‘ఏమైంది?’ వెళుతున్న కారు వేగం తగ్గడంతో అడిగాడు మాధవ.. డ్రైవర్ని. ‘ముందు ఏదో ఊరేగింపులాగా వుంది సర్. వెళ్ళే బండ్లను ఆపేస్తున్నారు’ డ్రైవర్ తలని బయటపెట్టి చూసి చెప్పాడు సమాధానం. ‘అది వెళ్ళేదాకా మనం వెళ్ళలేమా? ఇంకో దారి ఏదైనా వుంటే అటుగా వెళ్ళు.’ ‘ఇక్కడ వేరే పక్క దారి లేదండి. సగం దాకా వచ్చేశాం ఈ రోడ్డులో’బండి పక్కకు ఆపుతూ చెప్పాడు డ్రైవర్.
‘కనుక్కో ఏంటో..?’ పక్కనున్న మ్యాగజైన్‌ని చేతిలోకి తీసుకుంటూ చెప్పాడు మాధవ. కారు దిగి వెళ్లి ట్రాఫిక్ పోలీస్‌తో మాట్లాడి వచ్చిన డ్రైవర్ మాధవతో ‘మొన్న బోర్డర్‌లో చనిపోయిన సైనికుడి బాడీ అంట సర్. ఇవ్వాళ వచ్చిందిట అక్కడి నుండి. ముందున్న పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కి తీసుకెళ్తున్నారుట’ అని చెప్పి ఆగి.. మళ్లీ ‘పాకిస్తాన్ సరిహద్దుల్లో టెర్రరిస్ట్‌లతో జరిగిన పోరాటంలో ఇద్దర్ని చంపి మరొకడిని సజీవంగా పట్టుకుని తెస్తుండగా వాడిని వాడు పేల్చుకోడంలో ఈయన కూడా చనిపోయాడట అని చెప్పుకుంటున్నారు సర్!’ అన్నాడు.
‘ఆ బాడీ అక్కడికి చేరేదాకా మనమేం చేయలేమా! ఇట్లా రోడ్డు మీద వుండిపోవాల్సిందేనా?’ మాధవ మాటలు మనసులో అసహనాన్ని ప్రతిబింబిస్తున్నాయి! ‘కొంచెం ముందుకెళ్లాక డబుల్ రోడ్డు వస్తది. అక్కడ వచ్చే పోయే ట్రాఫిక్‌ను పక్క రోడ్డు నుండి పంపిస్తున్నారట సర్, కానిస్టేబుల్ చెప్పాడు’ అన్నాడు డ్రైవర్. బయటకి చూసిన మాధవ ఆశ్చర్యపోయాడు. నేల ఈనినట్లు వస్తున్నారు జనం ఊరేగింపులో కలవడానికి. ప్లకార్డ్స్‌ను పైకి ఎత్తి పట్టుకొని నినాదాలు చేస్తూ నడుస్తున్నారు వాళ్లు. కొన్ని స్కూల్ బస్సులు కూడా వస్తున్నాయి ఊరేగింపులోకి. ఇప్పుడు బండిని వెనక్కి తిప్పించుకొని కూడా వెళ్ళలేడు! ఇంతలో వాళ్ళ కారు పక్కకి వచ్చి ఆగింది ఒక జీపు. దానికో ఫ్లెక్సీ కట్టి ఉంది.. ‘కెప్టెన్ శంకర్ స్వామి జిందాబాద్’, ‘కెప్టెన్ శంకర్ స్వామి అమర్ రహే’ అనే నినాదాలతో!
అది చదివిన మాధవ ఆలోచనలో పడ్డాడు. ఆ పేరు తనకు పరిచయమైనదే! గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించసాగాడు. ఇంతలో మరొక ఆటో కాస్త ముందుకొచ్చి ఆగింది. దాని వెనుక ఆ అమర సైనికుడి ఫొటో వున్న ఫ్లెక్సీ ఉంది. ఆ ఫొటో చూసిన మాధవకు.. ఆ ఫొటోలోని వ్యక్తిలో తనకు తెలిసిన వాళ్ళ పోలికలు కనపడ్డాయి. ఆ మనిషిని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించసాగాడు. తన స్మార్ట్ ఫోన్‌లో గూగుల్ న్యూస్ చూశాడు. అందులో శంకర్ స్వామి జీవిత విశేషాలు, కొన్ని ఫొటోలు కనిపించాయి. పక్కనే ఆగిన జీపు ముందుకు కదులుతుండగా ‘శంకర్ స్వామి అమర్ రహే’ అంటూ వినిపించిన నినాదాలు.. మాధవ ఆలోచనలను తన ఉన్నత పాఠశాల రోజుల్లోకి తీసుకెళ్లినయ్.
అవి తను పదో తరగతి చదువుతున్న రోజులు. మరునాటి నుంచే ప్రిపరేటరీ సెలవులు. ఆరోజు పిల్లలు.. స్లామ్ బుక్‌లో మిగిలిన పిల్లల సందేశాలు, ఆటోగ్రాఫ్‌లను సేకరిస్తున్నారు. అంతా కోలాహలంగా, ఉత్సాహంగా వుంది తరగతి గదిలో. ఇంతలో పిల్లలతో చనువుగా ఉంటూ పిల్లల్లో కలిసిపోయే సోషల్ మాష్టారు వచ్చారు క్లాసులోకి. వస్తూనే ‘మీ సరదాలను పాడుచేస్తూ.. పాఠం చెప్పను. కానీ మీరంతా నాకొకటి చెప్పాలి ఇవాళ. నేను దాన్ని గుర్తుపెట్టుకొని మరీ మిమ్మల్ని అడిగి తీరతాను జీవితంలో మీరెప్పుడుప్పుడు కలిసినా!’ అన్నాడు.
‘అడగండి సర్, అదేంటో?’ ముక్త కంఠంతో పలికారందరూ! ‘అది అందరూ కలిసి చెప్పాల్సినది కాదు. ఒక్కొక్కరూ చెప్పాల్సినది. ముందుగా రంగాను అడుగుతాను. చెప్పు రంగా.. పెద్దయ్యాక నువ్వేం అవాలనుకుంటున్నావ్?’ అడిగాడు సోషల్ మాష్టారు. ‘పోలీస్ ఆఫీసర్ అవాలనుకుంటున్నాను సార్’ చెప్పాడు రంగా. ‘ఎందుకురా?’ ‘పోలీస్ అంటే అందరికీ భయం కదా సార్.. అందుకని!’ చెప్పేటప్పుడు నవ్వు ఆపుకోలేక పోయాడు రంగా. అతనితోపాటు క్లాస్ అంతా నవ్వేసింది.
‘నువ్వురా శరత్?’ ‘లాయర్ అవుతాను సర్.’ అలా తరగతిలో పిల్లలందరినీ అడుగుతున్న మాష్టారు శంకర్ స్వామినీ అడిగాడు ‘నువు చెప్పరా శంకర్’ అంటూ. ‘గొప్పగా సావాలనుకుంటున్నాను సర్!’ శంకర్ స్వామి సమాధానంతో సోషల్ మాష్టారు ఉలిక్కిపడ్డాడు. క్లాస్ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమయింది. క్లాసులో అప్పటి దాకా ఉన్న సరదా వాతావరణం కాస్త గంభీరంగా మారింది! సోషల్ మాష్టారు తేరుకొని, ‘ఏంట్రా అట్లా అన్నావ్?’ అడిగాడు శంకర్ స్వామిని. ‘అవును సార్ గొప్పగా సావాలి సర్!’ శంకర్ నోట మళ్ళీ అదే మాట! అవాక్కయిన మాష్టారు, ‘నువ్వు ఇక్కడకి రారా’ అంటూ పిలిచాడు శంకర్‌ని తన దగ్గరకి. శంకర్ వచ్చాడు మాష్టారు దగ్గరకి.
‘గొప్పగా చావడం ఏంటిరా? ఎవరు చెప్పారు నీకు ఈ మాట?’ శంకర్ భుజమ్మీద చెయ్యి వేస్తూ అనునయంగా అడిగాడు మాష్టారు. ‘మా యమ్మ సర్! కష్టపడిన వాళ్లందరూ గొప్పవాళ్ళుగా బతకచ్చుట.. కానీ గొప్పగా సావడం గొప్ప విషయం అంట సర్’ కళ్లింత చేసుకుంటూ చెప్పాడు శంకర్. ‘అంటే?’ రెట్టించి అడిగాడు మాష్టారు.‘మన బతుకు మనం బతుకుతా సస్తే గొప్ప కాదంట! మన వాళ్ళ కోసం సస్తే అది గొప్ప సావంట! అందుకోసం నేను ఆర్మీలోకి ఎలతాను సర్’ శంకర్ కంఠం స్థిరంగా పలికింది. ఆ స్వరంలో.. తన తల్లి మాటల పట్ల అతనికున్న విశ్వాసం వినిపించింది.
ఆ రోజు శంకర్ స్వామిలో ఒక కొత్త వ్యక్తి కనపడ్డాడు క్లాస్ మొత్తానికి! అప్పటిదాకా ఏ ప్రత్యేకతా లేని ఒక మామూలు విద్యార్థిలో దాగి వున్న ఆశయం విస్ఫోటం చెందింది! అది అందరినీ అతని వైపు ఆకర్షించింది. అందులో మాధవ కూడా ఒకడు. మాధవ, ఇంకా నలుగురు స్నేహితులూ కలిసి సైకిళ్ల మీద స్కూల్‌కి వెళ్ళేవాళ్ళు. శంకర్.. స్కూల్‌కి నడిచివెళ్లే వాళ్ళల్లో ఒకడు. ఆర్థికపరమైన తారతమ్యం వలన ఒకే తరగతికి చెందిన వాళ్లయినప్పటికీ అలా వేరు వేరు స్నేహితుల గుంపుగా సాగేవారు విద్యార్థులు. శంకర్.. స్కూల్ అయిన తర్వాత తండ్రి నడిపే ఇస్త్రీ దుకాణంలో.. తండ్రికి రెండు మూడు గంటలు సాయపడేవాడు. అందువల్ల బయట స్నేహాలు అతనికి అలవాటు కాలేదు.
టెన్త్ లెక్కల పరీక్ష రోజున జరిగిన సంఘటన కూడా గుర్తుకు వచ్చింది మాధవకు! తనకు ముందువరుసలో తల వంచుకొని పరీక్ష రాస్తున్నాడు శంకర్. ప్రశ్నపత్రం చాలా కష్టంగా వుంది. తనకు తెలిసిన లెక్కలు రెండే వున్నాయి. వాటివల్ల పాస్ మార్కులు కూడా రావు. ఇంతలో శంకర్ రాసిన ఆన్సర్ పేపరు ఒకటి జారివచ్చి మాధవ కాళ్ళ దగ్గర పడింది. శంకర్, మాధవ ఇద్దరూ గమనించుకోలేదు. తర్వాత అటుగా వచ్చిన ఇన్విజిలేటర్ దాన్ని తీసి మాధవకి ఇస్తూ ‘పేపర్లు జాగ్రత్తగా పెట్టుకో’ అని సలహా ఇచ్చాడు!
అది తన పేపర్ కాదని తెలుసుకున్న మాధవ పేపర్ని తరచిచూశాడు. తనకు తెలియని ఇరవై మార్కుల లెక్క ఒకటి చేసి వుంది అందులో. తన అదృష్టాన్ని తానే నమ్మలేకపోయాడు. అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోక దాన్ని పూర్తిగా కాపీ చేసి, ఇన్విజిలేటర్ చూడనప్పుడు శంకర్‌ను పిలిచి ‘కిందపడి వుంది’ అంటూ అతనికిచ్చాడు. శంకర్ పేపర్ నుండి కాపీ చేయండం వల్ల తను టెన్త్‌త క్లాసు లెక్కల పరీక్ష గట్టెక్కేశాడు!
మాధవ.. ఇంటర్, ఇంజనీరింగ్ వేరే ఊర్లో చదివాడు. ఊరు శివార్లలో తండ్రి.. తన చిన్నప్పుడు కొన్న అయిదు ఎకరాల వ్యవసాయ భూమి.. పట్టణ విస్తరణ దాహానికి లోనయ్యింది! దాని విలువకు ముందుగా కాళ్ళు, తర్వాత రెక్కలు వచ్చేసరికి.. తను చదివిన సివిల్ ఇంజనీరింగ్‌ను ఉపయోగించి ఆ భూమిలో విల్లాలు కట్టి తనో పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి అయ్యాడు. పెళ్లి, ఇద్దరు పిల్లలు, బంగళా, ఖరీదైన కారు ఇవన్నీ ఏర్పడిన జీవితం తనది.
శంకర్, ఆర్థిక పరిస్థితులు సహకరించక ఇంటర్మీడియేట్ తర్వాత పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండటంతోనే మిలిటరీలో చేరాడు. ఆర్మీలో వుంటూ టెక్నికల్ కోర్సులు పూర్తిచెయ్యడం, అంకిత భావంతో విధులు నిర్వర్తించడంతో కెప్టెన్ స్థాయికి చేరుకున్నాడు. ఆ విషయం తనకి అయిదేళ్ల క్రితం జరిగిన పూర్వ విద్యార్థుల కలయిక సందర్భంగా తెలిసింది. చాలా ఏళ్ళ తర్వాత కలుసుకున్నారందరూ! శంకర్ దేహ దారుఢ్యం, గంభీరత చూసి ఆశ్చర్యపోని మిత్రులు లేరు. ఆ సందర్భంలో శంకర్ ఎవరితోనో.. ‘పురోహితులకు, దేశహితులకు.. అంటే మా డిఫెన్త్‌స వాళ్ళకి పెళ్లిళ్లు అంత తేలికగా అవవు’ అని అంటుండగా విని అతనికి ఇంకా పెళ్లి కాలేదని తెలిసింది మాధవకి.
గతం నుండి మాధవ ఆలోచనలు వర్తమానంలోకి వచ్చాయి. తాను కట్టేవి ఖరీదైన బట్టలు.. వాటి విలువను డబ్బుతోనే చూస్తారు.. డబ్బున్న ప్రతివారు కొని వేసుకొనగలరవి. శంకర్ స్వామి వేసే యూనిఫాం ఖరీదైనది కాకపోయినా హోదానిచ్చేది! అది వేసుకోవాలి అంటే అర్హత వుండాలి. తన బట్టలు తన శరీరానికి సుఖాన్నిస్తున్నాయి. శంకర్ స్వామి దుస్తులు వ్యక్తికి గౌరవాన్నిస్తున్నాయి. స్వామి దేశం కోసం శ్రమించాడు. తాను తన కోసం, తన కుటుంబం కోసం మాత్రమే శ్రమించాడు.
తనది స్వార్థానికి చోటిచ్చే మామూలు జీవితం. అతనిది గౌరవాన్ని కలిగించే సేవా పూరిత జీవితం. తను సుఖాలను ఎంచుకున్నాడు. స్వామి త్యాగాలను ఆహ్వానించాడు! తనకేమైనా అయితే తన కుటుంబానికి మాత్రమే నష్టం. అతను లేని లోటు దేశానికి నష్టం! తనకు చావు.. వయసైపోయో.. అనారోగ్యంతోనో రావచ్చు. స్వామికి విధి నిర్వహణలో వచ్చింది! తనకు కలిగేది సామాన్యమైన చావే! అతనికి వచ్చినది అసామాన్య మరణం.. అంటే వాళ్ళమ్మ చెప్పిన గొప్ప సావా? అవును.. అదే గొప్ప సావు!! మాధవ ఆలోచనలు అతన్ని అసౌకర్యానికి గురిచేస్తున్నాయి.
ప్రభుత్వ లాంఛనాలతో సాగుతున్న శంకర్ స్వామి పార్థివ దేహాన్ని ఉంచిన వాహనం దగ్గరకి మాధవ కారు వచ్చింది. శంకర్ స్వామి శరీరం మీద జాతీయ జెండా కప్పి వుంది. ఆ వాహనం అంతా పూలతో అలంకరించి వుంది. వ్యాన్ ముందు నడుస్తున్న పోలీస్ బ్యాండ్ వాళ్లు ‘జర యాద్ కరో ఖుర్బానీ’ పాటను వాయిస్తున్నారు. పోలీస్ బ్యాండ్‌కి ముందు కొంత మంది కాలేజ్ యువతి, యువకులు మార్చ్ పాస్ట్ చేస్తున్నట్లుగా నడుస్తున్నారు.. అతని ఫొటో పోస్టర్లను ఎత్తి పట్టుకొని!
ఒకే తరగతి గదిలో చదువుకున్న తామిద్దరూ.. ఒకేచోట పక్కపక్కనే! అతను నిర్జీవంగా.. తాను జీవిస్తూ. అతను దేశం అంతర్గత భూభాగంలోని తనలాంటి ఎంతో మంది రక్షణ కోసం శ్రమిస్తూ మృత్యువును కౌగిలించుకున్నాడు. ఆ స్వామి శంకరుడు గరళాన్ని తీసుకున్నాడు.. ఈ శంకర్ స్వామి బుల్లెట్లు తీసుకున్నాడు తమ మీదకు రాకుండా! దేశ ప్రజలకు రక్షణ కలిగించే ప్రతి సైనికుడు ఒక శంకరుడే! చిన్ననాడే గొప్ప మరణం కోసం ఎంత గొప్పగా ప్రేరితుడు అయ్యాడు శంకర్ స్వామి! అతను కావాలనుకున్న ‘‘గొప్పసావు’’ అతను పొందాడు!!
మాధవ మనసు వ్యక్తం చెయ్యలేని వ్యాకులతతో బరువెక్కింది. అతని కళ్ళు తడి బారినయ్. గద్గద స్వరంతో ‘కారు అపు..’ అన్నాడు డ్రైవర్‌తో. ఆగిన కారులో నుండి దిగి, ‘నువ్వు ఇంటికి వెళ్ళిపో. నేను తర్వాత వస్తాను’ అని చెప్పి.. రోడ్డు మధ్యన వున్న డివైడర్‌ను దాటుకొని వెళ్లి శంకర్ స్వామి పార్థివ శరీరాన్ని మోస్తున్న వాహనం దగ్గరకు వెళ్లాడు. దానికి తగిలించిన శంకర్ ఫొటో ప్లకార్డ్‌ని పట్టుకుని.. ‘శంకర్ స్వామీ అమర్ రహే’ నినాదంతో గొంతు కలిపి.. ఆ సమూహంతో నడుస్తుంటే మాధవ మనసు తేలికపడసాగింది! – రా.శా
Comments
Please login to add a commentAdd a comment