జీవకంచెపై కూరగాయ తీగల్ని చూపుతున్న భగడే (PC: Betterindia)
కోతుల నుంచి, అడవి పందుల నుంచి లేదా సాధారణ పశువుల నుంచి పంటలను రక్షించుకోవటం తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో రైతులకు కత్తి మీద సాములా మారింది. ఈ సమస్యకు ఇనుప కంచెలు, సోలార్ విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసుకొని రైతులు పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు.
అయితే, వాటి కన్నా బంజరు భూముల్లో పెరిగే బ్రహ్మజెముడు జాతికి చెందిన ముళ్ల మొక్కలను పొలం చుట్టూతా కంచెగా నాటుకుంటే మేలని మహారాష్ట్రకు చెందిన జగన్ ప్రహ్లాద్ భగడే అనుభవపూర్వకంగా చెబుతున్నారు.
ఆయనది అకోలా జిల్లాలోని ఖపర్‌వాది బద్రుక్ గ్రామం. ఆయనకు 30 ఎకరాల సాగు భూమి ఉంది. ‘ఏ పంట వేసినా నీల్‌గాయ్, దుప్పులు, అడవి పందులు, కోతులు, పశువులు పాడు చేస్తూ ఉండేవి. ఎకరం పొలం చుట్టూ ఇనుప కంచె వేశాను. ఏడేళ్ల క్రితమే రూ. 40 వేలు ఖర్చయ్యింది. ఇక మొత్తం పొలం చుట్టూ కంచె వెయ్యాలంటే ఉన్న భూమిలో కొంత భాగాన్ని అమ్ముకోవటం తప్ప వేరే మార్గం లేదు.
బంజరు భూముల్లో కనిపించే కాక్టస్/బ్రహ్మజెముడు జాతి (యుఫోర్బియా లాక్టియా)కి చెందిన మొక్కల్ని పొలం చుట్టూ నాటాను. ఎకరానికి మహా అయితే రూ. 1,500 ఖర్చయ్యింది. అది కూడా కూలీలకు మాత్రమే. ఏడేళ్ల తర్వాత ఇప్పుడు మా పొలం చుట్టూ దట్టంగా అల్లుకున్న ఆకుపచ్చని ముళ్ల కంచె దుర్భేద్యమైన కోటలాగా నిలబడి ఉంది. కోతులు, అడవి జంతువుల బెడద అన్న మాటే లేదిప్పుడు.
ఏ పంటైనా చేతికొస్తుందో లేదన్న బెంగ లేదు. అందరూ ఆశ్చర్యపడేంత స్థాయిలో పంటల దిగుబడి వస్తోంది. అంతేకాదు, బలమైన గాలుల నుంచి, చీడపీడల నుంచి పంటలను, మట్టిని రక్షించుకోగలుగుతున్నాను’అంటున్నారు బగడే సగర్వంగా. చుట్టుపక్కల బంజరు భూముల్లో నుంచి కాక్టస్ జాతి ముళ్ల మొక్కల కాండాలను కోసి ట్రాక్టర్ ట్రక్కులో వేసుకొని తెచ్చి.. 2 అడుగుల పొడవు ముక్కలను కత్తిరించి.. అడుగుకు ఒకటి చొప్పున పొలం చుట్టూతా నాటారు.
మొదట్లో అందరూ అతన్ని పిచ్చోడు అని ఎగతాళి చేశారు. ఇప్పుడు నిశ్చింతగా పంట చేతికివస్తుంటే ఎంత తెలివైన పని చేశాడని పొగుడుతున్నారు. కట్టెలతో, బార్బ్‌డ్ వైర్‌తో లేదా రాళ్లతో కంచెను ఏర్పాటు చేసుకోవటం కన్నా దట్టంగా అల్లుకుపోయి 12 అడుగుల ఎత్తు వరకు ఎదిగిన ఈ జీవ కంచే (బయో ఫెన్స్) ఎంతో బాగుందని అందరూ అంటున్నారు.
కాక్టస్ జాతి ముళ్ల మొక్కల కాండాల 2 అడుగుల ముక్కలను నాటి.. తొలి దశలో శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడప్పుడూ ఎరువు వేస్తూ ఉంటే చాలు. ఒకటి రెండు ఏళ్లలో దాదాపుగా 5 అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఆ తర్వాత ఇక వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం గాని, నీరు పెట్టాల్సిన అవసరం గానీ ఉండదు.
‘పొలంలో, పరిసర ప్రాంతాల్లో వాన నీటి సంరక్షణ పనులు గ్రామస్తులం కలసి చేసుకున్నాం. భూగర్భ జలమట్టం బాగా పెరిగింది. ఇప్పుడు నీటికి కరువు లేదు. దానితో పాటు జీవ కంచె కూడా విజయవంతం కావటంతో రైతులకు మా పొలం దర్శనా స్థలంగా మారిపోయింది..’ అంటున్నారు బగడే ఆనందంగా.
తలవని తలంపుగా మరో ఉపయోగం కూడా చేకూరింది. జీవ కంచె పైకి కాకర, చిక్కుడు, సొర, బీర వంటి తీగజాతి కూరగాయ మొక్కల్ని పాకించి అదనపు ఆదాయం పొందే అవకాశం కూడా అందివచ్చింది!
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
Comments
Please login to add a commentAdd a comment