‘‘మాది అస్సాం రాష్ట్రం, గువాహటి. చిన్నప్పటి నుంచి బొద్దుగానే ఉండేదాన్ని. తోటి పిల్లలు వేళాకోళం చేసేవారు. బోర్డింగ్ స్కూల్లో కూడా ఇదే పరిస్థితి. లావుగా ఉండడంతో పరుగెత్తలేనని వాళ్లే నిర్ణయించి ఆటల్లో కలుపుకునే వాళ్లు కాదు. పాఠశాల వార్షికోత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాల్లో కూడా అవకాశం ఇచ్చేవారు కాదు. దుస్తులు కూడా ఆడవాళ్ల సెక్షన్‌లో నా సైజువి ఉండేవి కాదు.
మగవాళ్ల సెక్షన్‌లో దొరికేవి. అబ్బాయిల దుస్తులు... పైగా వదులుగా ఉన్నవి «ధరించేదాన్ని. దాంతో స్కూలు పిల్లలతోపాటు బంధువులు కూడా అల్లరి చేస్తూ టామ్‌బాయ్ అనేవాళ్లు. ఇదిలా ఉంటే లావు తగ్గడం కోసం స్విమ్మింగ్ కెళ్లాను. అక్కడి కోచ్ నా స్విమ్ సూట్ విషయంలో కొన్ని నిబంధనలు పెట్టారు. అప్పటి నుంచి స్విమ్మింగ్ మీద కూడా విరక్తి కలిగింది. ఇలాంటి అనుభవాలతో స్కూలు ముగించుకుని కాలేజ్‌లో చేరాను.
కొత్త శకం మొదలైంది!
కాలేజ్ ఎడ్యుకేషన్ కోసం 2013లో ఢిల్లీకి వచ్చాను. కాలేజ్‌లో కొత్త స్నేహితులు కలిసే లోపు బ్లాగ్ నా తొలి స్నేహితురాలయింది. బ్లాగ్ రాయడం మొదలు పెట్టిన తర్వాత నాకు తెలియకుండానే నన్ను కదిలించిన ఒక్కో సంఘటన అక్షరరూపం దాల్చింది. అందులో మానవీయ కోణాల కోసం నేను ప్రయత్నం చేసిందేమీ లేదు. కానీ నా బాల్యపు ఆవేదన నా బ్లాగ్ చదువరులను కదిలించివేసింది. నన్ను అభిమానించడం మొదలైంది.
క్రమంగా బ్లాగ్‌లో నా ఆవేదనలే కాకుండా ఆలోచనలు, సమాజం గురించిన ఆందోళనలు, నా పర్యటన వివరాలను కూడా పంచుకోవడం మొదలుపెట్టాను. బాడీ షేమింగ్ ఒక వ్యక్తిని ఎంతగా బాధిస్తుందో తెలిసి వాళ్ల మనసు ద్రవించేది. కొంతమంది మహిళలు తమకూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని పంచుకునేవారు. ఈ క్రమంలో నా రచనలు దేహాకృతి కారణంగా ఎదురయ్యే మానసిక సమస్యల నుంచి సాంత్వన పొందేవిధంగా ధైర్యం చెబుతూ సాగాయి. బాడీ పాజిటివిటీ ఇన్‌ఫ్లూయెన్సర్ గా నా రచనలను ఆదరించేవారు పెరిగారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారిప్పుడు.
వ్యాపార కుటుంబ నేపథ్యం
చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగమో, వ్యాపారమో చూసుకోవాల్సిన సమయంలో నేను వ్యాపారాన్నే ఎంచుకున్నాను. ఎందుకంటే మాది వ్యాపార కుటుంబం. ఏదైనా కొత్తగా చేయాలనే ఉద్దేశంతో ‘ఎ లిటిల్ ఎక్స్‌ట్రా’ పేరుతో ఆభరణాల తయారీ ప్రారంభించాను. మొదట ఇదే టైటిల్‌తో దుస్తుల వ్యాపారం చేయాలనుకున్నాను. కానీ దుస్తులకు సైజ్ పరిమితులుంటాయి. ఆభరణాలకు ఆ పరిమితి ఉండదు కదా! అందుకే ఆభరణాలతో మొదలుపెట్టాను.
ఆభరణాలనగానే ఖరీదైన వ్యాపారం అనుకోవద్దు. చంకీ ఆభరణాలే ఎక్కువ. ఇప్పటికే మార్కెట్‌లో వందలాది ఆభరణాల తయారీదారులున్నారు. నా ఆభరణాలనే ఎందుకు కొనాలి? అంటే... నా ఆభరణాలు సందర్భాన్ని బట్టి ధరించేవిధంగా ఉంటాయి. ఉదాహరణకు నవరాత్రి సందర్భంగా పూసలతో చేసిన దుర్గాదేవి చెవి జూకాలు ధరిస్తే అందరి దృష్టి మీ చెవుల మీదే ఉంటాయి. కాదంటారా? అలాగే ఫుట్‌బాల్ మ్యాచ్ చూడడానికి వెళ్లేటప్పుడు ఫుట్‌బాల్ చెవి రింగులు, క్రికెట్ బ్యాట్ లాకెట్‌తో దండలు... ఇలాగన్నమాట.
ఈ ప్రయోగాన్ని 2020 ఆగస్టులో ఐదు వేల రూపాయల పెట్టుబడితో ప్రారంభించాను. ఇప్పుడు ఐదు వందల డిజైన్‌లతో అరవై లక్షల టర్నోవర్‌తో వ్యాపారం సాగుతోంది. దేశంలో ఉన్న రకరకాల ఆభరణాల తయారీదారులు (కారీగారీ) నాతో కలిసి పని చేస్తున్నారు. నేను ఇచ్చిన డిజైన్‌ని ఆభరణం రూపంలో తీసుకువచ్చే అద్భుతమైన కళ వారి చేతిలో ఉంది. సందర్భానుసారంగా సేల్ అయ్యే డిజైన్‌లను రూపొందించే చురుకైన ఆలోచనలు నా బుర్రలో ఉన్నాయి. ఇదే నా సక్సెస్’’ అన్నారు దీక్షా సింఘి.
Comments
Please login to add a commentAdd a comment