కల్యాణం చూతము రారండీ | Special Story About Web Series Called Match Making | Sakshi
Sakshi News home page

కల్యాణం చూతము రారండీ

Published Tue, Jul 28 2020 12:01 AM | Last Updated on Tue, Jul 28 2020 12:01 AM

Special Story About Web Series Called Match Making - Sakshi

డబ్బున్న వాళ్లకు కూడా కష్టాలుంటాయి. తమ సంతానానికి తగిన వరుడూ వధువూ వెతకడమే ఆ కష్టం. అబ్బాయికి ఏం కావాలి? అమ్మాయి ఎంపిక ఏమిటి? ఇప్పుడు పెళ్లిళ్లలో ప్రయారిటీస్‌ ఏమిటి? ఇవన్నీ తాజా వెబ్‌ డాక్యుమెంటరీ ‘ఇండియన్‌ మేచ్‌మేకింగ్‌’ చర్చిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతున్న ఈ సిరీస్‌ దేశ విదేశాలలో పెద్ద రెస్పాన్స్‌ను పొందింది. ఒక పెళ్ళిళ్ల పేరమ్మ ఈ సిరీస్‌కు సూత్రధారి.

ఈ లాక్‌డౌన్‌లో ఇండియాలో, అమెరికాలో, సౌత్‌ ఏషియన్‌ దేశాలలో చాలామంది బింజ్‌ వాచింగ్‌ చేస్తున్న సిరీస్‌ ‘ఇండియన్‌ మేచ్‌మేకింగ్‌’. ఇరుగు పొరుగున ఒక అబ్బాయో, అమ్మాయో పెళ్లి కాకుండా ఉంటే వారి పెళ్లెప్పుడవుతుందా అని కుతూహలంగా చూసే సగటు భారతీయులకు 7 మంది నిజమైన అవివాహితులు ఆన్‌ స్క్రీన్‌ తమ పెళ్లి సంబంధాల కోసం వెతకడం కుతూహలం కాకుండా ఎలా ఉంటుంది? వారు తాము కోరుకున్న అమ్మాయి/అబ్బాయిని వెతుక్కోవడమే ‘ఇండియన్‌ మేచ్‌మేకింగ్‌’ డాక్యుమెంటరీ సిరీస్‌. దీనికి సూత్రధారిగా పని చేసింది నిజ జీవితంలో మేచ్‌మేకర్‌ అయిన సీమా తపారియా.

ఇండియా–అమెరికా
సీమా తపారియా ముంబైలో ఒక పెళ్లిళ్ల పేరమ్మ. ఆమెకు ‘సూటబుల్‌ షాదీ’ అనే మేట్రిమొనీ సంస్థ ఉంది. అమెను ‘ఇండియన్‌ మేచ్‌మేకింగ్‌’ సిరీస్‌కు సూత్రధారిగా తీసుకున్నారు. ఆమె తన దగ్గరున్న ప్రొఫైల్స్‌లోని ఏడు మంది అవివాహితులను పర్సనల్‌గా కలిసి, వారిని తగిన వధువుతో, వరునితో కలపడమే ఈ సిరీస్‌. అయితే ఇది చెప్పినంత సులభం కాదు. వీరంతా నటులు కాదు. నిజ జీవితంలో వ్యక్తులే. వీరు ఈ షో అగ్రిమెంట్‌ కిందకు రావాల్సి ఉంటుంది. చూపించిన సంబంధాలను కెమెరాల సాక్షిగా చూడాల్సి ఉంటుంది. నచ్చితే పెళ్లి వరకూ వెళ్లాల్సి ఉంటుంది.

ఇందుకు అంగీకరించే వధువు, వరుల కుటుంబాలను 500 మందిని ఈ సిరీస్‌ కోసం పరిశీలించారు. కొందరు ముందు అంగీకరించి మధ్యలో విరమించుకున్నారు. కొందరు నిలబడ్డారు. మొత్తం మీద కెమెరాల ఎదుట వీరు పెళ్లిచూపులు జరపడం, పెళ్లికి ప్రయత్నించమే ప్రేక్షకులకు కుతూహలం కలిగించే అంశం. వారితో పాటు ప్రేక్షకులు కూడా ఏ అబ్బాయికి ఏ అమ్మాయి సరిపోతుంది అన్నట్టుగా సిరీస్‌లో మమేకం కావడం ఈ సిరీస్‌ సక్సస్‌కు కారణం.

ఎవరెవరు?
ఈ షో కోసం ఇండియా నుంచి కొంతమందిని, అమెరికాలో స్థిరపడిన ఎన్‌ఆర్‌ఐలను కొంతమందిని తీసుకున్నారు. ఈ అవివాహితులతో పాటు వీరి కుటుంబాలు కూడా కెమెరా ముందుకు వచ్చి పెళ్లి చర్చల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ సిరీస్‌ 8 ఎపిసోడ్ల ఫస్ట్‌ సీజన్‌లో ప్రధానంగా కనిపించే వారు 1. అపర్ణ (లాయర్‌– హ్యూస్టన్‌), 2.ప్రద్యుమన్‌ (నగల వర్తకుడు– ముంబై), 3. నాడియా (ఈవెంట్‌ ప్లానర్‌– న్యూజెర్సీ), 4.వ్యాసర్‌ గణేశన్‌ (టీచర్‌–ఆస్టిన్‌) 5.అక్షయ్‌ (బిజినెస్‌మేన్‌–ముంబై), 6. అంకిత (ఫ్యాషన్‌ డిజైనర్‌– ఢిల్లీ). వీరు కాకుండా ఒక కుమార్తె ఉండి ద్వితీయ వివాహానికి ప్రయత్నిస్తున్న పంజాబీ మహిళ రూపమ్‌ కూడా ఉన్నారు.
కలయికలు– విడిపోవడాలు
పెళ్లిళ్ల పేరమ్మ సీమా తపారియా ఈ ఎపిసోడ్లలో ఒక్కో వధువు, వరుడు ఇంటికి వెళుతుంది. వారి ఇష్టాయిష్టాలు తెలుసుకుంటుంది. కుటుంబంతో మాట్లాడుతుంది. ఇల్లు చూస్తుంది. వారికి సరైన మేచింగ్‌ను ప్రవేశపెడుతుంది. ఉదాహరణకు అమెరికాలో లాయర్‌ అపర్ణ ఎదుట ఆమె మూడు పెళ్లి సంబంధాలను ఉంచుతుంది. అపర్ణ ఆ ముగ్గురు యువకులను కలుస్తుంది. కాని రిజెక్ట్‌ చేస్తుంది. అలాగే నాడియా అనే వధువును ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు కలుస్తారు. రిజెక్ట్‌ చేస్తారు. ఈ కలయికలు–విడిపోవడాలు కెమెరా సాక్షిగా జరుగుతుండటంతో వారి భావోద్వేగాలతో ప్రేక్షకులు కూడా ముడిపడుతుంటారు. ఈ సిరీస్‌లోని అక్షయ్‌ అమ్మకూచి. అతను నోరు తెరిచి మాట్లాడడు. అంతా తల్లే మాట్లాడుతుంటుంది. కోడలి కోసం ఎన్నో నగలు సిద్ధం చేసి ఉంటుంది. కాని కోడలు ఒక పట్టాన దొరకదు. దానికి కారణం నోట మాట లేని కొడుకు వరుసే.
విమర్శలు
ఈ సిరీస్‌కు ప్రశంసలు ఎన్ని వస్తున్నాయో విమర్శలు కూడా అన్నే వస్తున్నాయి. షో సూత్రధారి సీమా తపారియా అలియాస్‌ సీమా ఆంటీ ఎక్కువమందికి నచ్చింది. ఆమె హానెస్ట్‌గా ఈ సిరీస్‌ను నిర్వహిస్తోంది. అయితే ఆమె భావధార అంతా సంప్రదాయబద్ధమైనది కావడం విమర్శలకు కారణం. వధూవరుల ఎంపికలో తెలుపు, నలుపు, పొడవు, పొట్టి అనే రూపనిర్మాణాలు ఆమె మాటల్లో తరచూ దొర్లుతుంటాయి. ఆమెతో కలిసి పని చేసే మరో మేచ్‌మేకర్‌ అయితే ఈ షోలో ఒక వధువును ‘నీకు పెళ్లి కావాలంటే భర్త కెరీర్‌ను బట్టి అడ్జెస్ట్‌ కావాల్సి ఉంటుంది’ అని అంటుంది

వధువు, వరులకు కూడా గాఢమైన ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి. ఎందుకంటే వీరంతా దాదాపుగా 30లు దాటిన వారు. ఒకరిద్దరి నేపథ్యాలు కూడా అంత సుఖంగా లేవు. కొందరు తాతల కాలం లో వలస రావడం వల్ల ఇటు అమెరికన్లు కాలేక ఇటు ఇండియన్లు అవలేక అవస్థలు పడుతుంటారు. అందరూ చెప్పేది ‘కుటుంబం బాగుండాలి. మనిషి మంచివాడై అయి ఉండాలి’ అనేది. ఈ ‘మంచి’కి ఎవరి కొలబద్దలు వారికి ఉన్నాయి. అరేంజ్డ్‌ మేరేజెస్‌ ఇండియన్సే చేసుకుంటారని, పెళ్లికి గొప్ప విలువ ఇండియన్స్‌ మాత్రమే ఇస్తారన్నట్టు మాట్లాడ్డం గురించి కూడా విమర్శలు ఉన్నాయి.

ట్రెండింగ్‌
జూలై 16, 2020 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతున్న ఈ సిరీస్‌ దేశవిదేశాల్లో విపరీతమైన సందడి సృష్టించింది. అమెరికాలో టాప్‌ 10 సిరీస్‌లలో ఒకటిగా ఉంది. ఇండియాలో దీనిని చూస్తున్నవారి సంఖ్య విపరీతం. ఈ షో ఇంగ్లిష్‌లోనూ హిందీ డబ్బింగ్‌గానూ ఉండటం వల్ల రీచ్‌ ఎక్కువగా ఉంది. 8 ఎపిసోడ్లు అయ్యేసరికి కేవలం ఒక్క వరుడు నిశ్చితార్థం వరకూ వెళ్లాడు. తర్వాత ఏం జరుగుతుందో దేవునికి ఎరుక. సెకండ్‌ సీజన్‌ కోసం ఎదురు చూడాల్సిందే. – సాక్షి ఫ్యామిలీ

‘నేను సీమా తపారియా’
నాది కర్నాటకలోని గుల్బర్గా. ముంబైలో నా భర్తతో సెటిలయ్యాను. నాకు ‘సూటబుల్‌ షాదీ’ సంస్థ ఉంది. నాకు 19 ఏళ్లకే పెళ్లయ్యింది. అరేంజ్డ్‌ మేరేజ్‌. నాకు భారతీయ పెళ్లిళ్ల వ్యవస్థ మీద విశ్వాసం ఉంది. నేను ఎవరికైనా సంబంధం చూస్తే నా కుమార్తె, కుమారుడికి చూసినంత శ్రద్ధగా చూస్తాను. నేను డబ్బున్న సంబంధాలే చూస్తాను. పెళ్లి బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకొని నా ఫీజ్‌ తీసుకుంటాను. ఇండియన్‌ మేచ్‌మేకింగ్‌ షో నాకు లక్షలాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది. – సీమా తపారియా, సిరీస్‌ సూత్రధారి

‘నేను స్మృతి ముంద్రా’
నేను లాస్‌ ఏంజిలెస్‌లో పుట్టి, ఇండియాలో కొంతకాలం ఉండి, తిరిగి అమెరికా వచ్చేశాను.  పెళ్లి సంబంధాల నేపథ్యంలో నేను 2018లో తీసిన ‘ఏ సూటబుల్‌ గర్ల్‌’ డాక్యుమెంటరీకి చాలా పేరు వచ్చింది. మా అమ్మ నా పెళ్లి కోసం చాలా మేట్రిమొనీలు తిప్పింది. ఆ అనుభవాలను చూసి ఇండియన్‌ మేచ్‌మేకింగ్‌ డాక్యుమెంటరీ సిరీస్‌ తీద్దామనుకున్నాను. ముందు నెట్‌ఫ్లిక్స్‌ రిజెక్ట్‌ చేసింది. కాని సీమా తపారియాను చూపించాక ఓకే చేశారు. స్క్రిప్ట్‌లేని కథను తీయడం ఎంత కష్టమో ఈ సిరీస్‌ తీయడం అంతే కష్టం. ఎందుకంటే ఇంచుమించు ఇది అలాంటిదే. – స్మృతి ముంద్రా, డైరెక్టర్‌

డాక్యుమెంటరీ సిరీస్‌: ఇండియన్‌ మేచ్‌మేకింగ్‌, ఎపిసోడ్స్‌: 8, పూర్తి నిడివి: సుమారు 5 గంటలు, ప్రెజంటర్‌: సీమా తపారియా, దర్శకత్వం: స్మృతి ముంద్రా, నిర్మాణం, విడుదల: నెట్‌ఫ్లిక్స్‌ (ఇంగ్లిష్‌/హిందీ భాషలలో)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement