-ప్రొఫెషన్‌తో పనిలేదు.. యాక్టింగ్‌యే ప్యాషన్
-సిటిజనుల్లో పెరిగిన నటనాభిరుచి
-ఓటీటీలు, యూట్యూబ్‌ల రాకతో ఓవర్‌టైమ్ యాక్టింగ్‌కు సై..
ఒకే ఒక్క ఛాన్స్... ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లుందే..అనుకుంటున్నారా...! అవును రవితేజ హీరోగా నటించిన ఖడ్గం సినిమాలోనిది.. అయితే ఇది ఈ ఒక్క సినిమాకో.. హీరోకో పరిమితం కాదు...దాదాపు ఇండస్ట్రీలో అవకాశం కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరి నోటి వెంట వచ్చేది ఈ డైలాగే..అంటే అతిశయోక్తి కాదేమో..నాటి ఎన్‌టిఆర్ దగ్గర నుంచి నేటి విశ్వక్‌సేన్ వరకూ అలా వచి్చన వారే.. ఇప్పుడు ఇదంతా మాకెందుకు చెప్తున్నారు..? ఇవన్నీ తెలిసిన విషయాలే అనుకుంటున్నారా..? అవును..! అందులో నిజం లేకపోలేదు..కాకపోతే గతంతో పోలిస్తే నటనవైపు వెళ్లాలని అనుకునే వారి సంఖ్య భారీగా పెరిగిందనే విషయాన్ని చెప్పడానికి వచ్చెనదే ఈ తిప్పలంతా..నగరవాసుల్లో నటనవైపు పెరిగిన ఆసక్తి...గతంతో పోలిస్తే పెరిగిన అవకాశాలు.. వివిధ వేదికలు గుర్తించి తెలుసుకునే ప్రయత్నమే ఇది...
సాక్షి హైదరాబాద్: ఆయనో ప్రముఖ వైద్యుడు.. నగరంలోని ఓ ప్రభుత్వాస్పత్రిలో కీలక పదవిలో కొనసాగుతున్నారు. డయాబెటిక్ కన్సల్టేషన్ కోసం ఆయన్ని కలిసేందుకు సికింద్రాబాద్‌కు చెందిన గిరి ఆ ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్‌ను చూడగానే ఎక్కడో చూసినట్లు.. బాగా తెలిసినట్లు చాలా యూనీక్‌గా అనిపించింది. కాసేపు తన బుర్ర బద్దలకొట్టుకుని ‘‘ఫలానా వెబ్‌సిరీస్‌లో మీరు నటించారు కదా డాక్టర్?’’ అని ఠక్కున అనేశాడు.. డాక్టర్ కూడా చాలా ఫ్రెండ్లీగా మొహమాటాన్ని పక్కనబెట్టి అడిగిన ప్రశ్నకు అవునంటూ చిరునవ్వుతో సమాధానమిచ్చారు. గిరికి ఎదురైన అనుభవమే మనలో చాలామందికీ కలిగే ఉండొచ్చు.. ఆస్పత్రులు, బొటిక్‌లు, పార్లర్లు, కాలేజీలు.. ఎక్కడ పడితే అక్కడ అనేక మంది నగరవాసులు డాక్టర్ తరహాలోనే తమ ప్రతిభను వివిధ మాధ్యమాల్లో చాటుతున్నారు..
వెల్లువెత్తుతున్న అవకాశాలు..
టీవీలు, షార్ట్ ఫిలింస్...వరకూ దశలవారీగా యాక్టింగ్ హాబీ విస్తృతమవుతూ ఉంది. గత ఐదేళ్ల కాలంలో ఆన్‌లైన్ వినియోగంతో పాటుగా ఈ హాబీ కూడా ఒక్కసారిగా ఊపందుకుంది. ముఖ్యంగా ఓటీటీ వేదికలు విస్తృతమవడంతో నటీనటులకు అవకాశాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. తక్కువ బడ్జెట్‌లో సినిమాలు, సిరీస్ రూపొందించే నిర్మాతలు, టెక్నీషియన్లుతో పాటు నటీనటులను కూడా తమ బడ్జెట్‌కు అందుబాటులో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.. పాత్రోచితంగా కనిపించే వ్యక్తులకు కాస్తంత శిక్షణ అందిస్తే చాలు పని జరిగిపోతున్న పరిస్థితుల్లో వయసుతో సంబంధం లేకుండా.. అనేకమందికి అవకాశాలు గుమ్మం ముందుకు వచ్చి మరీ తలుపు తడుతున్నాయి.
సొంత వేదికలు..
ఇన్‌స్టా, స్నాప్‌చాట్, ఫేస్‌బుక్, యూట్యూబ్ రీల్స్, టిక్‌టాక్ వంటి మాధ్యమాల రాకతో సరదాగా మొదలుపెట్టి రీల్స్, షార్ట్ వీడియోలు వగైరా వంటి సోషల్ మీడియా వేదికల్లో తమ ప్రతిభను కనబరుస్తున్నారు. అంతేకాదు సినీ తారలను మించిన ఫాలోయింగ్‌ను, గుర్తింపును, ఫాలోవర్స్‌ను పోగేసుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆయా ప్రాంతాల్లో సెలబ్రిటీలుగా.. చిన్నపాటి స్టార్‌లుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అంతేకాదు ఆ వేదికల ద్వారానే సినీ అవకాశాలనూ అందిపుచ్చుకుంటున్నారు. యూట్యూబ్ ద్వారా పాపులరైన గంగవ్వే దీనికో ఉదాహరణ... ఏ రంగంలో, ఏ వేదిక, ఏ మాధ్యమం ద్వారా సక్సెస్ సాధించినా, తెరపై రాణించడం, తద్వారా వచ్చే పాపులారిటీకి సాటిరావు అనేది వాస్తవం.
స్టోరీ టెల్లింగ్, ఫ్యాషన్ కాదేదీ నటనకు అనర్హం..
నగరానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ రామ్... గత కొంత కాలంగా సెలబ్రిటీలకు డిజైన్లు అందించడంలో పేరొందారు. లుక్స్‌లో టాలీవుడ్ హీరోలకు తీసిపోని రామ్... లాక్ డౌన్ టైమ్‌లో దొరికిన ఖాళీ సమయాన్ని నటనాభిరుచితో భర్తీ చేసుకున్నారు. ఆయన పచ్చీస్ పేరుతో రూపొందించిన ఓ సినిమాలో హీరోగా నటించారు. ఆ సినిమా ఆ మధ్య ఓటీటీలో విడుదలైంది.. అదే విధంగా నగరంలో స్టోరీ టెల్లింగ్‌కు కేరాఫ్‌గా పేరొందిన దీపా కిరణ్ కూడా ఇటీవల యాంగర్ టేల్స్ అనే ఓటీటీ చిత్రంలో నటించారు. అందులోని నాలుగు పొట్టి కథల్లో ఒకటైన యాన్ ఆఫ్టర్ నూన్ న్యాప్‌లో ఆమె కనిపిస్తారు. ఈ ఎక్స్‌పీరియన్స్ తనకు కొత్త అనుభూతిని పంచిందని ఆమె అంటున్నారు.
నటనే హాబీగా...
కేరెక్టర్‌కు ఓకె...కెరీర్‌గా నాట్ ఓకె...అంటున్నారు ఈ హాబీ యాక్టర్లు. నటనావకాశాలు వస్తున్నా వరుస పెట్టి సినిమాలు చేసేయాలనే ఆత్రం చూపడం లేదు. తమ కెరీర్‌కు ప్రాధాన్యత ఇస్తూనే అడపాదడపా వచ్చిన ఛాన్సుల్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సినిమా అనేది తమకు అభిరుచి మాత్రమే నని అనేక మంది స్పష్టం చేస్తున్నారు. ‘‘నాట్యం అనేది నా అభిరుచికి, నా ఆలోచనలకు దగ్గరగా ఉన్న సినిమా కాబట్టి నటించాను. అంతే తప్ప సినిమాల్ని కెరీర్‌గా తీసుకునే ఆలోచన లేదు’’ అంటున్నారు సంధ్యారాజు. ప్రముఖ పారిశ్రామిక వేత్త సత్యం రామలింగ రాజు కుటుంబ సభ్యురాలైన సంప్రదాయ నృత్య కారిణి... ఆ మధ్య నాట్యం అనే సినిమాలో కథానాయికగా నటించారు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ పురస్కారానికి కూడా నోచుకుంది. అయినప్పటికీ ఆమె మరో చిత్రంలో నటించలేదు. అదే విధంగా నగరానికి చెందిన ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆకెళ్ల రాఘవేంద్ర కూడా ఒకటి రెండు చిత్రాల్లో కనిపించారు.
కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు.. కోలీవుడ్, మాలీవుడ్ చిత్రాల నిర్మాణానికీ కేరాఫ్ అడ్రస్‌గా మారిన భాగ్యనగరంలో ఓటీటీలు, యూ ట్యూబ్ చిత్రాల వెల్లువతో నటించే సరదా ఉన్న వారికి అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయి. అయితే నటనను జస్ట్ ఫర్ ఛేంజ్ అన్నట్టు çహాబీగా ఎంచుకోవడం వల్ల పెద్ద నష్టం లేకపోయినా, సరైన శిక్షణా నేపధ్యం లేకుండానే పూర్తి స్థాయి కెరీర్‌గా మార్చుకోవాలనే తొందరపాటు మాత్రం సరైంది కాదని అనుభవజ్ఞులు సూచిస్తున్నారు.
ప్రేక్షకాభిరుచిలో మార్పు...
నటనలో పేరున్నవారు, బాగా తెలిసిన ముఖాలను మాత్రమే కాకుండా కొత్త వారిని కూడా ఆదరించే దిశగా ప్రేక్షకుల అభిరుచుల్లో స్పష్టమైన మార్పు వచి్చంది. దీంతో నిర్మాతలు కొత్త నటీనటులతో ప్రయోగాలు చేయడానికి గతంలోలా భయపడడం లేదు. అంతేకాకుండా ఏ రంగంలో ఉన్నవారు ఆ రంగానికి సంబంధించిన పాత్రల్లో కాస్త సులభంగా మమేకమయ్యే వీలుంటుంది. కాబట్టి సినిమాలో వైద్యుడి పాత్ర ఉంటే వైద్యుడిని, లాయర్ పాత్రకు లాయర్‌ని ఎంచుకుంటూన్నారు. దీంతో రంగాలేమైనా తెరంగేట్రం సాధారణ విషయంగా మారిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment