కొన్ని రకాల వ్యాధులు చాపకింద నీరులా నెమ్మదిగా వస్తాయి. మనం కూడా పెద్ద సమస్య కాదని, లైట్‌గా తీసుకుంటాం. అది కాస్త మనం చూస్తుండగానే సీరియస్‌గా మారి ప్రాణాంతకంగా మారుతుంది. అలాంటి వ్యాధి బారినపడి ఇక్కడొక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన స్పెయిన్‌లో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే..స్పెయిన్‌లో 74 ఏళ్ల వ్యక్తి ప్రాణాంతకమైన క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్(సీసీహెచ్‌ఎఫ్) బారిన పడి మరణించాడు. దీనిని "బ్లీడింగ్ ఐస్ వ్యాధి" అని కూడా పిలుస్తారు. ఇది వైరల్ వ్యాధి. దీని కారణంగా మరణాల రేటు సుమారు 40% వరకు ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఆ వ్యక్తి మాడ్రిడ్‌కు నైరుతి దిశలో వంద మైళ్ల దూరంలో ఉన్న టోలెడోలో టిక్ కాటుకు గురవ్వడంతో జూలై 19న మోస్టోల్స్ ప్రాంతంలోని రే జువాన్ కార్లోస్ విశ్వవిద్యాలయ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ వైద్యులు అతడి పరిస్థితిని గుర్తించిన తర్వాత హై-డిపెండెన్సీ ఐసోలేషన్ యూనిట్‌కు తరలించారు.
మొదట్లో పరిస్థితి నిలకడగా ఉన్నా..తర్వాత.. తర్వాత అతడి పరిస్థితి క్షీణించి మరణించడం జరిగింది. దీన్ని క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్(సీసీహెచ్‌ఎఫ్) సంబంధిత మరణంగా పేర్కొన్నారు. అంతేగాదు వైద్యులు అప్రమత్తమై ఈ ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తిని అరికట్టేలా తదుపరి కేసుల్లో ఈ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేలా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. వైద్యులు ఈ టిక్ బోర్న్ వ్యాధి ఎబోలా మాదిరిగా ఉంటుందని, డబ్ల్యూహెచ్‌ఓ జాబితా చేసిన తొమ్మిది వ్యాధికారక క్రిములకు సంబంధించినదని, అంటువ్యాధిలాంటిదని వెల్లడించారు.
క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ అంటే..
క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ (CCHF) అనేది టిక్ కాటు ద్వారా మానవులకు వ్యాపించే అరుదైన వైరల్ వ్యాధి. జంతువులను వధించిన వెంటనే, తక్షణమే వైరమిక్ జంతు కణజాలాలతో (వైరస్ రక్తప్రవాహంలోకి ప్రవేశించిన జంతు కణజాలం) సంపర్కం ద్వారా ఇది సంక్రమిస్తుంది. ఇది అంటువ్యాధులకు కారణమవుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా ఆఫ్రికా, బాల్కన్‌లు, మధ్యప్రాచ్యం, ఆసియాలలో ఉంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఈ వ్యాధిని తొలిసారిగా 1944లోక్రిమియన్ ద్వీపకల్పంలో గుర్తించారు. అందువల్లే దీనికి క్రిమియన్ హెమరేజిక్ ఫీవర్ అని వైద్యులు నామకరణం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ వ్యాధిని 1956లో కాంగో బేసిన్‌లో గుర్తించడం జరిగింది. దీంతో ఈ వ్యాధికి ఈ రెండు ప్రాంతాల మీదుగా క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ అనే పేరుని పెట్టారు నిపుణులు.
ఈ వ్యాధి లక్షణాలు..
తీవ్ర జ్వరం
తీవ్రమైన తలనొప్పి
వెన్ను, కీళ్ల నొప్పులు
కడుపు నొప్పి, వాంతులు
ఎర్రటి కళ్ళు , ఎర్రబడిన ముఖం
నోటి పైకప్పు మీద ఎర్రటి మచ్చలు
కామెర్లు
మానసిక స్థితి, ఇంద్రియ అవగాహనలో మార్పులు
ఆందోళన
నిద్రమత్తు
రక్తస్రావం.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం..ఆస్పత్రిలో చేరిని వారిలో దాదాపు 50% మంది మరణిస్తారని పేర్కొంది.
నివారణ
టిక్ కాటును నివారించడానికి డీఈఈటీ కలిగిన క్రిమి వికర్షకాన్ని ఉపయోగించండి.
సీసీహెచ్‌ఎఫ్ ఉన్న జంతువులను నిర్వహించేటప్పుడు చేతి తొడుగులు, పొడవాటి చేతులు, ప్యాంటు ధరించండి.
సోకిన జంతువులు లేదా వ్యక్తుల శరీర ద్రవాలు మీపై ప్రసరించకుండా జాగ్రత్త పడండి.
(చదవండి: అక్కడ భర్త జీతం అంతా భార్య చేతిలో పెట్టాల్సిందేనట..!)
Comments
Please login to add a commentAdd a comment