ఈజీ మనీ వెంట పరుగెత్తి ఆత్మహత్య | PSY Vishesh Tips to Get Rid Of Suicide Thoughts Due To Loss In Trading | Sakshi
Sakshi News home page

ఈజీ మనీ వెంట పరుగెత్తి ఆత్మహత్య

Published Sat, Feb 3 2024 9:05 AM | Last Updated on Sat, Feb 3 2024 1:32 PM

PSY Vishesh Tips to Get Rid Of Suicide Thoughts Due To Loss In Trading - Sakshi

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంకామ్ విద్యార్థి నవీన్ క్రిప్టో ట్రేడింగ్‌లో నాలుగు లక్షల రూపాయలు నష్టపోయి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. జగిత్యాల జిల్లాకు చెందిన నవీన్ పేద కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి వడ్రంగి. బహూశా ఆ పేదరికం నుంచి త్వరగా బయటపడాలనే ఆలోచనే నవీన్‌ను క్రిప్టో ట్రేడింగ్ వైపు నడిపి ఉండవచ్చు. 

త్వరగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో నవీన్ క్రిప్టో ట్రేడింగ్ కోసం.. నవీన్ తన పేరుపై ఒకటి, తండ్రి పేరుపై ఒకటి క్రెడిట్ కార్డులు తీసుకున్నాడు. భారీగా పెట్టుబడి పెట్టి అప్పుల్లో కూరుకుపోయాడు. వాటిని తీర్చేందుకు పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నా కానీ డబ్బు సరిపోలేదు. క్రెడిట్ కార్డ్ బకాయిలు చెల్లించలేకపోయాడు. చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

యువతను బుట్టలో వేసుకునేలా
ఈజీ మనీ పేరుతో ఈ మధ్యకాలంలో చాలా రకాల స్కీములు వస్తున్నాయి. అవి యువతను సులువుగా ఆకర్షిస్తాయి. కానీ ఈజీ మనీ స్కీమ్‌లలో రిస్క్ కూడా అలాగే ఉంటుంది. ఈ విషయం తెలియని యువత నవీన్‌లా ఆ వలలో చిక్కుకుపోతారు. అప్పుల భారం నిస్సహాయ స్థితిలోకి నెట్టేస్తుంది. ముఖ్యంగా పేద కుటుంబాల నుంచి వచ్చినవారిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

అప్పుల భారం నుంచి తప్పించుకోలేమనే భయం వెంటాడుతుంది. తన కష్టం చెప్తే తల్లిదండ్రులు మరింత బాధపడతారని ఆ విషయం ఇంట్లో చెప్పలేరు. ఎగతాళి చేస్తారని స్నేహితులతో పంచుకోలేరు. క్రమక్రమంగా ఒంటరితనంతో బాధపడతారు. ఎటుచూసినా కష్టాలే కనిపిస్తాయి. పరిష్కారం గురించి ఆలోచించే శక్తిని కోల్పోతారు. 

గ్యాంబ్లింగ్ డిజార్డర్..
నవీన్ ప్రవర్తన గ్యాంబ్లింగ్ డిజార్డర్‌కు దగ్గరగా ఉంది. ఇది ఒక బిహేవియరల్ అడిక్షన్. జూదం ఆడకుండా ఉండలేకపోవడం దీని ప్రధాన లక్షణం. నిరంతరం జూదం గుర్తించి లేదా జూదానికి డబ్బు ఎలా సంపాదించాలనే దానిగురించి ఆలోచిస్తుంటారు. తమకు కావాల్సిన స్థాయి ఎక్సయిట్మెంట్ కోసం పెద్ద మొత్తంలో పందేలు వేస్తుంటారు. సమస్యలు వస్తున్నాయని తెలిసి ఆపేయాలని ప్రయత్నించినా ఆపలేకపోతారు.

జూదంలాంటి వ్యాపారంలో వచ్చిన నష్టాలను మళ్లీ దానితోనే భర్తీ చేయాలని ప్రయత్నిస్తారు. ఆ విషయాన్ని దాచడానికి అబద్ధాలు చెప్తారు, విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నా.. జీవితంలో, కెరీర్‌లో సమస్యలు ఎదురవుతున్నా గుర్తించలేరు. వీటన్నింటివల్ల యాంగ్జయిటీ, డిప్రెషన్ లేదా ఇతర మానసిక రుగ్మతలకు లోనవుతారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో నవీన్‌లా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారు.

ఏం చేయాలి? ఎలా కాపాడుకోవాలి? 
ఆత్మహత్య భావనలున్నవారు తమ బాధను మాటల్లో, చేతల్లో పరోక్షంగా వెల్లడిస్తూనే ఉంటారు. ఈ విషయాలను గమనించి, మద్దతుగా నిలవడం ద్వారా వారిని కాపాడుకోవచ్చు.  

•    ఎవరితో మాట్లాడకపోవడం, ఒంటరిగా ఉండటం, పనితీరు క్షీణించడం వంటి మార్పులను గమనించాలి.
•    ఎవరైనా తరచూ నిస్సహాయ భావాన్ని వ్యక్తం చేసినా, బయటపడే మార్గం లేనట్లు మాట్లాడుతున్నా వారి బాధను అర్థం చేసుకోవాలి. 
•    ఎవరైనా క్రమబద్ధీకరించని వ్యాపారం లేదా అప్పులు పేరుకుపోవడం వంటి ప్రమాదకర ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొంటే మద్దతుగా నిలవాలి. 
•    తీవ్రమైన మానసిక కల్లోలం, తీవ్రమైన అపరాధం లేదా అవమానం గురించి మాట్లాడుతుంటే అర్థం చేసుకోవాలి. 
•    ఎమరేమనుకుంటారో అని భయపడకుండా తమ సవాళ్లను చర్చించే వాతావరణాన్ని సృష్టించాలి. 
•    ఆర్థిక కార్యకలాపాలలో ఉన్న నష్టాలను అర్థం చేసుకోవడంలో ఫైనాన్షియల్ లిటరసీని ప్రోత్సహించాలి. 
•    కష్టాలు, నష్టాల వల్ల వచ్చే మానసిక సమస్యల గురించి అవగాహన కల్పించాలి. కౌన్సెలింగ్ తీసుకునేలా ప్రోత్సహించాలి.
•    స్నేహితులు, కుటుంబం, సలహాదారులతో బలమైన మద్దతు వ్యవస్థలను రూపొందించాలి. 

సైకాలజిస్ట్ విశేష్
8019 000066
psy.vishesh@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement