Sania Mistry : ఆకలికి పేద, గొప్ప తేడా ఎలా ఉండదో...ప్రతిభకూ అదే వర్తిస్తుందని నిరూపిస్తోంది సానియా. పుట్టింది నిరుపేద కుటుంబం. కానీ తన కల చాలా పెద్దది. ఒక్కసారి చూసినా, విన్నా చటుక్కున పట్టేసే నైపుణ్యం ఉండడంతో ఏకంగా ర్యాపర్‌గా మారింది సానియా. పదిహేనేళ్ల వయసులోనే ఆమె రాసి, పాడిన ర్యాప్ సాంగ్ అందరినీ అలరించింది. పెద్ద అనుభవం లేకపోయినా ర్యాప్ సాంగ్స్ రచించి తనే స్వయంగా ఆలపిస్తూ శ్రోతలను అలరిస్తోంది.
తూర్పు ముంబైలో గోవండి మురికివాడలో పూట గడవడమే కష్టంగా రోజులు దొర్లించే ఓ నిరుపేద కుటుంబంలో పుట్టింది ‘సానియా మిస్త్రీ ఖైయుముద్దీన్’. తండ్రి ఆటో నడుపుతూ, తల్లి కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సానియా ఎనిమిదో తరగతిలో ఉండగా ఒకసారి ఇండియాలోనే పాపులర్ ర్యాపర్‌లు అయిన ఎమివే బంటాయ్, వివియన్ ఫెర్నాండెజ్‌ల ర్యాప్ సాంగ్స్ అనుకోకుండా ఆమె చెవిన పడ్డాయి.
ఆ పాటలు ఆమెకు బాగా నచ్చడంతో పాటలలోని పదాలను నిశితంగా చూసింది. అవి తనకి ఎంతో ముచ్చటగా అనిపించాయి. తాను కూడా ఇలా చిన్న చిన్న పదాలతో పాటలు రాసి పాడాలని నిర్ణయించుకుంది. సమయం దొరికినప్పుడల్లా ర్యాప్ పాటలు రాయడానికి ప్రయత్నించేది. అలా రాస్తూ రాస్తూ బాగా రాశాననిపించిన పాటను తన స్నేహితుల ముందు పాడి వినిపించింది. ‘‘చాలా బావుంది’’ అని వారు చెప్పడంతో మరింత సీరియస్‌గా పాటలు రాయడానికి ప్రయత్నించేది.
ఫోన్ కూడా లేదు...
ర్యాప్‌సాంగ్స్ రాయడం, పాడడం వచ్చినప్పటికీ నిరుపేద కుటుంబం కావడంతో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడానికి కనీసం తన దగ్గర స్మార్ట్ ఫోన్ కూడా లేదు. దీంతో ఎలాగైనా తన పాటలను అప్‌లోడ్ చేయాలనుకుని ఎవరినో బతిమాలి ఫోన్ తీసుకుని, ఆరోతరగతి చదువుతున్న తమ్ముడు ఆరీఫ్‌ని వీడియో తీయమని చెప్పి...ర్యాప్ సాంగ్‌ను పాడింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది.
అది చూసిన వారందరూ చాలా బావుందని మెచ్చుకోవడంతో మరిన్ని వీడియోలు రూపొందించాలన్న కోరిక కలిగింది. అయితే వీడియో షూట్ ఎలా చేయాలి? వాటిని ఆకర్షణీయంగా కనిపించేలా ఎడిటింగ్ ఎలా చేయాలి వంటి విషయాలేమీ సానియాకు తెలియదు. అయినా తన స్నేహితుల సాయంతో ఎలాగో ఒకలాగా వీడియోలు రూపొందించి వాటినే పోస్టు చేసేది. అవి పాపులర్ అవుతుండడంతో మరింత ఉత్సాహంతో పాటలు రాస్తూ పాడుతూ ముంబై ‘హిప్ అప్’ సర్కిల్‌లో చేరి ర్యాపర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తొలిసాంగ్..
తొలి ర్యాప్ సాంగ్‌ను స్థానికంగా ఉన్న ఎన్జీవోపై రాసింది. తరువాత కోవిడ్–19 మీద రాసుకున్న పాట పాడింది. ఈ రెండింటికి మంచి స్పందన లభించడంతో ఇక ఆమె వెనక్కు తిరిగి చూసుకోలేదు. అప్పటినుంచి ఇప్పటిదాకా పాటలు పాడుతూనే ఉంది. రోజూ కూలి పనిచేసి బతికే కుటుంబం కావడంతో లాక్ డౌన్ సమయంలో..చాలా ఇబ్బందులకు గురయ్యారు. వాటన్నింటిని ప్రత్యక్షంగా అనుభవించిన సానియా... ఈ లాక్‌డౌన్ ఎప్పుడు ఆగిపోతుంది? సమాధానాలు చెప్పడంలో మీరు ఎప్పుడూ ఫెయిల్ అవుతున్నారు? సమాధానాలు ఎందుకు చెప్పరు? అని ప్రభుత్వాలను నిలదీస్తూ ర్యాప్ సాంగ్ పాడింది.
సానియా పాడిన వాటిలో ‘‘ఫ్యూచర్ కా క్యా’’, జనతా హై కౌన్’’, ‘‘భ్రమ్’’ ‘‘బహోత్ ధీట్’’ వంటి పాటలు బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సానియా ఎమ్‌క్యూ యూట్యూబ్ చానల్‌కు దాదాపు మూడున్నర వేలకు పైగా, ఇన్‌స్టా గ్రామ్‌లో పదమూడువందల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న సానియా, చదువుతోబాటు మంచి ర్యాపర్‌గా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది.
‘‘అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టాను. కొన్నిసార్లు పస్తులతో పడుకోవాల్సి వచ్చేది. అయినా ఎప్పుడూ బాధపడలేదు. ర్యాప్ సాంగ్స్ నచ్చడంతో రాయడం మొదలు పెట్టాను. స్కూల్లో టీచర్స్ కూడా నాకు మద్దతుగా నిలవడంతో ర్యాపర్‌గా రాణించగలుగుతున్నాను. భవిష్యత్‌లో మరెన్నో సాధిస్తాను’’ అని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్న సానియా ముందు ముందు మరెన్నో విజయాలు సాధించగలదని నమ్మకంగా చెప్పవచ్చు.
చదవండి: Acid Attack Survivor Yasmeen: దేశంలోనే తొలి యాసిడ్ సర్వైర్ నర్స్
Jayanthi Narayanan Life Story: ఒక అమ్మ .. 1000 మంది పిల్లలు
Comments
Please login to add a commentAdd a comment