‘మేము షాక్‌లో ఉన్నాం’ అంటూ మైఖేలా డిప్రిన్స్ ఆకస్మిక మరణంపై స్పందించారు ఆమె కుటుంబ సభ్యులు. అయితే 29 ఏళ్ల ‘బ్యాలే ఐకాన్’ మైఖేలా డిప్రిన్స్ మరణం ఆమె కుటుంబ సభ్యులను మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్న వయసులోనే బ్యాలే ప్రపంచంలో పెద్ద పేరు తెచ్చుకున్న మైఖేలా డిప్రిన్స్ తన కీర్తి దగ్గరే ఆగిపోలేదు. ఆఫ్రికాలోని తన మూలాల్లోకి వెళ్లింది. యుద్ధ బాధిత పిల్లల కన్నీళ్లు తుడిచింది. వారికి ధైర్యాన్ని బహుమానంగా ఇచ్చి వెళ్లింది.
దేశంలో ఎటు చూసినా అల్లర్లు. అంతులేని హింస. ఆ అంతర్యుద్ధకాలంలో మూడేళ్ల మాబింటి తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారింది. బంధువులు ముఖం చాటేశారు. అనాథాశ్రమంలోనూ ఆ అమ్మాయి ఎన్నో కష్టాలు పడింది. చర్మ సమస్యలతో బాధ పడుతున్న మాబింటిని తోటి వాళ్లు ‘దెయ్యం పిల్ల’ అని వెక్కిరించేవాళ్లు. ఒక అమెరికన్ కుటుంబం మాబింటి బంగురాను దత్తత తీసుకోవడంతో ఆమె పేరు మైఖేలా డిప్రిన్స్‌గా మారింది. కష్టాలకు ‘శుభం’ కార్డు పడినట్లు అనిపించినా అది తాత్కాలికమే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త సమస్యలు ఎదురొచ్చేవి.
ఐదవ ఏట బ్యాలేలో శిక్షణ తీసుకోవడం మొదలు పెట్టింది డిప్రిన్స్. రాక్ స్కూల్ ఫర్ డ్యాన్స్ ఎడ్యుకేషన్ స్టూడెంట్ అయిన డిప్రిన్స్ ప్రతిష్ఠాత్మకమైన అమెరికన్ బ్యాలే థియేటర్‌లో చదవడానికి ఎంపికైంది. కెరీర్ ప్రారంభంలోనే ‘బోస్టన్ బ్యాలే’లాంటి ప్రసిద్ధ కంపెనీలతో కలిసి పనిచేసింది.కొద్దికాలంలోనే ‘బ్యాలే’ లో ప్రపంచస్థాయి గుర్తింపు పోందింది. హైస్కూల్ చదువు పూర్తయిన తరువాత ప్రసిద్ధ హార్లెం డాన్స్ థియేటర్‌లో అది పిన్న వయస్కురాలు అయిన మెయిన్ డ్యాన్సర్‌గా డిప్రిన్స్ చరిత్ర సృష్టించింది.
వృత్తి విజయాల మాట ఎలా ఉన్నా మరోవైపు... జాత్యహంకార కామెంట్స్ డిప్రిన్స్‌కు తరచుగా ఎదురయ్యేవి. అయితే తనని ఎవరైనా కించపరిచేలా కామెంట్ చేస్తే గట్టిగా సమాధానం చెప్పేది. తన జాతి జనుల గురించి, వారి సంస్కృతి గురించి గొప్పగా మాట్లాడేది.‘బ్యాలే’కు ఎంత ప్రాధాన్యత ఇచ్చేదో మానవత్వానికి అద్దం పట్టే కార్యక్రమాలకూ అంతే ప్రాధాన్యత ఇచ్చేది. తాను పుట్టి పెరిగిన ఆఫ్రికాలోని సియోర లియోన్ దేశంలో పేద పిల్లల కోసం డ్యాన్స్ స్కూల్ స్థాపించింది.‘మార్పు తెచ్చే శక్తి కళకు ఉంది. నా విషయానికి వస్తే నృత్యం అనేది ఇతరులతో నా భావోద్వేగాలను పంచుకోవడానికి ఉపకరణంలా పనికి వచ్చింది’ అనేది డిప్రిన్స్.
‘వార్ చైల్డ్ నెదర్‌ల్యాండ్స్’ అంబాసిడర్‌గా పనిచేసిన డిప్రిన్స్ ‘డేర్ టు డ్రీమ్’ సంస్థ ద్వారా యుద్ధబాధిత పిల్లల మానసిక ఆరోగ్యం కోసం కృషి చేసింది. సేవారంగంలో డిప్రిన్స్ కృషిపై ‘ఫస్ట్ పోజిషన్’ అనే డాక్యుమెంటరీ వచ్చింది. డిప్రిన్స్ ఎదుర్కొన్న కష్టాలకు ఆమె రాసిన ‘టేకింగ్ ఫ్లైట్: ఫ్రమ్ వార్ ఆర్ఫన్ టు స్టార్ బ్యాలెరీన’ పుస్తకం అద్దం పడుతుంది.తాము పని చేస్తున్న రంగంలో పెద్ద పేరు రాగానే చాలామంది కళ్లు ఆకాశానికేసి మాత్రమే చూస్తాయి. కాని మైఖేలా డిప్రిన్స్ విషయంలో అలా జరగలేదు. ఆమె నేల కేసి చూడడమే కాదు, తాను నడిచి వచ్చిన దారిని బాగా గుర్తు పెట్టుకుంది.అందుకే ‘బ్యాలే ఐకాన్’గా కంటే ‘మానవతావాది’ ‘ఆత్మాభిమానం మూర్తీభవించిన సాహసి’గా మైఖేలా డిప్రిన్స్‌ను గుర్తు తెచ్చుకోవడానికి అభిమానులు ఇష్టపడతారు.
కూతురిని వెదుక్కుంటూ వెళ్లింది
తన కుమార్తె మైఖేలా డిప్రిన్స్ మరణించిన 24 గంటల్లోనే ఆమె తల్లి ఎలైన్ డిప్రిన్స్ కన్నుమూసింది. ఆస్పత్రిలో సర్జరీకి సన్నద్ధమవుతున్న సమయంలో ఎలైన్‌కు కుమార్తె మరణం గురించి తెలియదు. డిప్రిన్స్‌ను దత్తపుత్రిక అని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. సొంతబిడ్డలాగే చూసుకుంది. బ్యాలేపై డిప్రిన్స్ ఆసక్తిని గమనించి శిక్షణ ఇప్పించింది. ఎలైన్, చార్లెస్ దంపతులకు 11 మంది పిల్లలు. వీరిలో తొమ్మిదిమంది దత్తత తీసుకున్న పిల్లలే.
Comments
Please login to add a commentAdd a comment