విద్యార్థికి పరీక్షే కీలకం.అది రాయలేని పరిస్థితి ఉంటే?దివ్యాంగులు అయి ఉంటే?సహాయకులు కావాలి.కానీ పరీక్ష రాసి పెట్టడానికి అందరూ పనికి రారు. అందుకు ఎంతో ఓర్పు, సహనం, సేవాభావం కావాలి.బెంగళూరుకు చెందిన పుష్ప అలాంటి విద్యార్థుల కోసందాదాపు వేయికి పైగా పరీక్షలు రాసింది. ఆమె పరిచయం.
బెంగళూరుకు చెందిన 35 ఏళ్ల పుష్ప ఎన్ ఎం ఇప్పటికి 1086 పరీక్షలు రాసింది. ఆమె కోసం కాదు. దివ్యాంగుల కోసం, కలం పట్టుకునే వీలు లేని కండరాల సమస్య ఉన్నవారి కోసం, పరీక్షల ముందు యాక్సిండెంట్‌లకు గురయ్యి రాసే వీలు లేని వారి కోసం... ఆమె పరీక్షలు రాస్తూనే ఉంది. ఇంకా రాయాలనే అనుకుంటోంది. ‘ఒక దివ్యాంగ పిల్లవాడికి మీరు పరీక్ష రాసిపెట్టండి. రిజల్ట్స్ వచ్చి ఆ పరీక్ష పాసయ్యాక ఆ పిల్లవాడి కళ్లల్లో కనిపించే కృతజ్ఞతకు మీరు విలువ కట్టలేరు’ అంటుంది పుష్ప.
2007లో అనుకోకుండా
ఆ రోజు పుష్ప రోజూ వెళ్లే బస్సులో కాకుండా నడిచి ఇంటికి వెళ్లాలనుకుంది. ఆ నడకే ఆమె జీవితాన్ని మార్చింది. దారిలో ఒక అంధ కుర్రవాడు రోడ్డు దాటించమని సహాయం అడిగాడు. పుష్ప రోడ్డు దాటిస్తూ మాట కలిపింది. ఆ కుర్రవాడు వచ్చే నెలలో ఎస్‌ఎస్‌ఎల్‌సి పరీక్షలు రాయనున్నాడు.‘నాకు మీరు పరీక్షలు రాసి పెడతారా?’ అని అడిగాడు. పుష్ప ఆలోచనలో పడింది. ‘మీలాంటి వాళ్లు మా కోసం ముందుకొస్తే మేము మా జీవితంలో ముందుకెళతాం’ అని ఆ అబ్బాయి అన్నాడు. ఆ మాట ఆమె మీద చాలా ప్రభావం ఏర్పరిచింది. ‘అప్పటి వరకూ నా జీవితానికి అర్థమేమిటా అనే ఆలోచన ఉండేది. ఆ క్షణాన ఇలాంటి వారికి సాయం చేయడానికే పుట్టానేమో అనుకున్నాను’ అంటుంది పుష్ప.
అంత సులభం కాదు
దివ్యాంగులకు, అంధులకు,సెరిబ్రల్ పాల్సీ.. డౌన్ సిండ్రోమ్... డిస్‌లెక్సియ వంటి బుద్ధిమాంద్యం సమస్యలు ఉన్నవారు పరీక్షలు రాయాలంటే వారికి లేఖకులుగా ఉండటం అంత సామాన్యం కాదు. ‘ముందు మీకు ఓపిక ఉండాలి. వాళ్లు ప్రశ్నను మళ్లీ మళ్లీ చదివి వినిపించమంటారు. ఒక్కోసారి నేను ఒక ప్రశ్నను ముప్పై నలభైసార్లు చదివి వినిపించిన సందర్భాలున్నాయి. అలాగే మీకు శ్రద్ధగా వినే శక్తి ఉండాలి. జవాబు చెప్పే పిల్లలు కొందరు మరీ నెమ్మదిగా, కొందరు మరీ వేగంగా చెప్తారు. అర్థం చేసుకుని రాయాలి. వారు రాసే సబ్జెక్ట్‌లు మీరు చదివినవి కావు. అందుకని కూడా మీరు జవాబులను పూర్తిగా అర్థం చేసుకుంటూ రాయాల్సి వస్తుంది. మనల్ని పర్యవేక్షిస్తుంటారు. కాబట్టి గ్రామర్ వంటివాటిల్లో చిన్న సాయం చేయొచ్చు కానీ మన తెలివి వారికి అందివ్వలేం. నిజాయితీ ముఖ్యం’ అంటుంది పుష్ప. ఆమె ఇప్పటి వరకూ పది, ఇంటర్, డిగ్రీ, పిహెచ్‌డి, బ్యాంకు పరీక్షలు... ఇలాంటివి ఎన్నో రాసి పెట్టింది.
అడిగిన వెంటనే సెలవు
పుష్ప బెంగళూరులో ఒక ఐటీ కంపెనీలో పని చేస్తుంది. లేఖకురాలిగా ఆమెకు ఉన్న డిమాండ్‌ను చూసి ఐటి కంపెనీ ధారాళంగా సెలవులు ఇస్తూ ప్రోత్సహిస్తోంది. ఇది మంచి పనే అని మెచ్చుకుంటోంది. పుష్ప ఇంగ్లిష్, హిందీ, కన్నడ, తెలుగు, తమిళ భాషల్లోని విద్యార్థుల కోసం పరీక్షలు రాసి పెడుతోంది. ఇలాంటి విద్యార్థుల కోసమే తెలుగు, తమిళ భాషలను షార్ట్ టర్మ్ కోర్సులు చేసి నేర్చుకుంది. ‘నా బాల్యంలో మా నాన్న రోజు కూలీగా ఉండేవాడు. ఆయనకు ప్రమాదం జరిగి మంచాన పడితే మంచి మనసున్న వారి సాయంతో చదువుకున్నాను. ఇప్పుడు ఆ బాకీని ఇలా తీర్చుకుంటున్నాను’ అంటుంది పుష్ప.ఇంత అద్భుతమైన సేవ చేస్తున్నది కాబట్టే 2019లో నాటి రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా నారీశక్తి పురస్కార్ అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment