Making over a Hundred Short films and stepping towards OTT and cinema - Sakshi
Sakshi News home page

వందకు పైగా షార్ట్‌ ఫిల్మ్స్‌... నెక్స్ట్ టార్గెట్ సినిమానే

Published Fri, Oct 22 2021 9:08 AM | Last Updated on Fri, Oct 22 2021 12:54 PM

Making over a Hundred Short films and stepping towards OTT and cinema - Sakshi

కొంత మంది కుర్రాళ్లకు మంచి సృజనాత్మకత ఉన్నా ఆర్థిక స్థిరత్వం, ప్రోత్సహించే వారు లేక కోరుకున్న రంగంలో వెనుకంజ వేస్తుంటారు. కానీ కొందరు ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాము ఎంచుకున్న మార్గంలో పయనిస్తూ తమ ప్రతిభను చాటుతూ ఉంటారు. అలాంటి వారిలో ఒకరు రామ్‌కిరణ్‌. వందకు పైగా షార్ట్‌ ఫిల్మ్‌లను తీసి, ఓటీటీ, సినిమా వైపుగా అడుగులు వేస్తూ స్వయంకృషితో ఎదుగుతున్న రామ్‌కిరణ్‌ హైదరాబాద్‌ వాసి. 

చదువుకుంటూనే లఘుచిత్రాలను రూపొందించి పలువురి ప్రముఖుల ప్రశంసలు పొందిన రామ్‌ కిరణ్‌ నాలుగేళ్ల క్రితం ‘ఫస్ట్‌ లుక్‌ ఫిల్మ్‌ మీడియా ఫ్యాక్టరీ’ పేరుతో సొంతంగా స్టూడియో ఏర్పాటు చేసుకున్నాడు. తన కలను సాకారం చేసుకు నేందుకు సినిమాలకు సంబంధించిన ఎడిటింగ్, డబ్బింగ్, కెమెరా వర్క్‌.. పూర్తి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ని ఈ స్టూడియో నుంచి చేస్తుంటాడు. కాలేజీ దశ నుంచే లఘుచిత్రాలను రూపొందిస్తూ, అవార్డులు పొందుతూ, పలువురి ప్రశంసలు అందుకుంటున్న రామ్‌కిరణ్‌ తన డ్రీమ్‌ జర్నీని వివరించారు. 
100 ప్లస్‌ షార్ట్‌ ఫిల్మ్స్‌
‘‘సినిమాటోగ్రాఫర్‌గా 90కి పైగా, డైరెక్టర్‌గా, ఎడిటర్‌గా మరో పది షార్ట్‌ ఫిల్మ్‌లకు వర్క్‌ చేశాను. 2017లో హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ‘ఫస్ట్‌ లుక్‌ ఫిల్మ్‌ మీడియా ఫ్యాక్టరీ’ని రెండుగదుల్లో ఏర్పాటు చేశాను. ఈ స్టూడియో నుంచి మూడు రకాల వర్క్స్‌ జరుగుతాయి. ఫిల్మ్‌ మేకింగ్, డబ్బింగ్, ఫొటోగ్రఫీ ప్రధానంగా ఉంటాయి. 

ఓటీటీ వైపు
ఏ సినిమా అయినా హై కంటెంట్, లో బడ్జెట్‌ ఎంచుకుంటాను. 15 లక్షల లోపు బడ్జెట్‌ వేసుకొని చేసిన ఓటీటీ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉంది. విశ్వనాథ సత్యనారాయణ గారి బయోగ్రఫీని క్లుప్తంగా 1 గంట 20 నిమిషాలు వచ్చేలా ‘కవి సామ్రాట్‌’ సినిమా తీశాం. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. నటులు ఎల్‌.బిశ్రీరామ్, అనంత్‌గారు ఇందులో ప్రధాన పాత్రధారులుగా నటించారు. కళాతపస్వి విశ్వనాథ్‌ మా టీమ్‌ అందరినీ తమ ఇంటికి పిలిచి, ప్రశంస లు అందించారు. తనికెళ్ల భరణి ‘తపస్వి’కి సినిమాటోగ్రాఫర్‌గా చేశాను. ‘విరాటపర్వం’ సినిమాలో ‘కోల్‌ కోల్‌ ..’ పాటకు వర్క్‌ చేశాను. రచయిత సుభాష్‌ చంద్రబోస్‌ ఈ పాట దృశ్యకావ్యంలా ఉందని నా వర్క్‌ని ప్రశంసించారు. 

ఒక్క కెమెరాతో మొదలు..
పుట్టి పెరిగింది చౌటుప్పల్‌ మండలం దేవనమ్మ నాగారం గ్రామంలో. నాన్న బూడిద గోపాల్‌రెడ్డి. నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు. అమ్మ అంతకుముందే కన్నుమూశారు. ఎలాంటి ఆర్థిక సాయం లేదు. సివిల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ చేతిలో ఉంది. ఆర్థికంగా కోలుకోవడానికి రెండేళ్లు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసి, ఒక్క కెమెరాతో నా కల తీర్చుకోవడానికి ఈ దిశగా అడుగులు వేశాను. ఇప్పుడు నాలుగు కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాను. ఐదుగురు ఉద్యోగులను నియమించుకున్నాను. 

పురస్కారాలు.. ప్రశంసలు
కాలేజీ రోజుల్లోనే నా మొదటి షార్ట్‌ ఫిల్మ్‌ ‘ఐ యామ్‌ నాట్‌ డంబ్‌’కి అవార్డు వచ్చింది. ఇప్పటి వరకు నా సినిమాటోగ్రఫీ వర్క్‌కు ఎనిమిది అవార్డులు వచ్చాయి. ‘పాస్‌పోర్ట్‌’ కామెడీ షార్ట్‌ ఫిల్మ్‌కి, ‘ఇండియన్‌ లేడీ’ కీ అవార్డులు వచ్చాయి. తెలంగాణ గవర్నమెంట్‌ నుంచి బెస్ట్‌ సినిమాటోగ్రాఫర్‌ అవార్డు ‘కలెక్టర్‌–పాప’ షార్ట్‌ ఫిల్మ్‌కు వచ్చింది. 48 గంటల్లోపు షార్ట్‌ ఫిల్మ్‌ తీయాలన్నది ఛాలెంజ్‌. ఆ కొద్ది టైమ్‌లోనే ఫిల్మ్‌ తీసి సబ్‌మిట్‌ చేశాను. సజ్జనార్‌గారి చేతుల మీదుగా ‘పెడెస్టల్‌ సేఫ్టీ’ మీద బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌ అవార్డ్‌ కిందటేడాది తీసుకున్నాను. కరోనా మీద ‘ది పిజియన్‌’ అనే పేరుతో తీసిన షార్ట్‌ ఫిల్మ్‌కు ‘గోవా ఆన్‌లైన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ అవార్డు తో పాటు ప్రముఖుల ప్రశంసలూ లభించాయి.  

పెళ్లిళ్లకు ఫొటోగ్రఫీ
కలను తీర్చుకోవాలంటే కడుపు కూడా నిండాలి. అందుకే, ఒకటికి మూడు పనులు ఎంచుకున్నాను. వాటిలో‘శుభప్రద’ ఫొటోగ్రఫీ ఒకటి. పుట్టిన రోజు, వివాహాది వేడుకలకు థీమ్‌ బేస్ట్‌గా ఫొటోలు తీస్తుంటాను. దీనికి ఒక టీమ్‌ వర్క్‌ చేస్తుంటారు. అలాగే, పిల్లల ఫొటోగ్రఫీ మీదా సృజనాత్మక ఆలోచనలతో వర్క్‌ చేస్తున్నాను. 

కంటెంట్‌ ఉంటే... కటౌట్‌ రెడీ! 
‘తక్కువ బడ్జెట్‌లో షార్ట్‌ ఫిల్మ్‌ రూపొందించాలని ఎవరైనా అడిగినప్పుడు కెమెరామెన్‌ గా, ఎడిటర్‌గా, డైరెక్టర్‌గా.. ఎలా కావాలనుకున్నా వారికి తగిన సేవలు నా స్టూడియో నుంచి అందిస్తుంటాను. సరైన కంటెంట్‌తో వస్తే షార్ట్‌ ఫిల్మ్‌కు సంబంధించిన వర్క్‌ మొత్తం చేసి, ఇస్తాను. అలా నెలకు ఇప్పుడు మూడు షార్ట్‌ ఫిల్మ్‌ల వరకు తీస్తున్నాను. అందుకు వనరులతో పాటు, తగిన టీమ్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నాను. లఘుచిత్రాల నుంచి పెద్ద చిత్రాల వరకు ఎదగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాను’ అని వివరించారు రామ్‌ కిరణ్‌. 
– నిర్మలారెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement