Why Should We Not To Store These Foods In Refrigerator: కూరగాయలు, పండ్లు... ఇలా ఏవైనా బయటి నుంచి కొనుక్కుని రాగానే శుభ్రం చేసి ఎక్కువ కాలం తాజాగా ఉండాలని ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. అది కొంతవరకూ నిజమే. అయితే కొన్ని కూరగాయలు, పండ్లను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అవి వాటి సహజ గుణాలను కోల్పోతాయి. ఒక్కోసారి అవే మన అనారోగ్యానికి కారణమవుతాయి. అలాగని ఫ్రిజ్‌లో పెట్టవలసిన వాటిని పెట్టడం మానకూడదు.
అయితే ప్రస్తుతానికి మనం ఫ్రిజ్‌లో ఏమేమి పెట్టకూడదో తెలుసుకుందాం. ఈ కింది వాటిని ఎప్పుడూ ఫ్రిజ్‌లో పెట్టకండి. వీటికి గది ఉష్ణోగ్రతే సరిపోతుంది. ఇంతకీ అవేమిటి? వాటిని ఫ్రిజ్‌లో పెడితే ఏమౌతుందో తెలుసుకుందాం.
టమాటా:
టమాటాలు ఫ్రిజ్‌లో పెడితే గట్టిపడిపోతాయి. వాసన కూడా పోతుంది. దీంతో మనం ఏదైనా వంటకం చేస్తే రుచీపచీ ఉండదు. కాబట్టి ఈసారి మీరు ఇంటికి టమాటాలు తీసుకువస్తే శుభ్రం చేసిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టకుండా బయట గది ఉష్ణోగ్రత వద్దే ఉంచడం మరచిపోకండి.
అరటికాయలు:
అరటికాయలను ఫ్రిజ్‌లో పెడితే తొందరగా నల్లబడిపోతాయి. ఇలా నల్లబడిన అరటికాయలను చూస్తూ చూస్తూ పారేయలేము. అలాగని తినలేము కూడా. ఒకవేళ తిన్నా కూడా రుచి ఉండదు.
అందువల్ల ఫ్రిజ్‌లో పెట్టకుండా ఎక్కువ రోజులు అరటికాయలు తాజాగా ఉండాలంటే వాటిని తడి లేని ప్రదేశంలో ఉంచి ప్లాస్టిక్ కవర్ సగం వరకు తొడగండి. అరటి కాయలే కాదు, అరటి పండ్లు కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదు.
ఆవకాడో:
ఫ్రూట్స్‌లో కాసింత ఖరీదయినది అవకాడో. మరి అంత ఖరీదు పెట్టి అవకాడో కొన్నాం కదా అని దానిని తీసుకెళ్లి పదిలంగా ఫ్రిజ్‌లో పెట్టేయద్దు. దానివల్ల అవకాడో రుచి మారుతుంది. వాటిని తడి లేని చోట, గాలి మారే చోట భద్రపరిస్తే మంచిది.
పుచ్చకాయ:
ఇంటికి పుచ్చకాయ తెస్తే సగం కోసి మిగిలింది ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. అందరి ఇళ్లల్లో జరిగేదే ఇది. కానీ, పుచ్చకాయని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ని కోల్పోతాం. ఫలితంగా పుచ్చకాయ తిన్నా కడుపు నిండుతుందేమో గానీ ఆరోగ్య ప్రయోజనాలు అందవు.
వంకాయ:
వంకాయలను ఫ్రిజ్‌లో పెడితే తొందరగా పాడైపోతాయి. ఇవి ఫ్రిజ్‌లో కంటే బయట ఉంటేనే తాజాగా ఉంటాయి.
ఉల్లి, వెల్లుల్లి:
వెల్లుల్లిపాయలు ఫ్రిజ్‌లో కంటే గాలి, వెలుతురు ఉండే చోట పెడితే నెలరోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయి. వీటిని ఫ్రిజ్‌లో పెడితే జిగురు వస్తుంది. ఉల్లి కూడా అంతే!
చాక్లెట్లు:
చాలామంది పేరెంట్స్ చాక్లెట్లను ఫ్రిజ్‌లో పెట్టి పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఇస్తుంటారు. అయితే అలా ఫ్రిజ్‌లో పెట్టిన చాక్లెట్లు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పైగా ఫ్రిజ్ లో పెట్టడం వల్ల చాక్లెట్లకు ఉండే సహజమైన రుచి, ఫ్లేవర్ దెబ్బతింటాయి. అయితే బయటపెట్టినా వీటిని ఎండలో కాకుండా కాంతి కిరణాలకు దూరంగా ఉంచడం మంచిది.
గుడ్లు:
చాలామంది ఇళ్లలో ఫ్రిజ్ తెరవగానే ఎగ్ ట్రేస్ దర్శనమిస్తాయి. అయితే ఎగ్స్‌ని ఎప్పుడూ ఫ్రిజ్‌లో పెట్టకూడదు. మార్కెట్లలో కూడా గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచరు. వీలయినంత వరకు వీటిని బయట ఉంచితేనే బెటర్.
బ్రెడ్:
బ్రెడ్‌ని ఫ్రిజ్‌లో ఉంచితే తొందరగా పాడవుతుంది. అది త్వరగా ఎండిపోతుంది. బ్రెడ్ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా బయట ఉంచితే అది ఫ్రెష్‌గా ఉంటుంది.
బత్తాయి పండ్లు:
సిట్రస్ యాసిడ్ ఉన్న బత్తాయిలు ఫ్రిజ్‌లో ఉంచితే త్వరగా పాడైపోతాయి.
అదే విధంగా... తేనె, కాఫీ గింజలు, కెచప్, పీనట్ బటర్, దోసకాయలు, స్ట్రాబెర్రీస్‌లను ఫ్రిజ్‌లో పెట్టద్దు. మరేం చేయాలి.. అని చికాకు పడకండి. మరీ సంచులు సంచులు కాకుండా వారానికి సరిపడా కూరగాయలు, పండ్లు తెచ్చుకోండి చాలు. ఆ తర్వాత మళ్లీ తాజాగా తెచ్చుకుంటే సరి. అప్పుడు అనారోగ్యాలు మీ దరి చేరవు.
చదవండి: Health Tips: బోడ కాకర తరచుగా తింటున్నారా? దీనిలోని లుటీన్ వల్ల..
Comments
Please login to add a commentAdd a comment