సాహసానికి సై యామి... భయమా... డోంట్‌ ఖేర్‌ | Saiyami Kher becomes first Indian actress to finish the Ironman 70. 3 Triathlon in Germany | Sakshi
Sakshi News home page

సాహసానికి సై యామి... భయమా... డోంట్‌ ఖేర్‌

Sep 25 2024 1:29 AM | Updated on Sep 25 2024 1:30 AM

Saiyami Kher becomes first Indian actress to finish the Ironman 70. 3 Triathlon in Germany

బాలీవుడ్‌ నటి సయామీ ఖేర్‌ తన చిరకాల స్వప్నం ‘ఐరన్‌ మ్యాన్‌ 70.3’ గురించి చెప్పినప్పుడు అభినందించిన వాళ్ల కంటే అపహాస్యం చేసిన వాళ్లే ఎక్కువ. ‘సినిమాల్లోలాగా అక్కడ డూప్‌లు ఉండరు’ అని నవ్వారు కొందరు. అయితే ఇవేమీ తన సాహసానికి అడ్డుగోడలు కాలేకపోయాయి.ప్రపంచంలోనే అత్యంత కఠినమైన రేస్‌గా ‘ట్రయథ్లాన్‌: ఐరన్‌మ్యాన్‌’ రేస్‌ గురించి చెబుతారు. 1.9 కిలోమీటర్‌ల స్విమ్మింగ్, 90 కిలోమీటర్‌ల బైసికిల్‌ రైడ్, 21.1 కిలోమీటర్‌ల పరుగుతో ‘ఐరన్‌ మ్యాన్‌’ రేసు పూర్తి చేసిన తొలి బాలీవుడ్‌ నటిగా సయామీ ఖేర్‌ చరిత్ర సృష్టించింది.

ఫ్రెండ్స్‌కు తన కల గురించి సయామీ ఖేర్‌ చెప్పినప్పుడు ‘నీలాగే చాలామంది కలలు కంటారు. రేస్‌ పూర్తి చేయని ఫస్ట్‌ టైమర్‌లు ఎందరో ఉన్నారు’ అన్నారు వాళ్లు. వెనక్కి తగ్గిన వారిలో తాను ఒకరు కాకూడదు అనుకుంది ఖేర్‌. ఫిబ్రవరిలో ‘ఐరన్‌ మ్యాన్‌’ రేస్‌ కోసం ట్రైనింగ్‌ మొదలైంది. మొదట్లో 3 కిలోమీటర్‌లు పరుగెత్తడం, ఈత ‘అయ్య బాబోయ్‌’ అనిపించేది. త్వరగా అలిసి పోయేది. సాధన చేయగా... చేయగా... కొన్ని నెలల తరువాత పరిస్థితి తన అదుపులోకి వచ్చింది. అప్పుడిక కష్టం అనిపించలేదు. ముఖ్యంగా క్రమశిక్షణ బాగా అలవాటైంది.

రోజు తెల్లవారుజామున మూడు గంటలకు నిద్ర లేచి శిక్షణ కోసం సిద్ధం అయ్యేది. ట్రైనింగ్‌లో తాను ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి లోతుగా ఆలోచించేది. ‘శిక్షణ బాగా తీసుకుంటే వాటిని అధిగమించడం కష్టం కాదు’ అని కోచ్‌ చెప్పిన మాటను అనుసరించింది.

‘ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో మారథాన్‌లలోపాల్గొంటున్నాను. అయితే నా దృష్టి మాత్రం ఐరన్‌ మ్యాన్‌ రేస్‌ పైనే ఉండేది. నా కలను నెరవేర్చుకోడానికి సన్నద్ధం అవుతున్న సమయంలో కోవిడ్‌ మహమ్మారి వచ్చింది. దీంతో నా కల తాత్కాలికంగా వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పటికైనా నా కలను నిజం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది’ అంటుంది సయామీ ఖేర్‌.

ఖేర్‌ మాటల్లో చెప్పాలంటే ‘ఐరన్‌ మ్యాన్‌ రేస్‌ అనేది శారీరక సామర్థ్యం, సహనానికి పరీక్ష.‘ఆటలు మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. మనసును ప్రశాంతం చేస్తాయి. ఐరన్‌ మ్యాన్‌ రేస్‌ పూర్తి చేయడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ ఆత్మవిశ్వాసం నా నట జీవితానికి ఉపయోగపడుతుంది’ అంటుంది 32 సంవత్సరాల సయామీ ఖేర్‌.

ఐరన్‌ మ్యాన్‌ ట్రయథ్లాన్‌
‘ఐరన్‌ మ్యాన్‌ ట్రయథ్లాన్‌’ అనేది వరల్డ్‌ ట్రయథ్లాన్‌ కార్పొరేషన్‌(డబ్ల్యూటిసి) నిర్వహించే రేసులలో ఒకటి. దీనిని ప్రపంచంలోనే అత్యంత కఠినమైన స్పోర్ట్‌ ఈవెంట్‌గా చెబుతారు. ఈ రేసు సాధారణంగా ఉదయం ఏడుగంటలకు మొదలై అర్ధరాత్రి ముగుస్తుంది. ఓర్పు, బలం, వేగానికి సంబంధించి ట్రయథ్లెట్లు రేసుకు కొన్ని నెలల ముందు కఠిన శిక్షణ తీసుకుంటారు.

అయిననూ ఛేదించవలె...
గత సంవత్సరం బైక్‌ యాక్సిడెంట్‌లో గాయపడ్డాను. కొన్ని నెలల రెస్ట్‌. మరోవైపు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. ‘ఇలాంటి పరిస్థితుల్లో సాహసాలు అవసరమా!’ అనిపిస్తుంది. నాకైతే అలా అనిపించలేదు సరి కదా ఎలాగైనా సాధించాలనే పట్టుదల పెరిగింది. ‘ఏదైనా చేయాలి అని మనసు బలంగా అనుకుంటే దానికి అనుగుణంగా శరీరం కూడా సన్నద్ధం అవుతుంది’ అంటారు. ఇది నా విషయంలో అక్షరాలా నిజం అయింది.

అయితే ప్రతికూల పరిస్థితులు మళ్లీ ముందుకు వచ్చాయి. రేసుకు వారం ముందు కెనడాకు నా ప్రయాణం (వర్క్‌ ట్రిప్‌) పీడకలగా మారింది. విమానాలు ఆలస్యం కావడం నుంచి కాంటాక్ట్స్‌ కోల్పోవడం వరకు ఎన్నో జరిగాయి. నా బ్యాగ్‌లు మిస్‌ అయ్యాయి. భారత రాయబార కార్యాలయం సహకారంతో ఆ సమస్య నుంచి ఎలాగో బయటపడ్డాను. ఇక ‘ఐరన్‌ మ్యాన్‌ రేస్‌’లో నా గేర్‌ మొదలైనప్పుడు గాలులు తీవ్రంగా వీచడం మొదలైంది. అయినప్పటికీ ఈత కొట్టడానికి, రైడ్‌ చేయడానికి వెళ్లాను. నా మార్గంలో వచ్చిన ప్రతిదాన్ని ఆస్వాదించాలని గట్టిగా అనుకున్నాను. నీరు గడ్డకట్టినప్పటికీ రేసును ఒక వేడుకలా భావించాను. కోల్డ్‌వాటర్‌లో 42 నిమిషాలు ఈదాను.  – సయామీ ఖేర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement