సత్య తెలివైన విద్యార్థి. కానీ ఇంటర్మీడియట్ పూర్తికాగానే ఐఐటీ సీట్ రాలేదు. ప్రస్తుతం లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. కానీ మూడు నెలలుగా అతన్ని ఓ సమస్య వేధిస్తోంది. ఎగ్జామ్ పేపర్ చేతిలోకి తీసుకోగానే ‘‘బాగా రాయలేనేమో’’ అనే ఆలోచన మనసులోకి దూరుతోంది. అంతే.. అప్పటివరకూ గుర్తున్నది కూడా మర్చిపోతున్నాడు. ఈ సమస్యను అధిగమించాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. నాన్నకు చెప్పుకుని ఏడ్చాడు.
వాణి ఒక అథ్లెట్. స్టేట్ లెవెల్‌లో బెస్ట్ రన్నర్‌గా నిలిచి, నేషనల్ మీట్‌కు ప్రిపేర్ అవుతోంది. కానీ రన్నింగ్ ట్రాక్ మీదకు వెళ్లగానే ‘‘నేను గెలవలేనేమో’’ అనే ఆలోచన మనసును హిట్ చేస్తోంది. అంతే.. వేగం తగ్గుతోంది. సెకన్ల వ్యవధిలో ఓడిపోతోంది. ట్రాక్ ఎక్కినప్పుడు ఆ ఆలోచన రాకుండా ఎంతో ప్రయత్నించింది. సాధ్యం కాలేదు. నేషనల్ విన్నర్ కావాలన్న తన ఆశ నెరవేరుతుందో లేదోనని తీవ్రంగా బాధపడుతోంది.
సత్య, వాణిల్లానే చాలామంది విద్యార్థులు, యువతులు ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతుంటారు. అది ఐఐటీ, నీట్, ఎంసెట్, స్పోర్ట్స్ లేదా గేమ్స్ ఏవైనా..! ఒక్క నెగటివ్ ఆలోచన వారిని.. గమ్యం నుంచి ఒక్కొక్క అడుగు వెనక్కు తీసుకువెళ్తుంది. ఆ ఒక్క నెగటివ్ ఆలోచన మూలాల్ని అర్థం చేసుకుని పరిష్కరించుకోగలిగితే.. గమ్యాన్ని చేరుకోగలరు, అనుకున్నది సాధించగలరు.
లొంగకపోతే సాయం అవసరం...
నెగటివ్ కామెంట్స్‌తో వేధించే రౌడీని, దాని గొంతును సరిచేయడం అందరికీ అంత సులువు కాదు. అలాంటప్పుడు సైకాలజిస్ట్ సహాయం తీసుకోవడం అవసరం. వారు రకరకాల పద్ధతుల ద్వారా నెగటివ్ సెల్ఫ్ టాక్‌ను తగ్గించుకునేందుకు సహాయపడతారు.
- కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ) అనేది వ్యక్తుల ప్రతికూల ఆలోచనలు, ప్రవర్తనలను గుర్తించడంలో, సవాలు చేయడంలో సహాయపడుతుంది.
- ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్, మైండ్‌ఫుల్ మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ ద్వారా ఆందోళన వల్ల శరీరంలో వచ్చే మార్పులను నియంత్రించుకోవచ్చు. మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి.
- ఆందోళనను రేకెత్తించే పరిస్థితులను క్రమక్రమంగా పరిచయం చేసే ఎక్స్‌పోజర్ థెరపీ భయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సత్య విషయంలో మాక్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్, వాణి విషయంలో తక్కువ దూరం పరుగెత్తడం వంటివి ప్రాక్టీస్ చేయాలి.
- వారు సాధించిన విజయాలను హైలైట్ చేయడం, పర్ఫెక్షన్ కంటే ప్రోగ్రెస్‌పై దృష్టి పెట్టడం వారి విశ్వాసాన్ని పెంచుతుంది, వారి కృషిని కొనసాగించడానికి వారిని ప్రేరేపిస్తుంది.
- వారి ఆందోళన గురించి కుటుంబం, స్నేహితులు లేదా కోచెస్‌తో మాట్లాడమని ప్రోత్సహించడం అవసరమైన అవగాహనను, మానసిక మద్దతును అందిస్తుంది.
- రెగ్యులర్ వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నిద్ర మానసిక స్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది, ఆందోళనను తగ్గిస్తుంది.
మనసులో అల్లరి చేస్తుంటుంది..
సత్య, వాణిల్లానే చాలామందికి పెద్ద పెద్ద కలలు ఉంటాయి. అవి చాలా ముఖ్యమైనవి అయినప్పుడు ఎక్కడ ఫెయిలవుతామోనని భయపడుతుంటారు. అది వారి పనితీరును దెబ్బతీస్తుంది. దీన్నే పర్ఫార్మెన్స్ యాంగ్జయిటీ అంటారు. దీనికి కారణం వారి మనసులోని రౌడీబేబీ (బులీ). చిన్నప్పుడు స్కూల్లో ఎలాగైతే ఎగతాళి చేస్తారో, ఏడిపిస్తారో (బులీయింగ్) అలాగే మనసులోని రౌడీ అల్లరి చేస్తుంటుంది.
- నువ్వు చేయలేవు, నువ్వు ఫెయిలవుతావు అంటూ అబద్ధాలు చెప్తుంటుంది.
- వారిని భయాందోళనలకు గురిచేస్తుంది. దాంతో ఆలోచనలు రేసుగుర్రాల్లా పరుగెత్తుతాయి. చేతులకు చెమటలు పడతాయి. కొందరికి చేతులు వణుకుతాయి కూడా.
- ఆ భయాందోళనల్లో తమకు తెలిసినదాన్ని కూడా మర్చిపోతారు. తమ పర్ఫార్మెన్స్‌ను కాస్తంత మందగిస్తుంది. అది చాలు కదా లక్ష్యం చేజారడానికి.
లోగొంతును సవరించుకోవాలి..
మనసులోని రౌడీ బేబీని అలా వదిలేయాల్సిన అవసరంలేదు. దానిపై పోరాటం చేయవచ్చు. అందుకు మొదట చేయాల్సింది బులీకి అసలు కారణాన్ని కనుక్కోవడం. దానికి బహూశా గత వైఫల్యాలు, పర్ఫెక్ట్‌గా ఉండాలనే ఒత్తిడి, జడ్జ్ చేస్తారనే భయం వంటివి కారణాలు కావచ్చు. ఆ తర్వాత రౌడీ బేబీతో మాట్లాడి మచ్చిక చేసుకోవాలి.
- కరకుగా ఉండే రౌడీ బేబీ గొంతును కాస్తంత సరళంగా లేదా సరదాగా మార్చేయండి.
- నా వంతు కృషి చేయగలను, నా తప్పుల నుంచి నేర్చుకుంటాను.. అని మనసులోని మాటలను మార్చండి.
- నిశ్శబ్దంగా ఉండటం, నిదానంగా శ్వాస తీసుకోవడం ద్వారా రౌడీని శాంతింపచేయండి.
- చిన్న చిన్న పరీక్షల్లో మనసులోని రౌడీని ఎదుర్కోవడం ప్రాక్టీస్ చేయండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి.
--సైకాలజిస్ట్ విశేష్
(చదవండి: సోనియా గాంధీ మెచ్చిన 'పప్పు అన్నం'! బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!)
Comments
Please login to add a commentAdd a comment