తప్పక తెలుసుకోవాల్సినవి: కరోనా వచ్చి తగ్గాక కనిపించే పరిణామాలు | Post COVID Complications, Long Term Effects Of Corona Virus | Sakshi
Sakshi News home page

తప్పక తెలుసుకోవాల్సినవి: కరోనా వచ్చి తగ్గాక కనిపించే పరిణామాలు

Published Sun, Jul 4 2021 12:12 AM | Last Updated on Sun, Jul 4 2021 12:15 AM

Post COVID Complications, Long Term Effects Of Corona Virus - Sakshi

నిరుటి తొలి అల నుంచి నేటి మలి అల వరకు కరోనా వైరస్‌ ఎందరినో కాటేసింది. కరోనా ఇన్ఫెక్షన్‌ ఉన్న సమయంలో బాధితులు జ్వరం, తలనొప్పి, ఊపిరి అందకపోవడం, ఆయాసం, వాసనలూ, రుచులూ తెలియకపోవడం ఇలాంటి తాత్కాలిక ఇబ్బందులు ఎన్నింటినో  ఎదుర్కొన్నారు. సాధారణంగా ఏదైనా జబ్బు తగ్గాక క్రమంగా కోలుకోవాలి. కానీ కరోనా బారిన పడ్డవారు మాత్రం కొన్ని అనంతర అనర్థాలకు లోనవుతున్నారు. దాదాపు అన్ని అవయవాలపైనా, అంతర్గత వ్యవస్థలపైనా... కొన్నింటిపై ప్రత్యక్షంగా, మరికొన్నింటిపై పరోక్షంగా కరోనా తన దుష్ప్రభావాలు చూపుతోంది. తల మొదలుకొని కాలి వేలి వరకు కరోనా వచ్చి తగ్గాక కనిపించే కొన్ని అనంతర పరిణామాలు ఎలా ఉన్నాయో తెలుసుకోడానికి ఉపయోగపడే కథనం ఇది. 

ఛాతీ: ఊపిరితిత్తులు / గుండె లాంటి కీలకమైన అవయవాలు అన్నిటికంటే ముఖ్యంగానూ వ్యాధి సమయంలోనూ, ఆ తర్వాత చాలాకాలం పాటు కూడా కరోనాతో ప్రభావితమవుతున్న సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ కారణంగా నిమోనియా రావడం, కరోనా అనంతరం కూడా చిన్న చిన్న పనులకే ఆయాసం రావడం, ఊపిరి పూర్తిగా అందకపోవడం వంటివి చాలాకాలంపాటు చాలామందిలో  కనిపిస్తున్న లక్షణాలు. దీనికి తోడు ఏసీఈ–2 రిసెప్టార్స్‌ కారణంగా కరోనాకు గుండె వంటి కీలక అవయవాలే ఎక్కువగా గురవుతున్న సంగతీ తెలిసిందే.

ముక్కు – నోరు – గొంతు: కరోనాను నిర్ధారణ చేసేలా అత్యంత ముఖ్యమైన లక్షణాలుగా ముక్కుకు వాసన తెలియకపోవడం, నోటికి రుచి తెలియకపోవడం వంటివి తాత్కాలికంగా జరుగుతాయని మనకు తెలిసిందే. అదృష్టవశాత్తు అవి ఇన్ఫెక్షన్‌ సోకిన సమయంలో కనిపించే తాత్కాలిక లక్షణాలు కాగా... గొంతు విషయానికి వస్తే కొందరిలో కోవిడ్‌ అనంతర పరిణామంగా ‘డిస్ఫేజియా’ అని పిలిచే మింగడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.

జీర్ణవ్యవస్థ : అన్ని వ్యవస్థల్లాగే జీర్ణవ్యవస్థలోని కాలేయం, పేగులు కూడా కరోనా ప్రభావానికి గురవుతున్నాయి. చాలామందిలో కాలేయం పనితీరు దెబ్బతింటోంది. నిజానికి కాలేయం పనితీరు బాగుంటే... కాలేయ సంబంధిత ఎంజైములైన ఎస్‌జీపీటీ, ఎస్‌జీఓటీ వంటి ఎంజైములు రక్తంలో కనిపించవు. కానీ కరోనా అనంతర పరిణామంగా కొంతమందిలో ఇవి కనిపిస్తున్నాయి. అంటే... కాలేయం పనితీరు దెబ్బతిన్నదని చెప్పడానికి ఎస్‌జీపటీ, ఎస్‌జీఓటీలు రక్తంలో పెరగడం ఓ సూచన అన్నమాట. దీనికి తోడు జీర్ణవ్యవస్థలోని పేగులు సైతం కరోనాకు ప్రభావితమవుతున్నాయి. అందుకే కొందరిలో డయేరియా, నీళ్లవిరేచనాలు  కూడా ఓ లక్షణంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా ఇవన్నీ తాత్కాలికమైన అనర్థాలే అని ఇప్పటికి నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.

చర్మం: ఒకింత అరుదుగానే అయినప్పటికీ అక్కడక్కడా కొందరిలో దేహం మొత్తాన్ని కప్పి ఉంచే చర్మంపైనా లేదా చేతుల్లోని చర్మంపైనా తిమ్మిర్లు, గుచ్చినట్లుగా అనిపించడం, పూర్తిగా చల్లగా ఉన్నట్లు అనిపించడం, దాంతో  స్పర్శ తెలియకపోవడం లేదా కొందరిలో చర్మం మండుతున్నట్లు అనిపించడం, మొద్దుబారిపోవడం (పారాస్థీషియా) వంటి లక్షణాలు కోవిడ్‌ అనంతర పరిణామాలుగా కనిపిస్తుండటాన్ని వైద్యనిపుణులు, అధ్యయనవేత్తలు గుర్తించారు.

కాళ్లూ, పాదాలు: చాలామందిలో కాళ్లలోని కండాలు పట్టేయడం, కండరాల నొప్పులు అన్న లక్షణాలు కరోనా అనంతర పరిణామంగా ఒకింత ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కొంతమందిలో మిల్లర్‌ ఫిషర్‌ సిండ్రోమ్‌లో కనిపించినట్లే కండరాలపైనా, అలాగే కొన్ని టెండన్స్‌పైనా నియంత్రణ కోల్పోవడం వల్ల కాళ్లూ, చేతులు వంటి అవయవాలను  కదిలించే ప్రయత్నంలో పాక్షికంగా మాత్రమే ఆ అవయవాలపై అదుపు సాధించే అటాక్సియా వంటి లక్షణాలూ కనిపిస్తున్నాయి. ఇక పాదాల విషయానికి వస్తే... కరోనా అనంతర పరిణామంగా పాదం పైకెత్తలేకపోవడం (ఫుట్‌ డ్రాప్‌) వంటి సమస్యలూ కొందరిలో కనిపిస్తున్నాయి.

కళ్లు : కళ్లు ముఖ్యంగా ప్రభావితమయ్యేది ‘బ్లాక్‌ ఫంగస్‌’ ఇన్ఫెక్షన్‌తో అన్న విషయం తెలిసిందే. ఈ కారణంగా కొందరు తమ కంటి చూపునూ కోల్పోవాల్సి  వస్తోంది. కొందరిలో మెదడు కొన్ని కండరాలపై నియంత్రణ కోల్పోయినట్లే...  ‘మిల్లర్‌ ఫిషర్‌ సిండ్రోమ్‌’ కారణంగా కంటి కండరాల మీద కూడా నియంత్రణ  కోల్పోయే పరిస్థితి కూడా ఎదురవుతోంది. దాంతో చూపు మందగించడం, కన్ను, కంటి గుడ్డు కదిలించలేకపోవడం వంటి దుష్ప్రభావాలు కొందరిలో అరుదుగా కనపిస్తున్నాయి.

మెదడు: కరోనా సోకిన వారిలోని 30 % వ్యక్తుల్లో, ఆక్సిజన్‌ పెట్టాల్సి వచ్చిన వారిలో 45%, వెంటిలేటర్‌ ఉన్న వారిలో 80% మందిలో మెదడు తాలూకు దుష్ప్రభావాలు కనిపిస్తున్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఇవి రకరకాలుగా ఉన్నాయి. ఉదాహరణకు కరోనాకే ప్రత్యేకమైన లక్షణాలైన వాసన, రుచి తెలియకపోవడం నాడీ వ్యవస్థపై పడిన దుష్ప్రభావం వల్లనే. ఇది మాత్రమే గాక అనంతర దుష్ప్రభావంగా కొందరిలో మింగడంలోనూ సమస్య కనిపిస్తోంది. ఇక రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే గుణం కరోనాలో ప్రత్యేకం కాబట్టి... అలాంటి అనర్థం గనక మెదడులో సంభవిస్తే స్ట్రోక్, హేమరేజ్‌ వంటి తీవ్రమైన అనర్థాలూ చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. నాడీవ్యవస్థలోని నరాలపై ఉన్న మైలీన్‌ షీత్‌ దెబ్బతినడం అన్నది మిగతా అన్ని వైరల్‌ ఇన్ఫెక్షన్‌ తర్వాత కనిపించే ‘జీబీ సిండ్రోమ్‌’ కూడా ఓ ‘అనంతర’ పరిణామంగా ఇందులోనూ వస్తుంది. దీని వల్ల కాలి నుంచి పైవైపునకు తాత్కాలికంగా అవయవాలు చచ్చుబడే ప్రమాదం ఉంటుంది. మరోవైపు చాలామందిలో తలనొప్పి, చాలా ఎక్కువగా నిద్రపోతూ ఉండటం లేదా మరికొందరిలో అస్సలు నిద్రలేకపోవడం వంటి4 సమస్యలు వినిపిస్తున్నాయి. వీటి అన్నింటికీ మించి తీవ్రమైన అయోమయానికి గురిచేసే ‘బ్రెయిన్‌ఫాగ్‌’ మరో ప్రముఖమైన అనంతర పరిణామం. చాలామంది లో మెదడులోని గ్రేమ్యాటర్‌ పరిణామం తగ్గి మళ్లీ చాలాకాలం తర్వాత యథాతథ స్థితికి వస్తున్నట్లు కూడా పరిశోధనల్లో తేలింది. ఇక మానసికమైన ఒత్తిడి కారణంగా ‘డిప్రెషన్‌’ కు లోనవుతున్న వారి సంఖ్య పెరిగింది. 

మూత్రవిసర్జన వ్యవస్థ: కరోనా అనంతర పరిణామంగా మూత్రం చాలా చిక్కగా రావడం, చాలా తక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపించడం అరుదుగానైనా చాలా కొద్దిమందిలో కనిపిస్తోంది. అయితే మూత్రపిండాలు దెబ్బతినడం చాలా చాలా అరుదు.

చెవి : కరోనా ఇన్ఫెక్షన్‌ సోకిన వాళ్లలో ‘టినైటస్‌’ అనే కండిషన్‌లో కనిపించిన విధంగా చెవులో ఎలక్ట్రిక్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ సమీపంలో ఉన్నట్లుగా హోరున శబ్దం వినిపిస్తున్నట్లు కొన్ని కొత్త అధ్యయనాల్లో తేలింది. దీనికి తోడు కరోనాకు గురైన  7 – 20 శాతం మందిలో వినికిడి లోపాలు వస్తున్నట్లు అధ్యయనవేత్తలు పేర్కొన్నారు. ఇవి కొందరిలో ఒకే చెవిలో కనిపిస్తుండగా... మరికొందరిలో రెండు చెవుల్లోనూ వస్తున్నాయి. సాధారణంగా ఒక్క కరోనా విషయంలోనే కాకుండా... వ్యక్తులు ఏవైనా ఇతరత్రా ఇన్ఫెక్షన్స్‌ బారిన పడ్డప్పుడు కూడా... కొందరిలో వినికిడి సమస్యలు, కళ్లు బాగా తిరిగి ఒళ్లంతా తూలిపోయే ‘వర్టిగో’ వంటి లక్షణాలు కనిపించేవి. వర్టిగో అన్నది చెవిలో మనల్ని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచేందుకు ఉపయోగపడే ద్రవంలో లోపాల కారణంగా వస్తుంటాయన్న విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడూ కరోనాకు గురైన అనంతర పరిణామంగా ‘బినైన్‌ పెరాక్సిమల్‌ పొజిషన్‌ వర్టిగో (బీపీపీవీ)’ అంటే హానికరం కాని వర్టిగో లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.

డయాబెటిస్‌ : కరోనా అనంతర పరిణామంగా... కరోనా ఇన్ఫెక్షన్‌ సమయంలో రోగికి స్టెరాయిడ్స్‌ ఇస్తూ చికిత్స చేయడం ఓ సాధారణ ప్రోటోకాల్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇలా స్టెరాయిడ్స్‌ ఇచ్చినప్పుడు రోగుల్లోని గ్లుకోజ్‌ పెరుగుతుందన్న విషయమూ తెలిసిందే. అయితే చిత్రంగా కేవలం స్టెరాయిడ్స్‌ ఇచ్చిన వారి విషయంలోనూ కాకుండా... స్టెరాయిడ్స్‌ ఇవ్వకుండా చికిత్స పొందినవారిలోనూ చక్కెర లెవెల్స్‌ ఎక్కువ గా నమోదవుతూ ఉండటం వైద్యవర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. 

థైరాయిడ్‌ సమస్యలు  
సాధారణంగా ఏదైనా వైరల్‌ లేదా ఇతరత్రా ఇన్ఫెక్షన్‌ వచ్చాక తాత్కాలికంగా థైరాయిడ్‌ సంబంధిత సమస్యలు కనిపించడం మామూలే. అదే విధంగా కరోనా అనంతర పరిణామంగా కూడా చాలామందిలో థైరాయిడ్‌ పనితీరు ఎక్కువగా ఉండే హైపర్‌థైరాయిడిజమ్, తక్కువగా మారే ‘హైపోథైరాయిడ్‌’ సమస్యలు కనిపిస్తున్నప్పటికీ ఇప్పటికైతే ఇవి తాత్కాలికంగానే ఉండటం వైద్యవర్గాలనూ, నిపుణులనూ, అధ్యయనవేత్తలను కాస్త తేలిగ్గా ఊపిరిపీల్చుకునేలా ఉపశమనం కలిగిస్తున్నాయి. 

కోవిడ్‌ అనంతర పరిణామాలతో తల మొదలుకొని... కాలి చివరివరకూ ప్రతి అవయవం, ప్రతి వ్యవస్థా ప్రభావితమవుతూ ఉండటం అధ్యయనవేత్తలను అబ్బురపరుస్తుంది. గత ఏడాదే తొలి దశ రావడం.. తక్కువ మొత్తంలోనే అయినా ఇంకా కేసులు వస్తూనే ఉండటంతో కోవిడ్‌ తర్వాతి దుష్ప్రభావాలూ, అనంతర అనర్థాలపై అధ్యయనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కోవిడ్‌ నుంచి కోలుకున్న రోగులు తమలో కనిపించిన లక్షణాలను బట్టి ఆయా వైద్య నిపుణులనుగానీ లేదా మెడికల్‌ స్పెషలిస్ట్‌లైన ఫిజీషియన్లను సంప్రదించాలి. దాంతో వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల... కోవిడ్‌ అనంతర ప్రభావాలతో కనిపించే అనర్థాలను మొగ్గలోనే తుంచేసినట్లవుతుంది. భవిష్యత్తులో అవి ముదరడం వల్ల పరిస్థితి మరింత తీవ్రం కాకుండా జాగ్రత్తపడినట్లుగానూ అవుతుంది.  


డాక్టర్‌ వెంకటేష్‌ బిళ్లకంటి
సీనియర్‌ కన్సల్టెంట్‌ 
ఫిజీషియన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement