టీ తయారు చేశాక సాధారణంగా టీ పొడిని వడకట్టి బయటపడేస్తారు. అలాగే టీ బ్యాగులను కూడా పడేస్తారు. అందులో మిగిలిన టీ పొడితో అందాన్ని పెంచుకోవడమే కాదు, ఇంటిని మెరిపించుకోవచ్చు. చాలామందికి టీతోనే రోజు ప్రారంభమవుతుంది. చెప్పాలంటే.. దాదాపు ప్రతి ఇంట్లో ఉదయం, సాయంత్రం టీ తాగాల్సిందే. టీ తయారు చేసిన తర్వాత, టీ పొడి మిగిలిపోతుంది. దీనిని తరచూ చెత్తగా భావించి చెత్తబుట్టలో వేస్తాం. ఈ పనికిరాని టీ పొడితో ఇంటి శుభ్రతను నుంచి అందం వరకు పలు రకాలుగా ఉపయోగించొచ్చు. అదెలాగో సవివరంగా చూద్దాం. !
అద్దాలు శుభ్రం చేసేందుకు..
టీ పొడితో ఇంటి అద్దాలను పాలిష్ చేయవచ్చు. దీని కోసం, మిగిలిన టీ ఆకులను నీటిలో మరిగించండి. ఈ నీటిని స్ప్రే బాటిల్ లో నింపి దాని సహాయంతో అద్దాలను శుభ్రం చేస్తే అద్దాలు తళతళ ప్రకాశిస్తాయి. దీనితో పాటు, గ్యాస్ బర్నర్లు ఎంత నల్లగా మారినా, మీరు వాటిని నిమిషాల్లో శుభ్రం చేయవచ్చు. టీ నీటిలో కొద్దిగా డిష్ వాష్ మిక్స్ చేసి బ్రష్ సహాయంతో క్లిన్ చేస్తే గ్యాస్ బర్నర్లను తళతళ మెరిసిపోతాయి..
పాదాల దుర్వాసన
రోజంతా బూట్లు ధరించడం వల్ల పాదాల్లో తరచూ దుర్వాసన వస్తుంటుంది. అలాంటప్పుడు మిగిలిపోయిన టీ పొడిని నీటిలో బాగా మరిగించి చల్లారాక ఆ నీటిలో మీ పాదాలను 10 నుండి 15 నిమిషాలు ఉంచండి. ఇలా రోజూ చేస్తే పాదాల నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.
నేచురల్ షైనింగ్..
మిగిలిపోయిన టీ పొడి జుట్టుకు ఒక వరం. ఇది శిరోజాలకు నేచురల్ షైన్ జోడించడానికి పనిచేస్తుంది. అలాగే జుట్టు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. దీని కోసం, టీ పొడిని శుభ్రమైన నీటిలో మరిగించాలి. మరిగిన తర్వాత నీళ్లు చల్లారనివ్వాలి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత చివరగా ఈ నీటితో తలస్నానం చేయాలి. కొద్ది రోజుల్లోనే జుట్టు సిల్కీగా మెరుస్తూ ఉంటుంది.
మొక్కలకు ఎరువుగా..
ఇంట్లో పెంచుకునే మొక్కలకు సహజ ఎరువుగా టీ పొడి ఉపయోగపడుతుంది. ఇంట్లో చెట్లు, మొక్కలు ఉంటే ఈ టీ పొడివాటి ఎదుగుదల రెట్టింపు అయ్యేలా చూసుకోవచ్చు. మిగిలిపోయిన టీ పొడిని కంపోస్టులా మొక్కల కుండీల్లో వేసేయండి. ఇది మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అయితే పంచదార కలిపిన టీ పొడిని మాత్రం బాగా కడిగి అప్పుడు వినియోగించండి.
(చదవండి: క్రీడా నైపుణ్యం, మాతృత్వం రెండింటిని ప్రదర్శించిన ఆర్చర్ !)
Comments
Please login to add a commentAdd a comment