పెరట్లో ముత్యాల పంట! | Professor Mathachan Pearl Farming In Home | Sakshi
Sakshi News home page

పెరట్లో ముత్యాల పంట!

Published Tue, Sep 1 2020 7:56 AM | Last Updated on Tue, Sep 1 2020 7:57 AM

Professor Mathachan Pearl Farming In Home - Sakshi

ప్రొఫెసర్‌ మతాచన్‌ చిత్రమైన మనిషి. ఆయన ప్రత్యేకత ఏమిటంటే.. తన మనసుకు నచ్చిన పనే చేస్తాడు. ఎవరేమనుకున్నా పట్టించుకోడు. కేరళలో పుట్టి పెరిగాడు. ఫిషరీస్‌ మీద ఆసక్తి ఉంది. అయితే, టెలికాం ఇంజనీరింగ్‌ చదువుకోవడం వల్ల ప్రొఫెసర్‌ అయ్యాడు. సౌదీ అరేబియాలోని కింగ్‌ ఫహ్ద్‌ పెట్రోలియం–మినరల్స్‌ యూనివర్సిటీలో టెలికమ్యూనికేషన్స్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా కొన్నేళ్లు ఉద్యోగం చేశాడు. ఆ కాలంలోనే ఓ సౌదీ చమురు కంపెనీ అధికారులతోపాటు దుబాసీగా చైనాలో పర్యటించాల్సి వచ్చింది. ఆ పర్యటన అనుకోకుండా అతని ఆత్మను తట్టి లేపింది. వృత్తినే మార్చేసింది. చైనా వుక్సిలో గల దాన్‌షూయి మత్స్య పరిశోధనా స్థానాన్ని ఆయన సందర్శించాడు. అక్కడ కంటపడిన ముత్యాల సాగు మీద మనసు పారేసుకున్నాడు. వెళ్లిన పని చూసుకొని తిరిగి సౌదీ చేరుకున్న ప్రొఫెసర్‌ మతాచన్‌ మనసు మనసులో లేదు. ముత్యాల సాగే మనసంతా నిండిపోయి ఉంది. కొద్ది వారాల్లోనే ప్రొఫెసర్‌ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి చైనా వెళ్లి ముత్యాల పెంపకం నేర్చుకున్నాడు. 

పెరట్లోనే బక్కెట్లలో..
ఆర్నెల్ల తర్వాత 1999లో కేరళలోని ఇంటికి చేరుకొని పెరట్లోనే పని ప్రారంభించాడు. ఆ విధంగా ప్రొఫెసర్‌ మతాచన్‌ కాస్తా.. ముత్యాల రైతు మతాచన్‌గా మారిపోయాడు. నదుల్లో దొరికే ఆల్చిప్పలను తెచ్చి పెంచాడు. 18 నెలల్లో 50 బక్కెట్లలో పెంచిన ముత్యాలను రూ. 4.5 లక్షలకు అమ్మాడు. రూ. 3 లక్షలు లాభం వచ్చింది. 21 ఏళ్లుగా తన ఇంటి మడుగులోని బక్కెట్లలో ముత్యాలు పెంచుతూ ఉన్నాడు. పేరుకు పేరు, డబ్బుకు డబ్బూ సంపాదిస్తున్నాడు. ‘నేను ఉద్యోగం మానేసినప్పుడు అందరూ తిట్టిపోశారు. అయినా నేను పట్టించుకోలేదు. ముత్యాల పెంపకం గురించి అప్పట్లో పెద్దగా ఎవరికీ తెలీదు. కానీ, నాకు మాత్రం గట్టి నమ్మకమే. ఉద్యోగంలోనే ఉంటే మా వూళ్లో అందరిలో ఒకడిగానే ఉండే వాడిని. ఇప్పుడు నాకు డబ్బుతోపాటు ప్రతిష్ట కూడా పెరిగింది’ అంటున్నాడు మతాచన్‌ సంతృప్తిగా.

18 నెలల పంట
ముత్యాల సాగు జపాన్‌లో ప్రారంభమైంది. ముత్యాలు మూడు రకాలు. కృత్రిమంగా తయారు చేసేవి.. నదులు, సరస్సుల్లో ఆల్చిప్పల్లో సహజంగా పెరిగేవి.. పెంచేవి. సాగైన ముత్యాలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. నదులు, సరస్సుల నుంచి తెచ్చిన ఆల్చిప్పల లోపలికి గుండ్రటి న్యూక్లియస్‌ను చొప్పిస్తారు. ఇది కొంచెం నైపుణ్యం అవసరమయ్యే పని. అలా చొప్పించిన న్యూక్లియస్‌ చుట్టూ కాల్షియం 540 పొరలు పేరుకుంటాయి. ఆ క్రమంలోనే చక్కని ముత్యం రూపుదాల్చుతుంది. న్యూక్లియస్‌ ఏ ఆకారంలో ఉంటే ముత్యం ఆ ఆకారంలో తయారవుతుంది. ఆల్చిప్పలను బక్కెట్లలో, ట్రేలలో పెట్టి నీటి తొట్టె/చెరువు నీటిలో ఉంచుతారు. స్పైరులిన, నాచు, వృక్ష ప్లవకాలను ఆహారంగా తీసుకుంటూ ఆల్చిప్పలు పెరుగుతాయి. ఇచ్చిన ఆహారాన్ని బట్టి 12 నుంచి 18 నెలల్లో ముత్యాల పంట చేతికి వస్తుంది. ఇలా సాగు చేసిన ముత్యాలను మతాచన్‌ ఆస్ట్రేలియా, కువైట్, సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్‌కు ఎగుమతి చేసి భారీగా డబ్బు గడిస్తున్నారు. ముత్యాలను సేకరించిన తర్వాత మిగిలే ఆల్చిప్పలతో కూడా వివిధ కళాకృతులను తయారు చేస్తుండటం విశేషం. 

‘మన దేశపు మార్కెట్లలో అమ్మేవి కృత్రిమంగా తయారు చేసినవి. ఒరిజినల్‌ ముత్యాల్లాగ కనపడటినికి సింథటిక్‌ పెర్ల్‌ కోటింగ్‌ వేస్తారు. అందుకే చవక. సాగు చేసినవే నికార్సయినవి. వీటికి విదేశాల్లో క్యారెట్‌కు రూ. 360 పలుకుతుంది. అంటే గ్రాము రూ. 1,800. కిలో రూ. 18 లక్షలు..’ అంటారు మతాచన్‌. కేరళలోని కాసర్‌గాడ్‌ జిల్లా (మలక్కల్లు పోస్టు) కడుతోడిల్‌ గ్రామంలో మతాచన్‌ ముత్యాల సాగు క్షేత్రం ఉంది. కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా అధికారులు, శాస్త్రవేత్తలు సైతం సందర్శనకు వస్తుంటారు. తన ఫామ్‌లో రైతులకు ముత్యాల సాగులో 26 రోజుల కోర్సు ద్వారా ప్రతి మెలకువనూ నేర్పిస్తున్నారు. ప్రస్తుతం వాట్సప్‌ ద్వారా ఆంగ్లంలో 26 రోజులపాటు రోజూ అర గంట సేపు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ అనంతరం ముత్యాల సాగు ప్రారంభించగలుగుతారని, అందుకు అవసరమైన వస్తువులను తాను సమకూర్చుతానని ఆయన ‘సాక్షి’తో చెప్పారు. శిక్షణ పొందగోరేవారు రూ. పది వేలు సర్వీస్‌ చార్జి చెల్లించాల్సి ఉంటుందని మతాచన్‌ (94460 89736) అన్నారు. ఆయన 21 ఏళ్లుగా నడుస్తున్న ఈ సరికొత్త సాగుబాట ఇప్పటికీ మేలిమి ముత్యమే! https://genuinepearl13.weebly.com

మంచినీటిలో ముత్యాల పెంపకంపై ఒడిశాలోని భువనేశ్వర్‌ సమీపంలోని కౌశల్యగంగలో గల కేంద్రీయ మంచినీటి ఆక్వాకల్చర్‌ సంస్థ (సిఐఎఫ్‌ఎ–సిఫా)  6 రోజుల పాటు శిక్షణ ఇస్తోంది. మాధ్యమం ఆంగ్లం. చేపలు/ ఆల్చిప్పలు/ రొయ్యల సాగులో అనుభవం ఉన్న రైతులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ శాస్త్రవేత్తలు అర్హులు. బ్యాచ్‌కు 20 మందికి మాత్రమే అవకాశం. ముత్యాల సాగు చేపట్టాలనుకునే మహిళలకు 20% సీట్లు కేటాయిస్తారు. ఒక్కొక్కరికి ఫీజు రూ. 8 వేలు. సెప్టెంబర్‌ 1 నుంచి 5 వరకు శిక్షణా శిబిరం జరుగుతుంది. అయితే, దీనిలో చేరడానికి గడువు ఇప్పటికే ముగిసింది. తదుపరి బ్యాచ్‌లో చేరే ఆసక్తి గల వారు ‘సిఫా’ సీనియర్‌ సైంటిస్ట్‌ డా. శైలేష్‌ సౌరబ్‌ను సంప్రదించవచ్చు.  Email: ssaurabh02@rediffmail.com 

పెరటి కోళ్ల పెంపకంలో 2 రోజుల ఆన్‌లైన్‌ శిక్షణ
పెరటి కోళ్ల పెంపకం గ్రామీణ ప్రాంతాల వారికి అదనపు ఆదాయాన్ని అందించే ఓ ముఖ్యమైన వ్యవసాయ అనుబంధ వ్యాపకం. తిరిగి గ్రామాలకు చేరిన వలస జీవులకు మంచి ఆదాయ వనరుగా పెరటి కోళ్ల పెంపకం ఉపకరిస్తుందని ఆం.ప్ర. ప్రభుత్వ అనుభవం చెబుతోంది. ఈ నేపథ్యంలో పెరటి కోళ్ల పెంపకంలో లోతైన మెళకువలు అందించేందుకు ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘వాసన్‌’ సెప్టెంబర్‌ 4–5 తేదీల్లో (రోజుకు 4 గంటల చొప్పున 8 గంటలు) ఆన్‌లైన్‌లో శిక్షణ ఇవ్వనుంది. ఫీజు రూ. వెయ్యి. వివరాలకు... anupriya@wassan.org 

ప్రకృతి వ్యవసాయంపై 3 నెలల ఆన్‌లైన్‌ కోర్సు
కోల్‌కతా యూనివర్సిటీ, జర్మనీకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా ప్రకృతి వ్యవసాయంపై 3 నెలల ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సును సెప్టెంబర్‌ 2020 – జనవరి 2021 మధ్య నిర్వహించనుంది. గత ఐదేళ్లుగా నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి ఆచరణాత్మక కోర్సును ఈ ఏడాది ఆన్‌లైన్‌ కోర్సుగా అందించనున్నారు. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను వివిధ కోణాల్లో లోతుగా అర్థం చేసుకోవడం, విశ్లేషించడం, నిర్మించడంపై ఆసక్తి కలిగిన రైతులు, రైతు శిక్షకులు, నిపుణులు, నిపుణులు కాగోరేవారికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పలువురు నిష్ణాతులు అందిస్తున్న ఈ కోర్సు ఎంతో ఉపకరిస్తుంది. ఆసక్తి గల వారు సెప్టెంబర్‌ 10 లోగా దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు.. ఫోన్‌/వాట్సప్‌ 8017063944, agroecology.cps@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement