
ఒంట్లో బాగోలేదు. ఆ వెచ్చదనం బట్టలకు తెలుస్తుంది. మనసు బాగోలేదు. తెలుస్తుందా బట్టలకు?! ఒంటి మీద ఉన్నవాటికి తెలియకపోవచ్చు. ఇష్టమైన డ్రెస్ ఒకటి ఉంటుంది. ఆ డ్రెస్‌కి తెలుస్తుంది. డయానాకు మనసు బాగోలేనప్పడు.. ఆమె పెళ్లి గౌనుకు తెలిసేది!! వెళ్లి టచ్ చేస్తారు డయానా. గౌనుకు మొత్తం తెలిసిపోతుంది!
సంతోషంగా ఉన్నారు లేడీ డయానా. ప్రిన్స్ చార్ల్స్‌తో వివాహం కాగానే ఆమె ప్రిన్సెస్ డయానా అవుతారు. అయితే పూర్తిగా అది మాత్రమే ఆమె సంతోషం కాదు. తను ధరించి ఉన్న వెడ్డింగ్ గౌన్ ఆమెను ఎగిరేందుకు ఉత్సాహపడుతున్న ఒక తెల్లని పావురంలా మార్చేసింది. లండన్‌లోని సెయింట్ పాల్స్ కెథడ్రాల్‌లో ఆమె తన 25 అడుగుల పొడవున వెనుక పారాడే వస్త్రం గల గౌనును రెండు చేతులతో ఎత్తిపట్టి అడుగుల్ని సుళువు చేసుకుంటూ నెమ్మదిగా నడుస్తూ ఉన్నారు. ఫ్యాషన్ డిజైనర్‌ల పరిభాషలో ఆ గౌను సాంకేతిక నామం ‘ఐవరీ సిల్క్ టఫేటా యాంటిక్ లేస్ గౌన్’. భార్యాభర్తలైన డేవిడ్, ఎలిజబెత్ అనే ఇద్దరు డిజైనర్‌లు లేడీ డయానా కోసం అప్పటికి కొన్ని నెలల ముందుగా తమకు అందిన ఇంగ్లండ్ ఆస్థాన ఆదేశాల మేరకు, డయానా అభీష్టానికి అనుగుణంగా కుట్టి తెచ్చారు. ఇప్పటి ధరల ప్రకారం అప్పటి ఆ గౌను కోటీ నలభై నాలుగు లక్షల రూపాయలు.
ఖరీదు విషయంలో బ్రిటన్ రాజకుటుంబానికి అది నిరాడంబరమైన వస్త్ర విశేషమే. అయితే లేడీ డయానాకు పెళ్లికి ముందే ప్రిన్స్ డయానా హోదాను కల్పించిన ఆ గౌనుకు నకళ్లను కనిపెట్టేందుకు ఆ మర్నాటి నుంచే ఫ్యాషన్ ప్రపంచం తన కుట్టు మిషన్‌లకు సూదులు మెత్తగా కదలే మేర కొన్ని నూనె చుక్కలు వేసి కసరత్తులు చేయించడం మొదలు పెట్టింది. డయానా వెడ్డింగ్ గౌన్ ప్రపంచ దుస్తుల ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఒక చరిత్రాత్మక మార్మికత. డయానాకు షిఫాన్ బ్లవుజులంటే ప్రాణం. ఆమె కోసం వాడుకగా ఆ బ్లవుజులను కుట్టి తెస్తుండే డిజైనర్‌లకే డయానా తన పెళ్లి గౌను కుట్టే బాధ్యతనూ అప్పగించారు. గౌనుపై వాళ్లు పదివేల మేలిమి ముత్యాలను పొదిగారు. రెండేళ్ల క్రితం ‘టైమ్’ మ్యాగజీన్ ‘మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ బ్రిటిష్ రాయల్ వెడ్డింగ్ డ్రసెస్ ఆఫ్ ఆల్ టైమ్’గా డయానా వెడ్డింగ్ గౌన్‌ను ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆ గౌను డయానా చిన్న కొడుకు ప్రిన్స్ హ్యారీ దగ్గర ఉంది. హ్యారీకి చిన్నప్పట్నుంచీ అమ్మకు దగ్గర. తల్లి చనిపోయేనాటికి అతడి వయసు 13 ఏళ్లు మాత్రమే.
1981 జూలైలో పెళ్లి వేడుకకు డయానా ధరించిన గౌను లాంటి గౌనే ఇప్పుడు మళ్లీ తయారైంది! నెట్‌ఫ్లిక్స్ వెబ్ సీరీస్ ‘ది క్రౌన్’ నాలుగో సీజన్‌లో డయానా పాత్రను పోషిస్తున్న ఎమ్మా కారిన్ కోసం 71 ఏళ్ల బ్రిటన్ కాస్ట్యూమ్స్ డిజైనర్ యామీ రాబర్ట్స్ ఈ గౌన్‌ని డిజైన్ చేశారు. నాటి గౌనుకు జతగా ఉన్న 153 గజాల తెల్లటి ట్రాన్స్‌పరెంట్ తల ముసుగు (ట్యూల్ వెయల్) ను కూడా అచ్చుగుద్దినట్లుగా డిజైన్ చేశారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ నెట్‌ఫ్లిక్స్ సోమవారం నాడు డయానా గౌన్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది. నవంబర్ 15న మనం మళ్లీ డయానా పెళ్లిని చూడబోతున్నాం. ఫిక్షన్ గౌను మాట అటుంచితే, ప్రిన్సెస్ డయానా పెళ్లి గౌన్‌తో కలగలిసి అనేక ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి.
‘ది క్రౌన్’ వెబ్ సీరీస్‌లో డయానా పాత్రధారి ఎమ్మా కారిన్
వాటిల్లో ఒక విశేషాన్ని ఆమె మాటల్లో చెప్పుకోవడమే బాగుంటుంది. ‘‘పెళ్లి గౌనుకు కొలతలు ఇచ్చే సమయానికి 29 అంగుళాలు ఉన్న నా నడుము చుట్టుకొలత పెళ్లి ముందు నాటికి 23 అంగుళాలకు తగ్గిపోయింది. ఇదంతా కూడా ఫిబ్రవరి–జూలై మధ్యన జరిగింది. డైటింగ్ చేస్తున్నాను అనుకున్నాను కానీ, పెళ్లి గౌను కొలతల్ని ఎందుకు పట్టించుకుంటాను? గౌను రెడీ అయి వచ్చాక వేసుకుని చూస్తే నడుము భాగం చాలా వదులు అయింది. వదులు తగ్గించడం కోసం గౌను లోపలికి మరికొన్ని కుట్లు వేయించవలసి వచ్చింది’’ అని, పెళ్లి తర్వాత ఎప్పటికో ఒక ఇంటర్వూ్యలో నవ్వుతూ చెప్పారు డయానా.
డయానా మేకప్ కోసం బార్బారా డేలీ అనే ఆర్టిస్ట్ ఉండేవారు. పెళ్లి గౌను సిద్ధమై వచ్చిన రోజు డయానా ఆ గౌనుపై పెర్‌ఫ్యూమ్ ఒలకబోసుకున్నారు. అసలే తెల్ల గౌను. మరకలు ఉండిపోతాయేమోనని డయానా విలవిల్లాడిపోయారు. అప్పుడు ఆమె పక్కనే ఉన్నారు బార్బారా డేలీ. డయానా బాధను చూసి, ‘పర్లేదు, యువర్ మెజెస్టీ. గౌనులోని పొరల్లో పెర్‌ఫ్యూమ్ ఆవిరైపోతుంది’ అని చెప్పారు. ఆమె చెప్పినట్లే పెర్‌ఫ్యూమ్ ఛాయలే కనిపించకపోవడంతో డయానా ఊపిరి పీల్చుకున్నారు. రోసాలిండ్ కోవార్డ్ రాసిన ‘డయానా: ది పోట్రెయిట్’ (2004) పుస్తకంలో ఈ ప్రస్తావన కనిపిస్తుంది. పెళ్లయ్యాక తండ్రి పక్కన కూర్చొని కొంత దూరం గ్లాసు పల్లకిలో ప్రయాణించే సంప్రదాయం ఉంటుంది బ్రిటన్ రాజకుటుంబాల్లో. డయానా ఆ రోజు పల్లకీలో కూర్చోడానికి గౌను బాగా పెద్దదైపోయింది. గౌను కిందిభాగంలో పరుచుకుని ఉండే వస్త్ర వలయాన్ని సహాయకులు జాగ్రత్తగా దుప్పటిలా మడతపెట్టి ఆమెను పల్లకిలో పట్టించారు కానీ, పల్లకి దిగాక చూసుకుంటే గౌను బాగా నలిగిపోయి ఉంది. అప్పుడు కూడా డయానా ప్రాణం ఉసూరుమందట!
పెళ్లి గౌనుతో డయానాకు ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిల్లోని ఒక జ్ఞాపకం ఆమెకు అపురూపమైనది. పెళ్లిరోజు పెళ్లి గౌనులో నెమ్మదిగా మెట్లు దిగుతున్న డయానాను కింది నుంచి చూసిన ఒక వ్యక్తి.. ‘డయానా, యు లుక్ బ్యూటిఫుల్’ అన్నారు. ఆమె కళ్లల్లో మెరుపు. ఆ మాట అన్నది డయానా తండ్రి జాన్ స్పెన్సర్. వెళ్లి, తండ్రిని కావలించుకోవాలని అనుకుంది కానీ గౌను చెరిగిపోతుందని ఊరుకుంది! తండ్రి ప్రశంసను కూడా జీవితాంతం అలాగే చెరిగిపోకుండా చూసుకున్నారు డయానా.. చార్ల్స్‌తో వివాహబంధపు ఒడిదుడుకుల్లో కూడా. బాల్యం నుంచీ తండ్రి ఆమెకు బలమైన అండ. ఏ బాధనైనా ఒక్క మాటతో పోగొట్టేవారు. అయితే తన భర్త ఛార్ల్స్ తన పూర్వపు స్నేహితురాలితో గడిపి వస్తున్న విషయాన్ని మాత్రం ఆమె తన తండ్రితో చెప్పకోలేకపోయారు. తం్రyì కి బదులుగా ఒంటరి గదిలో తన పెళ్లి గౌనుతో డయానా ఆ విషయాలను మౌనంగా పంచుకునేవారని ఆమె బతికి ఉండగానే ఆమె జీవిత చరిత్ర.. ‘డయానా: హర్ ట్రూ స్టోరీ’ ని రాసిన ఆండ్రూ మార్టన్ ఓ సందర్భంలో కవితాత్మకంగా తన సన్నిహితుల దగ్గర బహిర్గతం చేశారని అంటారు.
Comments
Please login to add a commentAdd a comment