మృకండు మహర్షి శివభక్తి పరాయణుడు. ఆయన భార్య మరుద్వతి పరమసాధ్వి. ఒక అరణ్యంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని, వారు సాత్విక జీవనం కొనసాగించేవారు. ఎంతకాలమైనా వారికి సంతానం కలగలేదు. ఎన్నో పూజలు, వ్రతాలు చేసినా ఫలితం దక్కలేదు. చివరకు పరమశివుణ్ణి ఆశ్రయించాలనే ఉద్దేశంతో వారు కాశీకి చేరుకున్నారు. మృకండు మహర్షి, మరుద్వతి దంపతులు కాశీలోనే ఉంటూ, అక్కడ వెలసిన విశ్వేశ్వరుణ్ణి సేవించుకుంటూ ఉండేవారు. ఆలయ సేవ తర్వాత వారు నిత్యం పరమేశ్వర ధ్యానంలోనే గడిపేవారు. కొన్నాళ్లు ఇలా గడిచాక వారి దీక్షకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు.
పరమశివుడు వారిని పరీక్షించాలనుకున్నాడో, ఏమో: ‘మీకు పుత్రసంతానాన్ని ప్రసాదిస్తాను. అయితే, ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి. దుర్మార్గుడై వందేళ్లు జీవించే దీర్ఘాయుష్కుడా లేక సన్మార్గుడై పదహారేళ్లు మాత్రమే జీవించే అల్పాయుష్కుడా?’ అన్నాడు. ‘దుర్మార్గుడైన కొడుకు ఎన్నాళ్లు బతికితేనేం? సన్మార్గుడు, గుణవంతుడు అయిన కొడుకు చాలు. అలాంటి వాడు పట్టుమని పదహారేళ్లు మా కళ్ల ముందు బతికినా అదే పదివేలు’ అన్నారు మృకండు దంపతులు.పరమశివుడి వర ప్రభావంతో మృకండు దంపతులకు ఒక కుమారుడు కలిగాడు. మృకండుడి కొడుకు కావడం వల్ల మార్కండేయుడిగా ప్రసిద్ధి పొందాడు. శివుడి మాట ప్రకారం మార్కండేయుడు ఊహ తెలిసిన నాటి నుంచి సద్గుణవంతుడిగా ఉండేవాడు.
బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలనూ చదివేశాడు. ఇలా ఉండగా, ఒకనాడు సప్తర్షులు మృకండు మహర్షి ఆశ్రమానికి వచ్చారు. వారు అక్కడే ఉన్న మార్కండేయుని చూశారు. దివ్యదృష్టితో పరిశీలించిన వారికి త్వరలోనే ఆ బాలుడి ఆయుష్షు తీరిపోతుందని అర్థమైంది. వెంటనే వారు మార్కండేయుని బ్రహ్మదేవుడి వద్దకు తీసుకుపోయి, తరుణోపాయం చెప్పమని కోరారు.‘నిత్యం శివారాధన చేస్తూ ఉండు. అంతా శుభమే జరుగుతుంది’ అని మార్కండేయుడికి సలహా ఇచ్చాడు బ్రహ్మదేవుడు. శివనామ స్మరణ వల్ల అకాలమృత్యువు దాపురించదని సప్తర్షులు కూడా మార్కండేయుడికి చెప్పారు.
పెద్దలు చెప్పిన మాట ప్రకారం మార్కండేయుడు ఆనాటి నుంచి శివలింగం ముందు కూర్చుని శివనామ స్మరణ చేయసాగాడు. మార్కండేయుడికి పదహారో ఏడు వచ్చింది. ఒకవైపు అతడికి మృత్యు ఘడియలు సమీపంచసాగాయి. మరోవైపు మార్కండేయుడి శివనామ స్మరణ జోరందుకుంది.మృత్యుఘడియలు ఒక్కో నిమిషమే దగ్గరవుతున్న కొద్ది మార్కండేయుడి శివనామ స్మరణ ఉద్ధృతి తీవ్రంగా మారింది. మృత్యు సమయం ఆసన్నమైంది. మార్కండేయుడి ప్రాణాలను తీసుకు రమ్మని యముడు తన భటులను పంపాడు. యముని ఆదేశంతో వారు బయలుదేరారు.
యమభటులు భూమ్మీదకు అడుగుపెట్టే సరికి మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఏకధాటిగా శివనామ స్మరణ కొనసాగిస్తూ ఉన్నాడు. యమభటులు అతడు ఉన్నచోటకు అల్లంత దూరంలోనే నిలిచిపోయారు. శివనామ మహిమ ప్రభావంతో అతడిని సమీపించడానికి వారి అడుగులు ముందుకు పడలేదు. చేసేదేమీ లేక వారు వెనుదిరిగి, యముడికి జరిగినందా విన్నవించారు.
ఈసారి యముడు తానే స్వయంగా మహిష వాహనంపై హుటాహుటిన బయలుదేరాడు. మార్కండేయుడు ఉన్న చోటుకు చేరుకున్నాడు. మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుని, తదేక ధ్యానంలో మునిగి శివనామ స్మరణను నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉన్నాడు.
‘మార్కండేయా! నీకు మృత్యువు సమీపించింది. ధ్యానం మాని బయటకు రా!’ అని యముడు బిగ్గరగా హుంకరించాడు. యముడి మాటలు విన్న మార్కండేయుడు బయటకు రాలేదు సరికదా, శివలింగాన్ని మరింత గట్టిగా వాటేసుకుని, మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడు. యముడు మార్కండేయుడిని సమీపించలేక, అల్లంత దూరం నుంచే అతడి మీదకు తన పాశాన్ని విసిరాడు. యమపాశం మార్కండేయుడితో పాటు, మార్కండేయుడు గట్టిగా వాటేసుకున్న శివలింగాన్ని కూడా చుట్టుకుంది. శివలింగానికి యమపాశం తాకినంతనే శివుడు క్రోధావేశంతో ప్రళయరుద్రుడిలా అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
‘నా ఆశ్రయంలో ఉన్న నా భక్తుడి మీదకు, నా మీదకు నీ పాశాన్ని విసురుతావా? ఎంత ధైర్యం?’ అంటూ త్రిశూలంతో యముడిని ఒక్కపోటు పొడిచాడు. యముడు అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటనకు దేవతలందరూ దిగ్భ్రాంతులయ్యారు. హుటాహుటిన శివుడి వద్దకు వచ్చారు.‘యముడే లేకపోతే, జీవుల జనన మరణ చక్రం నిలిచిపోతుంది. దేవాదిదేవా! దయతలచి యముడిని మళ్లీ బతికించు’ అని ముక్తకంఠంతో ప్రార్థించారు. వారి ప్రార్థనలకు శాంతించిన శివుడు యముడిని పునర్జీవితుణ్ణి చేశాడు. ‘మరెప్పుడూ మార్కండేయుడి జోలికి రావద్దు. ఇక నుంచి మార్కండేయుడు చిరంజీవి. అంతేకాదు, ఇకపై శివభక్తులను నరకానికి తీసుకుపోవద్దు’ అని యముడిని హెచ్చరించి విడిచిపెట్టాడు శివుడు.పరమశివుడి అనుగ్రహంతో అల్పాయుష్కుడిగా పుట్టిన మార్కండేయుడు చిరంజీవిగా మారాడు.
∙సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment