Liz Carter US Colorado Woman Italian Crepe Paper Bouquet Business: జీవితం పూలదారిలా సుతిమెత్తగా సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకు తగినట్టుగానే కృషి చేస్తుంటారు. అమెరికాలోని కొలరాడో ప్రాంతంలో ఉంటున్న లిజ్ కార్టర్ కూడా అదే ప్రయత్నం చేసింది. కాగితం పూల దారిలో ఓ కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది.
సీజన్‌లో విరబూయని పూలు కూడా ఆమె చేతిలో అందంగా ఊపిరి పోసుకుంటాయి. ఇటాలియన్ క్రేప్ పేపర్‌తో ఆమె డిజైన్ చేసిన అందమైన పూలు చూస్తే ప్రకృతి కూడా ‘ఔరా!’ అనకుండా ఉండదు. ఆ అందమైన పేపర్ పూలతోనే వ్యాపారాన్ని విస్తృతం చేస్తోంది 42 ఏళ్ల కార్టర్.
ముడతల కాగితంతో ప్రయోగాలు..
పదేళ్లపాటు కొలరాడోలోని ఓ పూల దుకాణంలో పార్ట్ టైమ్ జాబ్ చేసింది కార్టర్. అక్కడకు నిత్యం వచ్చే వ్యక్తులను చూస్తూ ఉన్న ఆమె కొన్నాళ్లకు తనే పూల వ్యాపారం చేయాలనుకుంది. సొంతంగా పూల షాప్‌ను ఏర్పాటు చేసింది. అయితే, సీజనల్‌గా విరబూయని పూలతో బొకేలను తయారుచేసి, తన ప్రత్యేకతను చాటాలనుకుంది. వాటిని విక్రయిస్తూ ఓ కొత్త వ్యాపారాన్ని సృష్టించాలనుకుంది.
ఆ ఆలోచనతో తన ఇంట్లో రేకలు, మొగ్గలు, ఆకుల ఆకారంలో 100 రకాల పువ్వులను ముడతలు ఉండే ఇటాలియన్ క్రేప్ కాగితంతో సృష్టించింది. పువ్వుల షాప్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ కాగితం పువ్వులు విరబూయడానికి సాధన చేస్తూనే ఉంది. ఒక అభిరుచిగా ప్రారంభమైన ఆ కళ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేలా ఎదిగింది. ఆ తర్వాత వాటికి కొన్ని ఆకర్షణలు జోడించింది. ఆర్డర్లు వచ్చాయి. దీంతో 2019 మొదట్లో కాగితం పూలతో ఆన్‌లైన్ వ్యాపారం ప్రారంభించింది. కార్టర్ చేతిలో అలా రూపుదిద్దుకున్న పుష్పగుచ్ఛాలకు ఇప్పుడు అమెరికాలోనే కాక ప్రపంచమంతా కస్టమర్లున్నారు.
ఇంటి గ్యారేజ్ నుంచి కమర్షియల్ స్పేస్ వరకు..
ఈ నెలలో కార్టర్ తన వ్యాపారాన్ని గ్యారేజ్ నుంచి మిషిగాన్‌లోని ప్రఖ్యాతి చెందిన ఢిల్లీ కామర్స్ డ్రైవ్‌లో గల 3,130 చదరపు అడుగుల సూట్‌లోకి మార్చింది. అంటే, ఆమె తన వ్యాపారాన్ని ఎంతగా విస్తృతం చేసిందో మనకు ఇట్టే అర్థమైపోతుంది. ‘ఈ కొత్త స్థలం మా వద్ద ఉన్న వివిధ రకాల ఉత్పత్తుల విస్తృతిని పెంచడానికి, మరిన్ని కొత్త రకాల డిజైన్లను కనుక్కోవడానికి అనుకూలంగా ఉంటుంది’ అంటుంది కార్టర్.
ఒక్కో పువ్వు ఒక కళారూపం...
‘పువ్వులు మనలోని సున్నితమైన భావోద్వేగాలకు ప్రతీకలు. ఈ పువ్వులు నా జీవితాన్ని అర్థవంతంగా మార్చేశాయి. వీటిని అమర్చడానికి సృజనాత్మకత అవసరం. దీనితో పాటు కస్టమర్ల అవసరాలకు సరిపోయే సామర్థ్యమూ అవసరం. నిరంతరం కాలానుగుణంగా వీటిని సృష్టిస్తూ ఉంటే చాలా ఆసక్తికరమైన పనిగా మారిపోతుంది. మనలోని భావోద్వేగాలు బ్యాలెన్స్ అవుతాయి కూడా’ అంటారు కార్టర్.
ఐదేళ్లుగా ఈ కాగితం పూలను సృష్టిస్తున్న కార్టర్ మొదట్లో ప్రతి పువ్వుల దుకాణానికి వెళ్లి, తన పనితనాన్ని వివరించేది. వాటిలో తన కాగితం పూల గుచ్ఛాలను ఉంచడానికి వారిని ఒప్పించేది. ఒక విధంగా పెద్ద తపస్సు చేశానంటుంది కార్టర్. ఈ మదర్స్‌డేకి 500 ఆర్డర్లు రావడం, వచ్చిన ఆర్డర్లకు తగినట్టు పూలను అందించడంతో తన వ్యాపారాన్ని విస్తృతం చేయాలనుకుంది.
ఒడిదొడుకులను తట్టుకోలేక వదిలి వెళ్లిన ఆమె భర్త అలెక్స్ కూడా తిరిగి వచ్చి, ఇదే వ్యాపారం చూసుకుంటున్నాడు. ఒక్కో పువ్వును తయారుచేయడానికి 30 నిమిషాల నుండి గంట సమయం పడుతుందనే కార్టర్ ‘నేను ఇప్పుడు రోజంతా పూలతో ఆడుకుంటున్నాను’ అని ఉత్సాహం చెబుతుంది. దేశమేదైనా ఆ ఉత్సాహం మనమూ అందుకోవాల్సిందే. కొత్తగా జీవితాన్ని నిర్మించుకోవాలనుకునేవారు కార్టర్ నుంచి స్ఫూర్తిని పొందాల్సిందే.
చదవండి: Bipin Rawat Wife Madhulika: భర్తకు తగ్గ భార్య.. ఆఖరి శ్వాస వరకు ఆయనతోనే
Comments
Please login to add a commentAdd a comment