డాక్టర్ ప్రహ్లాద్ బిస్సీ దగ్గర రెండు రకాలైన మందులు ఉన్నాయి. ఒకటి సంతానప్రాప్తిని కలిగించే మెడిసిన్. ఇంకొకటి కోవిడ్ 19 వ్యాక్సిన్. రెండింటినీ తేలిగ్గా గుర్తుపట్టొచ్చు. సీసాలో మందులు ఉండి, పైన లేబుల్స్ ఉంటాయి. కోవిడ్ రాక ముందు ఒకటే మందు ఉండేది. పని కూడా అతడికి తక్కువగా ఉండేది. ‘పిల్లలు లేరు’ అని ఎవరైనా రాగానే.. కళ్లద్దాల లోంచి ‘ఐ నో ’ అన్నట్లు చూసి ఆ ఉన్న ఒకరకం మందును ఇచ్చి పంపేవాడు. బిస్సీ స్వయంగా చేసి సిద్ధంగా ఉంచే మందు అది. ఇప్పుడీ కోవిడ్ వ్యాక్సిన్‌నీ తనే తయారు చేసి సీసాల్లో ఉంచి, వెంటనే తీసివ్వడానికి వీలుగా ఆ సీసాలపై పేరు రాసి పెట్టుకున్నాడు. అతడు చేసిన ఇంకో మంచి పని తన కోవిడ్ మందులను అమ్ముకోడానికి లైసెన్సు కోసం జిల్లా వైద్యాధికారులకు మెయిల్ పెట్టడం.
ఒడిశాలోని బార్గర్ జిల్లాలో రుసుడా గ్రామంలో ఉంటుంది బిస్సీ క్లినిక్. మెయిల్ అందగానే రిటర్న్ మెయిల్ ఇవ్వకుండా వైద్యాధికారులే నేరుగా అక్కడికి వచ్చేశారు. వాళ్ల వెనకే పోలీసులు! ప్రస్తుతం బిస్సీ పోలీసుల ‘సంరక్షణ’ లో ఉన్నాడు. అతడిని వైద్యాధికారులు ఇంటరాగేట్ చేస్తున్నారు. ఎక్కడిది నీకా కోవిడ్ వ్యాక్సిన్ అని అడుగుతున్నారు. నేనే కనిపెట్టాను అంటున్నాడు. ఎలా కనిపెట్టావ్ అని అడుగుతున్నారు. ఒక ఫార్ములా ఉంది అంటున్నాడు. ఏమిటా ఫార్ములా అని అడుగుతున్నారు. టాప్ సీక్రెట్ అంటున్నాడు. ఆ సీక్రెట్‌ను ఛేదించే ప్రయత్నంలో వారికి ఇంకో సీక్రెట్ తెలిసింది. బిస్సీ 7వ తరగతి వరకు చదువుకున్నాడని! ఇంటరాగేషన్ అక్కడితో ఆగిపోకుండా ఉంటే మాత్రం ఇప్పటికి ఇంకా కొనసాగుతూనే ఉండి ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment