సాధారణంగా సిటీలో పబ్స్, క్లబ్స్‌లో కని/వినపడే డీజేలు, బ్యాండ్స్, సింగర్స్... ఎక్కువగా పాశ్చాత్య పోకడలకు ప్రతీకగా ఉంటారు. వెస్ట్రన్ మ్యూజిక్‌ని ఇష్టపడే యువతను మెప్పించడం వీరి వల్లే సాధ్యమని ఈవెంట్ మేనేజర్లు భావిస్తుండడం వల్ల ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ఇటీవలే వీరి స్థానంలో హిందీ, తెలుగు సంగీతాన్ని అందించే బ్యాండ్స్‌కు ప్రాధాన్యత పెరుగుతోంది.
ఆ థోరణి మరింత బలపడి ఇప్పుడు ఏకంగా తెలుగు గాయనీ గాయకులకు కూడా పబ్స్ రెడ్ కార్పెట్ పరుస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో వియ్ కేర్ సంస్థ ఆధ్వర్యంలో తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితురాలైన ప్రముఖ గాయని గీతా మాధురి తన సొంతంగా సమకూర్చుకున్న బ్యాండ్‌తో కలిసి తొలిసారి నగరంలోని ప్రిజ్మ్ పబ్‌లో శుక్రవారం సాయంత్రం సోలో ప్రదర్శన ఇవ్వనున్నారు. – సాక్షి, సిటీబ్యూరో
ప్రపంచాన్నే మన పాట పాలిస్తోంది.. ఇక పబ్స్‌లో తెలుగు పాట వినిపించడంలో ఆశ్చర్యమేముంది? అంటున్నారు ప్రముఖ నేపథ్యగాయని గీతా మాధురి. ‘సాక్షి’తో పంచుకున్న ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...
సోలోగా...ఇదే తొలిసారి..
నగరంలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది పెళ్లిళ్ల నుంచి పార్టీల వరకూ చాలా రకాల కార్యక్రమాల్లో నాకు అనుభవమే. అయితే మోడ్రన్ కల్చర్‌కు కేరాఫ్‌గా ఉండే యూత్ సమక్షంలో ఒక పబ్‌లో సోలోగా పాడడం ఇదే తొలిసారి. అదీ సొంతంగా ఒక బ్యాండ్‌ను సమకూర్చుకుని, వారితో కలిసి రిహార్సిల్స్ చేసి పబ్ షోలో పాడడం కొత్త అనుభవమే.
అభిమానుల స్పందన తెలుస్తుంది...
అలాగే కార్పొరేట్, కాలేజ్ షోస్ వంటివి కొందరికి మాత్రమే పరిమితమయ్యేవి, అలా కాకుండా ఈ తరహా పబ్లిక్ ఈవెంట్స్ వల్ల ప్రయోజనం ఏమిటంటే.. అభిమాన గాయనీ గాయకుల పాటలు వినాలనుకునే ఎవరైనా షోకి హాజరుకావ్వొచ్చు. అలా మాకు కూడా మా అభిమానుల స్పందనను దగ్గరగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది.
బ్యాండ్ స్టైల్ అంటే ఇదే...
సాధారణంగా లైవ్ పెర్ఫార్మెన్స్‌లో పూర్తి స్థాయి వాద్య బృందంతో కలిసి పాడతాం. అయితే పబ్‌లో మాత్రం ఇద్దరు గిటారిస్ట్, డ్రమ్మర్, కీబోర్డ్ ప్లేయర్.. ఇలా ఓ ముగ్గురు నలుగురు మాత్రమే ఉంటారు. ఆర్కె్రస్టాతో పాడేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా పాడతాం.. అయితే ఇందులో 3, 4 పాటలు కలిపి బ్యాకింగ్ కొంచెం మార్చి.. ఇలా ఎక్స్‌పిరిమెంటల్ టైప్‌లో ఉంటుంది. ఓ రకంగా పాపులర్ సాంగ్‌ని కొత్త ఫ్లేవర్‌లో వినిపించడమే బ్యాండ్ స్టైల్ అనొచ్చు.
మన పాట ప్రపంచవ్యాప్తం...
మన తెలుగు పాటలు ప్రపంచం అంతా ఒక ఊపు ఊపుతున్నాయి. కాబట్టి సిటీలో కూడా పబ్ క్లబ్ అని తేడా లేకుండా అన్ని చోట్లా యూత్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌లో తెలుగు, హిందీ పాటలు పాడడానికి సిద్ధమవుతున్నా..అయితే అక్కడకు వచ్చే క్రౌడ్‌ని బట్టి వారి టేస్ట్‌ని బట్టి అప్పటికప్పుడు పాడాల్సి ఉంటుంది.
భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్స్‌లో పూర్తి స్థాయిలో ఒక పాటల జాబితా ఇచ్చి, దాని ప్రకారం పాడాలనే ఆలోచన ఉంది. ఇక పర్సనల్ లైఫ్‌కి వస్తే..అడపాదడపా సినిమా పాటలు, రెగ్యులర్‌గా కొన్ని ప్రైవేట్ ఈవెంట్స్, ఇవి కాక... ఓటీటీ వేదికగా ఇండియన్ ఐడల్ కు వర్క్ చేస్తున్నాను.
ఇవి చదవండి: ఫుల్కారీ ఎంబ్రాయిడరీలో విభిన్న డిజైన్లు..
Comments
Please login to add a commentAdd a comment