సబ్ లెఫ్టినెంట్ రితిసింగ్, కుముదిని త్యాగి : నౌకాదళ యుద్ధ నౌకల హెలికాప్టర్‌లకు తొలి మహిళా పైలట్‌లు
త్రివిధ దళాలు నిన్న ఒకేసారి.. మహిళలు ఎగరేసిన త్రివర్ణ పతాకాలు అయ్యాయి! నేవీ హెలికాప్టర్‌లు తొలిసారి మహిళల చేతికి వచ్చాయి! ఆర్మీ ‘పర్మినెంట్’ సర్వీస్‌లలోకి మహిళలు రావడం మొదలైంది!
ఎయిర్‌ఫోర్స్‌లో రఫేల్‌ను ఒక మహిళ నడపబోతోంది! రితిసింగ్, కుముదిని త్యాగి.. నావికా నాయికలుగా నిలవడం పతాక సన్నివేశం అయింది!
పంచభూతాలతో చెలిమి కలుపుకొని శత్రువు తో తలపడవలసిన పరిస్థితి నేవీలో ఉంటుంది. నింగి, నేల, నీరు అని చూడ్డానికి ఉండదు. ఎగరడమే, దూకడమే, ఈదడమే! ‘సమరమే..’ అంటూ యుద్ధనౌక నుంచి విమానాన్నైనా హెలికాప్టర్‌నైనా పైకి లేపాలి. సరిహద్దుల వైరి స్థావరాల్లో ప్రకంపనలు రేపాలి. దుద్భేద్యాలను బీటలు వార్చేంత మెరుపు వేగంతో గగనం నుంచి నిప్పులు కురిపించాలి. ఇంతటి అరివీరభయంకర విధి నిర్వహణ అవకాశం నేవీ చరిత్రలోనే తొలిసారిగా ఇద్దరు మహిళల చేతికి అంది వచ్చింది! అంది రావడం కాదు, అంది పుచ్చుకున్నారు! ఇప్పటివరకు పురుషులకు మాత్రమే పరిమితమై ఉన్న ఈ సవాలును కష్టపడి చేజిక్కించుకున్నారు.
నౌకాదళంలో ఇప్పటికే సబ్ లెఫ్ట్‌నెంట్‌లుగా ఉన్న రితీసింగ్, కుముదినీ త్యాగి నేవీలోని ‘అబ్జర్వర్’ కోర్సును విజయవంతంగా పూర్తి చేసి ఈ ఘనతను సాధించారు. భారతీయ నౌకాదళానికీ గౌరవం, గర్వం తెచ్చిపెట్టారు. సోమవారం కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్ నుంచి కదనోత్సాహంతో కొత్త పాత్రను పోషించడానికి బయటికి వచ్చిన రితి, కుముదినిలకు అక్కడి ఐ.ఎన్.ఎస్. గరుడ భారతీయ నౌకా స్థావరం ‘వింగ్స్’ని తొడిగి అభినందించింది. బాధ్యతల పూలగుచ్చాన్ని చేతికి అందించింది. యుద్ధనౌకల్లోని ఫైటర్ హెలికాప్టర్‌ల పైలట్‌లు ఇప్పుడు.. రితి, కుముదిని.
యుద్ధనౌకల్లో ఆకస్మిక, అత్యవసర విధుల నిర్వహణ మహిళలకు అనువుగా ఉండదు. గంటల పాటు సుదీర్ఘంగా సముద్రంపై గస్తీ కాస్తుండాలి. సిబ్బంది గదుల్లో మరుగు, మాటు ఉండవు. మహిళలకు అవసరం అయ్యే ప్రత్యేకమైన సదుపాయాలు, సౌకర్యాలు కనిపించవు. నీటిలో నీటిలా, గాలిలో గాలిలా ఉండిపోవలసిందే. అందుకే నేవీలో వైద్యాధికారులు, వ్యూహకర్తలుగా మాత్రమే మహిళలు కనిపిస్తారు. ఈ పరిస్థితి రితి, కుముదినిలతో మారబోతోంది. అంటే వీళ్ల కోసం నేవీ తనను తాను మార్చుకుంటుందని కాదు. నేవీకి అవసరమైన పోరాట పటిమను.. అన్ని ప్రతికూలతలకూ అతీతంగా వీళ్లు కనబరుస్తారు. శత్రువుపై ఒక కన్నేసి ఉంచుతారు. దాడులను ఊహిస్తారు. దళాలను అప్రమత్తం చేస్తారు. అప్పటికప్పుడు హెలీకాప్టర్‌లలో రివ్వున లేచి యుద్ధ సన్నద్ధ సంకేతాలను అందజేస్తారు. వీరి ఆగమనం కోసం ఇప్పుడు నౌకాదళంలోని ఎం.హెచ్.–60 ఆర్ హెలికాప్టర్‌లు ఎదురు చూస్తున్నాయి.
రితి సింగ్ హైదరాబాద్ అమ్మాయి. మూడు తరాలుగా వాళ్లది ‘రక్షణ దళాల కుటుంబం’. రితి తాతగారు ఆర్మీ ఆఫీసర్. రితి తండ్రి నేవల్ ఆఫీసర్. రితి ఇప్పుడు ‘వింగ్’ ఫైటర్ పైలట్. ‘వైట్ యూనిఫాం వేసుకోవడం నా కల’’ అంటారు రితి. ఇక కుముదిని యు.పి.లోని ఘజియాబాద్ నుంచి వచ్చారు. 2015లో ఒక నౌకాదళ విమాన ప్రమాదంలో లెఫ్ట్‌నెంట్ కిరణ్ షెకావత్ మరణించిన దుర్ఘటన కుముదిని నేవీలోకి వచ్చేందుకు ప్రేరణ అయింది. ఇక ఇటీవలే ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలను నడిపేందుకు శిక్షణ పొందే బృందంలో సభ్యురాలిగా ఒక మహిళను కూడా ఎంపిక చేసినట్లు యాదృచ్ఛికంగా సోమవారమే భారత వైమానిక దళం ప్రకటించింది.
హర్యానాలోని అంబాలాలో ఉన్న ‘గోల్డెన్ యారో’ స్థావరంలో ప్రస్తుతం ఆమె శిక్షణ పొందుతున్నారు. రఫేల్ వంటి ఒక ‘మల్టీ రోల్’ యుద్ధ విమానాన్ని ఒక మహిళ ఆపరేట్ చేయబోవడం అన్నది కూడా రితి, కుముదిని సాధించిన ఘనతకు, సృష్టించిన చరిత్రకు సమానమైనదే. అయితే ఆ మహిళ ఎవరు? ఆ మహిళకు మిగ్–21 ఫైటర్ జెట్‌ను నడిపించిన అనుభవం ఉందన్న ఒక విషయాన్ని మాత్రమే ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. 2018లో ఫ్లయింగ్ ఆఫీసర్ అవని చతుర్వేది సోలోగా యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళా పైలట్‌గా గుర్తింపు పొందారు. అప్పుడు ఆమె నడిపింది మిగ్–21 నే. వైమానిక దళంలోని యుద్ధ విధుల్లోకి ప్రయోగాత్మకంగా మహిళల్ని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన ఏడాదికే 2016 జూలైలో ‘ఫ్లయింగ్ ఆఫీసర్’ కోర్సు పూర్తి చేసుకున్న ముగ్గురు యువతులలో అవని ఒకరు. మిగతా ఇద్దరు పైలట్‌లు భావనా కాంత్, మోహనా సింగ్. ప్రస్తుతం ఎయిర్‌ఫోర్స్‌లో 10 మంది మహిళా ఫైటర్‌లు, 18 మంది మహిళా నేవిగేటర్‌లు ఉన్నారు. మొత్తంగా 1875 మహిళా అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment