సౌమ్యంగా సాధించింది సౌమ్య ఈ తరం టెకీ. సాంకేతికతను ఆరోగ్యానికి అద్దింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో వైద్యరంగంలో కొత్త ఒరవడి తెచ్చింది. వైద్యరంగం, ఔషధాల తయారీ రంగాలు సాంకేతికతను అందుకోవాల్సినంత వేగంగా అందుకోవడం లేదనుకుంది సౌమ్య. ‘మల్టిప్‌లైయర్ ఏఐ’ పేరుతో హెల్త్‌కేర్ రంగంలో ప్రవేశించింది. ఇంత సునిశితమైన, సంక్లిష్టమైన పరిశ్రమను నిర్వహించడం మగవాళ్లకే సాధ్యం అనే అభిప్రాయాన్ని చెరిపేసిందామె.
‘మగవాళ్ల ప్రపంచం అనే భావన మహిళలు ప్రవేశించేటంత వరకే. ఒకసారి మహిళలు ప్రవేశిస్తే ఇక అది అపోహ మాత్రమేనని నిర్ధారణకు వచ్చేస్తాం. మా టీమ్ లో సగానికి పైగా మహిళలే. సేల్స్ విభాగంలో కూడా మహిళలు సమర్థంగా పని చేస్తున్నార’ని చెప్పింది. ఒక టెకీ హెల్త్‌కేర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి దారితీసిన పరిస్థితులను, హైదరాబాద్‌లో సంస్థ స్థాపించి సక్సెస్ అందుకున్న వైనాన్ని సాక్షితో పంచుకున్నారు సౌమ్య.
భారీ మూల్యం చెల్లించాం
‘‘నన్ను హెల్త్‌కేర్ ఇండస్ట్రీలోకి రప్పించిన కారణాలు అత్యంత బాధాకరమైనవి. మాది ఉత్తరప్రదేశ్, ప్రయాగరాజ్ (అలహాబాద్). నాన్న రవిప్రకాశ్ శ్రీవాస్తవ ఐఏఎస్ ఆఫీసర్. నాన్న డయాబెటిస్‌తో బాధపడుతుండేవారు. రొటీన్ టెస్ట్‌లు, మెడికేషన్ ఇవ్వడంలో ఎక్కడో పొరపాటు జరిగిపోయింది. మా జీవితాలు భారీ మూల్యం చెల్లించుకున్న పొరపాటు అది. వైద్యుల నిర్లక్ష్యం, రాంగ్ మెడికేషన్ కారణంగా ఆయన హటాత్తుగా ప్రాణాలు వదిలారు. నేనప్పుడు బీటెక్ సెకండియర్‌లో ఉన్నాను. ఆ తర్వాత కొద్దిసంవత్సరాల్లోనే అమ్మకు ఒవేరియన్ క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. మేము తెలుసుకునేటప్పటికే వ్యాధి మూడవ దశకు చేరింది.
చికిత్స మొదలు పెట్టినప్పటికీ ఆరు నెలలకే అమ్మను కూడా కోల్పోయాను. అలాంటి దయనీయమైన పరిస్థితుల్లోనే బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ట్రిపుల్ ఐటీలో బయోటెక్నాలజీలో మాస్టర్స్ చేశాను. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ వైద్యరంగం ఆ వేగాన్ని అందిపుచ్చుకోవడంలో వెనకబడుతోంది. ఆ వెనుకబాటు తెచ్చిన నష్టంలో మా అమ్మానాన్నల మరణాలు కూడా భాగమేననిపించింది. ఈ రెండు రంగాల మధ్య ఉన్న అంతరాన్ని భర్తీ చేయాలనే సంకల్పం కలిగింది, చేయగలననే నమ్మకం కూడా.
సమాచారలోపం తలెత్తని విధంగా మెడికల్ డాటాను పరిరక్షించగలిగే పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి పూనుకున్నాను. మల్టిప్‌లైయర్ ఏఐ స్థాపించి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా డాటా అనలైజేషన్, డాటా మెయింటెయిన్ చేస్తున్నాం. మా సంస్థకు ‘ఐఎస్‌ఓ 27001’ సర్టిఫికేట్ వచ్చింది. మా సర్వీస్‌ను దేశవిదేశాల్లో పెద్ద ఆరోగ్య సంస్థలు తీసుకుంటున్నాయి. పేషెంట్ కేర్‌లో మొదటిది పేషెంట్ ఆరోగ్య చరిత్ర, క్రమం తప్పని పరీక్షల ద్వారా వ్యాధులను తొలిదశలోనే గుర్తించడం, పరీక్షల నివేదికల నిర్వహణ ప్రధానమైనవి. ఇక్కడ పొరపాటు జరిగితే ప్రాణాలు దక్కవని చెప్పడానికి మా పేరెంట్సే ఉదాహరణ.
ఫాలో అప్ సర్వీస్
వ్యాధి నిర్ధారణ ఆధారంగా వైద్యం అందించిన తర్వాత తదనంతర పరీక్షలను, వైద్యాన్ని అందించాల్సిన సమయానికి ఫాలో అప్ చేయడం కూడా మా సర్వీస్‌లో భాగంగా ఉంది. అలాగే భవిష్యత్తులో టెలిమెడిసిన్ విస్తరించాల్సిన అవసరం ఉంది. వైద్యచికిత్సను కుగ్రామాలకు చేరడానికి చక్కటి మాధ్యమం ఇది. పేషెంట్‌ను ఉన్న చోటనే ఉంచి ఆరోగ్యపరిస్థితిని మానిటర్ చేయడం సాధ్యమవుతుంది. నేను చదివిన టెక్, బయోటెక్ పరిజ్ఞానం ఇందుకు దోహదం చేసింది.
నాకు సవాళ్లు ఎదురయ్యాయా అంటే సవాళ్లు లేని ప్రొఫెషన్ అంటూ ఏదైనా ఉంటుందా? డిజిటల్ బ్రాండింగ్, మార్కెటింగ్‌లో అవరోధాలు వచ్చాయి. మా క్లయింట్ల సందేహాలను తీరుస్తూ, వాళ్లు సమాధానపడే వరకు సహనంగా వివరించాం. సవాళ్లకు సమాధానాలు వెతుక్కుంటూ ముందుకు పోవడమే సక్సెస్‌కు దారి తీస్తుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మా నాన్నను కోల్పోవడమే నన్ను ఈ రంగం వైపు నడిపించింది. ప్రతి విజయంలో మా అమ్మానాన్న కనిపిస్తున్నారు’’ అని వివరించారు సౌమ్య.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
(చదవండి: తండ్రికి కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందే! హైకోర్టు జస్టిస్ ఆదేశం!)
Comments
Please login to add a commentAdd a comment