చెడ్డ భర్తలతోనే కాదు మంచి భర్తలతో కూడా ఇబ్బందులుంటాయి. వీళ్లు కష్టపెట్టరు. బాధించరు. ప్రేమిస్తారు కూడా. కాని పని చేయరు. ఇంటిని నడపరు. ఇంటి చాకిరీయే అనుకుంటే ఇల్లు నడిపే చాకిరి అప్పుడు స్త్రీ మీద పడుతుంది. దానికి తోడు ఆర్థిక కష్టాలు. ఆ సమయంలో ఒక వింత జరిగితే? దానిని ఆమె తన భర్త నుంచి దాచి పెడితే? అనురాగ్ కశ్యప్ సినిమా ‘చోక్‌డ్’ ప్రేక్షకులకు వాస్తవ ప్రపంచపు మానవ ప్రవర్తనలను చూపిస్తోంది.
కష్టపడి సంపాదించిన డబ్బు తెల్లడబ్బు అవుతుంది. అక్రమంగా సంపాదించిన డబ్బు నల్లడబ్బు అవుతుంది. అవినీతి, పాపం, నేరం, మోసం చేస్తే ఈ నల్లడబ్బు పోగవుతుంది. అది ధారబోస్తే సౌఖ్యాలు దక్కుతాయి. కాని దానిని ఎలా సంపాదించామో తెలిసిన మనసుకు బురద అంటుతూనే ఉంటుంది. ఈ సినిమాలో మొదటి సన్నివేశంలో ఒక ఎమ్మెల్యే అనుచరుడు ఒక ఫ్లాట్‌లో ఎమ్మెల్యే అక్రమంగా సంపాదించిన డబ్బును దాచి పెడుతుంటాడు. అందులో తాను కొంత నొక్కేసి చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లలో చుట్టి బాత్‌రూమ్‌లోని డ్రయినేజీ పైపులో ఉంచుతుంటాడు. ఆ గలీజు గొట్టంలో దాగిన గలీజు డబ్బు కింద ఫ్లాట్‌లో కాపురం ఉంటున్న ఒక గృహిణికి అంటుకోవడమే ‘చోక్‌డ్’ కథ.
2016లో ఈ కథ జరుగుతుంటుంది.
సవిత ఒక సాధారణ గృహిణి. ముంబై శివార్లలోని దిగువ మధ్యతరగతి ఫ్లాట్‌లో కొడుకుతో, భర్తతో కాపురం ఉంటుంటుంది. ఆమెకు లోకల్ బ్యాంక్‌లో క్యాషియర్‌గా ఉద్యోగం ఉంది. ఇంటికి అదే ఆధారం. ఎందుకంటే భర్త పెద్దగా పని చేయడు. అతడు గిటార్ ప్లేయర్. భావుకుడు. శ్రమ తెలియదు. సంపాదనా తెలియదు. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఒకప్పుడు గాయని. కాని భర్త కోసం గాయనిగా తన కెరీర్ వదులుకుని ఉద్యోగానికి పరిమితమైంది. ఆ ఉద్యోగం ఆమెకు ఇష్టం లేదు. అందులో ఆమెకు ఒక ఊపిరాడనితనం ఉంటుంది. ఇంట్లో కూడా ఊపిరాడనితనమే. ఆ పాత ఫ్లాటు... మురికి గోడలు... పెచ్చులూడే శ్లాబులు... మంచి డోర్ కర్టెన్లకు కూడా నోచుకోని ఆర్థిక దుర్భరత్వం... రిపేరు చేయక ఎప్పుడూ గలీజు పైకి తేలే కిచెన్ డ్రయినేజీ... దానిని పట్టించుకోని భర్తపై చచ్చిపోయిన ప్రేమ... దీనినుంచి విముక్తి లేదా అనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా అలాంటి సమయంలోనే ఒక అర్థరాత్రి ధనలక్ష్మి దొడ్డిదారిలో ఆమె కిచెన్ డ్రయినేజీ నుంచి ఘల్లుఘల్లుమని చప్పుడు చేస్తుంది.
భర్తతో కొట్లాడిన సవిత ఒక రోజు రాత్రి కిచెన్‌లో కూచుని ఉంటే సింక్ కింద ఉండే డ్రయినేజీ పైపులో గురగుర మొదలవుతుంది. ఎప్పుడూ ఉన్న సమస్యే అనుకుంటుంది. అందులో నుంచి యథావిథిగా మురుగు నీళ్లు పొంగుతాయి. దాంతోపాటు రెండు ప్లాస్టిక్ చుట్టల్లో చుట్టిన కొద్దిపాటి డబ్బు కూడా. సవిత వాటిని తెరిచి చూస్తుంది. ఆశ్చర్యపోతుంది. ఆనందపడుతుంది. భర్తతో చెప్దామా వద్దా అని తటపటాయించి దాచుకుంటుంది. ఆ రోజు నుంచి ఆమె దినచర్య మారిపోతుంది.
ప్రతి రోజూ రాత్రి ఎప్పుడవుతుందా డ్రయినేజ్ పైప్ ఎప్పుడు పొంగుతుందా ఎప్పుడు డబ్బు బయటకు వస్తుందా అని ఎదురు చూడటమే పని. ఆమె కొద్ది కొద్దిగా వచ్చిన డబ్బును దాచుకుంటూ ఉంటుంది. ఈలోపు డీమానిటైజేషన్ వచ్చి పడుతుంది. రాత్రికి రాత్రి పాత నోట్లు చెల్లకుండా పోతాయి. తన దగ్గర ఉన్నవి బ్యాంకులో రహస్యంగా మార్చుకుంటుంది. అయితే మరికొందరు కూడా ఆమెను డబ్బు మార్చిపెట్టమని వెంటపడుతుంటారు. ఆర్థికకష్టాల నుంచి బయటపడుతున్నాననుకుంటున్న సవిత వేరే ప్రమాదాల్లోకి పోబోతూ ఉందా అని ప్రేక్షకులకు భయం వేస్తుంది. అయితే కథ మలుపులు తిరిగి సుఖాంతం అవుతుంది.
మనిషికి డబ్బు ఎంత కావాలి? ఒకవైపు చిన్న అవసరాలకు కూడా బాధపడే జనం. మరోవైపు అక్రమంగా సంపాదించి బాత్‌రూముల్లో దాచుకునే నికృష్టం. బ్లాక్‌మనీ బయటకు వస్తుంది అని భావించిన డీమానిటైజేషన్ ఎందరు సామాన్యులను ఇబ్బంది పెట్టిందో ఈ సినిమాలో చూపించడం ఒక ముఖ్యమైన అంశం. సవితకు ఈ సినిమాలో డబ్బు దొరికినా దానిని ప్రదర్శించడానికి, ఉపయోగించుకోవడానికి లేదు. భర్త నిఘా ఉంటుంది. ఇరుగు పొరుగు గమనింపు ఉంటుంది. పక్కవారు సడన్‌గా బాగుపడినా సవాలక్ష పుకార్లు లేస్తాయి. కొద్దిపాటి డబ్బు సామాన్యులను ఇంత గందరగోళం చేస్తే అన్ని వేల కోట్లు అక్రమడబ్బు దాచుకున్న పెద్దలు స్థిమితంగా ఎలా ఉంటారనే సందేహం కూడా ప్రేక్షకులకు కలుగుతుంది.
అవన్నీ పక్కన పెట్టి నగర జీవితంలో సగటు స్త్రీ జీవన విధానాన్ని, ఆమె నివాసంలో ఇరుగు పొరుగు స్త్రీలతో ఆమెకు ఉంటే స్నేహాన్ని, ఆ స్నేహంలో మంచి/చెడు సగటు ప్రవర్తనని అనురాగ్ కశ్యప్ చాలా శక్తిమంతంగా చూపించాడు. కనీస అవసరాలు తీరే వీలు లేని సంపాదన ఉన్న కాపురాలు ఎంత ఘర్షణాయుతంగా, అమానవీయంగా, ఒకరినొకరు హీనపరుచుకునే విధంగా ఉంటాయో కూడా చూపించాడు. అనురాగ్ కశ్యప్ తన ధోరణికి పక్కకు జరిగి మిడిల్ క్లాస్ డ్రామాను చూపించ యత్నించిన సినిమా ఇది. ఇంకా స్క్రిప్ట్ మీద శ్రద్ధ పెట్టాల్సింది అని ఎక్కువమంది భావిస్తున్నా ఒక భిన్నమైన వీక్షణ అనుభూతి కలిగించినందుకు సంతృప్తి పడుతున్నారు. ఇందులో ముఖ్యపాత్రలు పోషించిన ముగ్గురు సయామి ఖేర్, రోషన్ మేథ్యూ, అమృతా సుభాష్‌ల నటన చూడతగ్గది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. – సాక్షి ఫ్యామిలీ. మూవీ: చోక్‌డ్; నిడివి: 1 గం.54 నిమిషాలు; నిర్మాణం/ప్రదర్శన: నెట్‌ఫ్లిక్స్; దర్శకత్వం: అనురాగ్ కశ్యప్; విడుదల: జూన్ 5, 2020
Comments
Please login to add a commentAdd a comment