అతడి రూపం నల్లటిది. కాని మనసు మాత్రం మరుమల్లె కన్న తెల్లనిది, పరిమళభరితమైనది, స్వచ్ఛమైనది. బాల్యం నుంచి – ఆ మాటకొస్తే పుట్టకముందు నుంచే ఆయన ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు? ఎన్ని సవాళ్లను అధిగమించాడు? కన్నతల్లిదండ్రులకు దూరమయ్యాడు. స్వంత మేనమామే శత్రువై సంహరింప చూసినా చలించని, దేనికీ భయపడని, ఎవరికీ లొంగని ఆ ధీరోదాత్తుడే శ్రీకృష్ణుడు. కార్యసాధన అంటే ఏమిటో ఆచరించి చూపిన సిసలైన కార్యసాధకుడు, శరణన్న వారికి రక్షణగా నిలిచిన అసలైన రక్షకుడు, మోసాన్ని మోసంతోనే జయించాలని, ముల్లును ముల్లుతోనే తీసివేయాలని, తగిన ఉపాయముంటే ఎంతటి అపాయం నుంచయినా బయట పడవచ్చునని రుజువు చేసి చూపిన అసహాయ శూరుడు శ్రీకృష్ణుడు. అసలైన వ్యక్తిత్వ వికాసమంటే ఏమిటో గీత ద్వారా బోధించి చూపాడు. శ్రీకృష్ణుని లీలలు తెలుసుకోవడమే కాదు, ఆయన మంచితనాన్ని, ఉన్నత వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాలి.
కిట్టనివాళ్లు ఆయనను మాయావి అన్నారు. ఓరిమితో సహించాడు. కొందరు కృష్ణుడంటే శృంగార పురుషుడే కదా! అన్నారు. చిరునవ్వులు చిందించాడు. కొందరు తాత్వికుడన్నారు. కాదనలేదు. నీవే పరమాత్ముడవంటూ పూజలు చేశారు. కాదు పొమ్మనలేదు... తనను ఎవరు ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో దర్శనమిచ్చాడు. పదహారువేలమంది గోపికలన్నారు కానీ, వారిలో ఏ ఒక్కరైనా కృష్ణయ్య నన్ను చూసి నవ్వాడనో, కొంటెగా కన్నుగీటాడనో అనగా విన్న దాఖలాలు ఉన్నాయా ఎక్కడైనా? అష్టభార్యలన్నారు. వారిలో ఏ ఒక్కరైనా తనను నిర్లక్ష్యం చేశాడని మొరపెట్టుకున్నట్లు విన్నామా? లేదే! చీరలెత్తుకెళ్లిన చిలిపివాడన్నారు కానీ, గోపకాంతలు ఒడ్డున చీరలు వేసి, ఆదమరచి స్నానాలు చేస్తుంటే, వారికి తెలివి నేర్పటం కోసమే తానలా చేశానని కానీ, అజ్ఞానానికి సంకేతమైన నల్లని కుండ నుంచి జ్ఞానానికి ప్రతీక అయిన తెల్లని వెన్నను దొంగిలించి తినడం ద్వారా వారికి తాను ఎన్నో సంపదలను ప్రసాదించానని కానీ, దుష్టురాక్షసులను సంహరించటం ద్వారా వారికి ముక్తిని ప్రసాదించానని కానీ చెప్పుకోలేదు. దేనికీ చలించకుండా తన స్థితప్రజ్ఞతను లోకానికి చాటిన వాడే శ్రీకృష్ణుడు.
కృష్ణాష్టమి ఎలా జరుపుకోవాలంటే...
ఇది యావద్భారతం చేసుకునే పండుగ. ఈ పండుగను చేసుకునేవారు ఉదయాన్నే లేచి పరిశుద్ధులై, షోడశోపచారాలతో కృష్ణుని పూజించాలి. పగలంతా ఉపవసించి సాయంకాలం చిన్నికృష్ణుని విగ్రహాన్ని ఊరేగించి, తర్వాత ఊయలలో ఉంచి, ఊపాలి. దేవకీదేవి బాలకృష్ణునికి స్తన్యమిస్తున్నట్లుగా ఉండే విగ్రహాన్ని పూజించినా మంచిదే. అనంతరం కృష్ణునికి ప్రీతికరమైన పాలు, వెన్న, పండ్లు, అటుకులు మొదలైన వాటిని నైవేద్యం పెట్టి, వాటిని ప్రసాదంగా ఆరగించడం వల్ల అన్నింటా జయం సిద్ధిస్తుందని పురాణోక్తి. ఈ పుణ్యతిథి నాడు కృష్ణుని పూజించి, భాగవత గ్రంథాన్ని పఠించినా, దానం చేసినాlసకల పాపాలూ తొలగి, చతుర్విధ ఫల పురుషార్థాలు అంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం ప్రాప్తిస్తాయని స్కాందపురాణం చెబుతోంది. – డి.వి.ఆర్. భాస్కర్
సకల అవతారాలకు మూలం శ్రీ కృష్ణస్వరూపం
శ్రీ కృష్ణుని ఏ చిత్రం చూసినా మనకు ప్రధానంగా కనిపించేవి ఆయన గోపసఖులతో ఆటలాడుకోవడం, గోవులను కాయటం, వన్యప్రాణుల మధ్య పిల్లన గ్రోవిని పట్టుకొని మధుర వాయిద్యం చేయటం వంటివే! భగవంతుని స్వభావం కేవలం గంభీరంగా వ్యవహరిస్తూ దుష్టులను అంతమొందించటమే కాదు. అది కేవలం ఈ విశ్వనిర్వహణకు అవసరమయ్యే గుణం మాత్రమే. అందుకు తగ్గ ఐశ్వర్య సంపన్నమైన రూపమే విష్ణు లేదా నారాయణరూపం. ఆయనున్న ఆ ఐశ్వర్యధామానికే వైకుంఠమని పేరు.
సాధారణంగా విష్ణువుతో భక్తులు దాస్యరస భావనను కలిగుంటారు. అంటే, తాము భగవంతుని నిత్యసేవకులమని, దాసులమని. కాని, భగవంతుని అసలైన రూపం, స్వభావం, తన భక్తులతో షడ్రస భావనతో మెలిగే తత్త్వం కేవలం కృష్ణ స్వరూపంలో మాత్రమే సంపూర్ణంగా వీక్షించగలం. భగవంతుడు అన్యరూపాన్ని ధరించక, ఎట్టి ఐశ్వర్యతత్త్వాన్ని వెళ్లబుచ్చక మన ముందు వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో, ఆ రూపమే శ్రీ కృష్ణస్వరూపం. ‘కృష్ణస్తుభగవాన్ స్వయం’ అన్నది అందుకే మరి! దేవదేవుని అవతారాలు ఎన్నైనా, అంశలు అసంఖ్యాకమైనా, శ్రీ కృష్ణుడే స్వయంభగవంతుడని ప్రబోధించారు వేదవ్యాసులవారు.
ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న కోవిడ్–19 సమస్త మానవాళికి ఒక ముఖ్యమైన అనుభవాన్ని చవిచూపింది. జీవితసత్యాన్ని నేర్పించింది. కోవిడ్ అంటేనే ఎంతో మంది భయభ్రాంతులకు లోనవుతున్నారు. నిత్యం దాని గురించే ఆలోచిస్తూ, మితిమీరిన భావోద్వేగాలకు ఆస్కారమివ్వటమే ఇందుకు కారణం. అందుకు బదులుగా, మన దృష్టిని శ్రీ కృష్ణుని లీలావైభవాన్ని తెలుసుకునేందుకో, కీర్తించేందుకో మరల్చగలిగితే సత్వరం ఆ భావోద్వేగాల నుండి ఉపశమనం పొందగలం. ప్రతి ఒక్కరికీ శ్రవణం, కీర్తనం, స్మరణం చేయగల సామర్థ్యాలున్నాయి. వాటిని కృష్ణుని కోసం ఎందుకు ఉపయోగించరాదు? అదే మనకు మరోధైర్యాన్ని అందించే దివ్యౌషధం. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో మనం కలత చెందకుండా మనల్ని రక్షించగలిగే ఉపాయమొక్కటే – శ్రీ కృష్ణదివ్య నామాలు, లీలలను శ్రవణం, కీర్తనం, స్మరణం చేయటం. నేడు, రేపు జరిగే శ్రీ కృష్ణజన్మాష్టమి వేడుకల సందర్భంగా, ఆరోగ్య రక్షణ సూత్రాలను పాటిస్తూ వేడుకలలో పాలుపంచుకోండి. శ్రీ కృష్ణుని దివ్యనామాలను మనసారా కీర్తించండి: నిత్యం భగవన్నామాలను జపించండి. ఆనందంగా జీవించండి.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే – శ్రీమాన్ సత్యగౌర చంద్ర ప్రభుజీ, హరేకృష్ణ మూవ్ మెంట్ హైదరాబాద్ అధ్యక్షులు అక్షయపాత్ర ఫాండేషన్ ప్రాంతీయ అధ్యక్షులు.
Comments
Please login to add a commentAdd a comment