కార్నివాల్ అంటే బ్రెజిల్‌లో జరిగే రియో కార్నివాల్ ఎక్కువమందికి గుర్తుకొస్తుంది. ఆఫ్రికా దేశమైన కెన్యాలో కూడా దాదాపుగా అదే స్థాయి కార్నివాల్ ఏటా జరుగుతుంది. కెన్యా తీర నగరమైన మొంబాసాలో ఏటా నవంబర్ నెలలో నెల పొడవునా కార్నివాల్ సందడిగా జరుగుతుంది. ఈ నెల్లాళ్లూ మొంబాసా నగరంలోని వీథులన్నీ రకరకాల ఊరేగింపులతో, సంప్రదాయ నృత్య సంగీత ప్రదర్శనలతో కోలాహలంగా కనిపిస్తాయి. తూర్పు ఆఫ్రికాలో జరిగే అతిపెద్ద సాంస్కృతిక వేడుక ఇది. తూర్పు ఆఫ్రికాలోని సాంస్కృతిక భిన్నత్వాన్ని ఏకతాటిపైకి తెచ్చే వేడుకగా సాగే ఈ కార్నివాల్‌లో ప్రతిరోజూ సంప్రదాయ వేషధారణలతో నృత్య సంగీతాలతో జరిగే ఊరేగింపులు ఉంటాయి.
బహిరంగ వేదికల మీద నృత్య, సంగీత ప్రదర్శనలు ఉంటాయి. కళా ప్రదర్శనలు, రకరకాల పోటీలు జరుగుతాయి. తూర్పు ఆఫ్రికా సంప్రదాయ సంగీత రీతులైన ‘బెంగా’, ‘తారబ్’, సంప్రదాయ నృత్యరీతులైన ‘చకాచా’, ‘గిరియామా’ ప్రదర్శనలతో పాటు, స్థానిక మత్స్యకారులు చేసే వివిధ సంప్రదాయ నృత్య సంగీత ప్రదర్శనలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. స్వాహిలి, మిజికెందా, తైటా తెగల ప్రజలు ఎక్కువగా ఈ ప్రదర్శనలు చేస్తారు. ఈ కార్నివాల్‌లో కొత్తతరం యువతీ యువకులు హిప్ హాప్, ఆఫ్రో ఫ్యూజన్ వంటి ఆధునిక సంగీత, నృత్య ప్రదర్శనలు చేస్తారు.
మొంబాసా కార్నివాల్ స్థానిక చేతివృత్తుల వారికి ప్రధాన వేదికగా నిలుస్తుంది. హస్తకళా నైపుణ్యంతో వారు తయారు చేసిన సంప్రదాయ వస్తువుల అమ్మకాల కోసం ప్రధాన కూడళ్లలోను, ప్రత్యేక మైదానాల్లోను తాత్కాలికంగా దుకాణాలతో ప్రదర్శనశాలలు ఏర్పాటవుతాయి. దేశ విదేశాల నుంచి ఈ కార్నివాల్‌ను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు ఇక్కడి చేతివృత్తుల వారు తయారు చేసిన వస్తువులను జ్ఞాపికలుగా కొనుగోలు చేసి తీసుకువెళుతుంటారు. ఈ ప్రదర్శనశాలలోనే ఆఫ్రికన్ సంప్రదాయ వంటకాలు, విదేశీ వంటకాలతో ఆహారశాలలు కూడా ఏర్పాటవుతాయి. కార్నివాల్ జరిగే నెల్లాళ్లూ విందు వినోదాలు, కళా ప్రదర్శనలు, రకరకాల పోటీలు, శిక్షణ శిబిరాలు, సాంస్కృతిక పరిరక్షణపై చర్చా కార్యక్రమాలు విరివిగా జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment