కలబందలేదా అలోవెరా ప్రతీ ఇంట్లో సర్వ సాధారణంగా ఉంటోంది. ఒకవిధంగా చెప్పాలంటే తులసి మొక్కకు ఇచ్చినంత ప్రాధాన్యతను కలబందకు కూడా ఇస్తున్నారంటూ అతిశయోక్తి కాదు. అందం నుంచి ఆరోగ్యం వరకు కలబంద ప్రయోజనాలు, వాడకం ప్రాచుర్యంలోకి వచ్చింది. ముఖ్యంగా చర్మ సౌందర్యానికి బాగా పనిచేస్తుంది. ఇంకా ఆయుర్వేద మందుల్లోను సౌందర్య ఉత్పత్తుల్లోనూ, దీన్ని విరివిగా వాడతారు.
ఆరోగ్య నిపుణుల ప్రకారం కలబందలో విటమిన్ ఏ , సీ, ఈ, బీ1, బీ2, బీ3, బీ6,బీ 12 లాంటి విటమిన్లతోపాటు ఫోలిక్ యాసిడ్, 18 రకాల అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఇంకా కాల్షియం, క్రోమియం, సెలెనియం, మెగ్నీషియం, జింక్, సోడియం, ఇనుము, పొటాసియం, కాపర్, మాంగనీస్ వంటి దాదాపు ఇరవై మినరల్స్ ఉంటాయి. కలబంద లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ బయొటిక్, యాంటీ వైరల్ లక్షణాలు మెండుగా ఉంటాయి.
అలోవెరా జెల్ పౌడర్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.ప్రీడయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో కలబంద సప్లిమెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించ గలదు. ఇది ప్రీడయాబెటిస్ ఉన్నవారిలో ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్‌ని తగ్గిస్తుంది.
కలబందలో లాటెక్స్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది మలబద్ధకానికి మంచి ఔషధంలాగా పనిచేస్తుంది.
కలబంద దంత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కలబందతో చేసిన మైత్ వాష్ వినియోగం ద్వారా చిగుళ్ల రక్తస్రావాన్ని తగ్గించవచ్చు.
అలోవెరా కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఇది చర్మం తొందరగా సాగిపోకుండా నివారిస్తుంది. కలబందలో మ్యూకోపాలిసాకరైడ్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మంలోని తేమను కాపాడతాయి.
కలబంద గుజ్జును రాసుకుంటే, జుట్టు మెత్తగా, మెరిసేటట్టు మారుతుంది. జుట్టు తెగిపోవడాన్ని అరికడుతుంది. చక్కగా, ఒత్తుగా ఎదిగేలా తోడ్పడుతుంది.
మాయిశ్చరైజర్ల నుండి ఫేస్ మాస్క్‌ల వరకు చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఇది చాలా కీలకం. దీనిలోని మాయిశ్చరైజింగ్, యాంటీ ఏజింగ్ లక్షణాలే దీనికి కారణం.
అలోవెరా జెల్ కాలిన గాయాలకు చాలా ఉపశమనం ఇస్తుంది. గాయాలు, మచ్చలు తొందరగా మానేలా చేస్తుంది. సన్‌బర్న్ ఇన్‌ఫ్లమేషన్‌ను కూడా తగ్గిస్తుంది.
కలబంద రెమ్మ పైన ఉండే తోలును తీసేసి అందులో తెల్లగా ఉన్న గుజ్జును తీసుకొని ఒక పాత్రలో వేయాలి ఇది ఒగరు ఒగరుగా, పుల్లగా కొన్ని చిరు చేదుగా కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం సుగర్ లేదా కొద్దిగా తేనె వేయాలి. దీన్ని మిక్సీలో వేసుకొని కలపాలి.అలా కలిపిన తర్వాత పూర్తిగా నీరు మాదిరిగా తయారవుతుంది. దీన్ని ఉదయాన్నే తాగవచ్చు. తేనె కలిపిన ఈ మిశ్రమాన్ని ముఖానికి, చర్మానికి కూడా అప్లయ్ చేసుకోవచ్చు. పెరటి మొక్కల పోషణలో కూడా కలబంద గుజ్జు, తోలు బాగా ఉపయోగ పడతాయి. ఇన్ని ప్రయోజనాలున్న కలబంద లక్షల్లో ఆదాయ తెచ్చిపెట్టే పంటగా కూడా మారిపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment