చీరకట్టును అందమైన పదాలతో కవితలను అల్లుతుంటారు కవులు. కానీ, సయంతీ ఘోష్ చీరల డిజైన్స్ చూస్తే మాత్రం పచ్చని అడవి తల్లి చెప్పే జ్ఞాపకాల కథల గొలుసును అల్లుకోవచ్చు. రంగు రంగుల పక్షులు, జంతువులు,పెద్ద పెద్ద వృక్షాలు, దట్టమైన ΄÷దలు, అందమైన లతలు... ఇవన్నీ డిజైన్లుగా చేరి సయంతీ కలెక్షన్‌ను ఆకర్షణీయంగా మార్చేశాయి. ఆ కథల డిజైన్ల సృజన వెనకాల కృషి మనమూ తెలుసుకుందాం.
ఫ్యాషన్ డిజైనర్ సయంతీ ఘోష్ కలకత్తావాసి. తనపేరు మీదుగానే డిజైనర్ స్టూడియోను నడుపుతున్నారు ఆమె. అడవి, అందులోని జంతుజాలం నుంచి స్ఫూర్తి పొంది వైల్డ్ లైఫ్‌ను చీరలు, బ్లౌజుల మీదకు తీసుకువస్తున్నారు. ప్రకృతి అందాన్ని ఎంబ్రాయిడరీ ద్వారా చూపుతూ ఫారెస్ట్ డిజైన్స్‌ని ఆకట్టుకునేలా చూపుతోంది.
‘‘సంప్రదాయ చేనేతలు, భారతీయ వస్త్రాలపైన థ్రెడ్‌వర్క్‌తో కూడిన హ్యాండ్ క్రాఫ్ట్ డిజైన్స్ రూపొందించడమే మా ప్రత్యేకత. డిజైన్ల ద్వారా కథలు చెప్పడం మా బ్రాండ్ గొప్పతనం. చిన్నతనంలో అందరం జంతువుల బొమ్మల పట్ల ఆకర్షితులం అయ్యేవాళ్లం. ఆ చిన్ని మనసు ఎప్పుడూ నాటి ఆనందాల చుట్టూతానే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ చిన్ననాటి జ్ఞాపకాలను సజీవంగా తీసుకు రావాలని చేసిన ప్రయత్నమే ఈ డిజైనర్ చీరలు, బ్లౌజులు.
సృజనకు మొదటి కిటికీ..
ముడి సిల్క్, మస్లిన్, ఆర్గన్జా, టస్సర్, ముగా సిల్క్.. వంటి ఫ్యాబ్రిక్స్ వాడుతున్నాం. అడవిని భూమికి ఊపిరితిత్తులుగా పిలుస్తారు. చిన్నప్పుడు మోగ్లీ (ది జంగిల్ బుక్) జీవితం, ప్రయాణాన్ని గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపేదానిని. ఆ యానిమేషన్ అందమైన, సృజనాత్మక ప్రపంచం నా ముందు తెరుచుకున్న మొదటి కిటికీ. జంగిల్ బుక్ మా ఇంటికి చాలా దగ్గరే అనిపించేది. అడవి, అందులోని జంతువులపై నా అభిమానాన్ని పెంచుకున్నాను.
ఆ అడవి అందాన్ని చెక్కు చెదరకుండా ఉంచుతూ, చిన్ననాటి జ్ఞాపకాలు, ప్రకృతి పట్ల ప్రేమతో ప్రతిధ్వనించేలా నా కొత్త సేకరణ ఉండేలా చూసుకున్నాను. అంతేకాదు, చిన్నతనంలో మన హృదయాలలో గూడుకట్టుకున్న అడవిలోని స్నేహితులను ఇప్పటికీ ప్రేమించడం చాలా ముఖ్యం. ఆ అడవిలోని స్నేహితులు అంతరించి ΄ోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన అడవులు ఇంకా పచ్చదనంతో నిండాలి. ఈ ఆలోచనే నా డిజైన్స్ సృష్టికి మూలం.
తొమ్మిదేళ్ల క్రితం..
మొదట్లో మా హోమ్ గ్యారేజ్ స్పేస్‌లోనే బ్లౌజుల రూపకల్పనతో ఈ బ్రాండ్‌ను మొదలుపెట్టాను. అక్కణ్ణుంచి ఈ రోజు వరకు భారతదేశం అంతా ప్రత్యేక యూనిట్లను నడుపుతున్నాను. మెషిన్ ఎంబ్రాయిడరీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, జమ్దానీ, కలంకారీ, ఎకో–ప్రింటింగ్, మధుబని, హ్యాండ్ పెయింటింగ్, బాతిక్, పిచ్వాయి.. వంటి పన్నెండు టెక్నిక్‌లతో డిజైన్ చేస్తాను. నా రోజువారి జీవితమంతా ప్రకృతి, వాస్తు శిల్పం నుంచి స్ఫూర్తిæ పొందుతూ ఈ డిజైన్స్ సృష్టిస్తుంటాను’’ అని వివరిస్తుంది సయంతీ.
– సయంతీ ఘోష్
Comments
Please login to add a commentAdd a comment