► జగిత్యాల జిల్లాలో.. ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే, ప్రేమ విషయం పెద్దలకు చెప్పలేక యువతి ఉరివేసుకుంది. ఇది తెలిసి.. దుబాయ్‌లో ఉన్న ప్రియుడు ‘నువ్వు లేక నేను లేను’ అంటూ సెల్ఫీ వీడియో తీసుకుంటూనే బలవన్మరణానికి పాల్పడ్డాడు.
► పెద్దలు పెళ్లికి అంగీకరించరనే కారణంతో ఆ ప్రేమికులిద్దరూ కలిసి బావిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం వడ్లతండాలో చోటుచేసుకున్న ఘటన ఇది.
► నిజామాబాద్ జిల్లాలో.. వారిద్దరివీ వేర్వేరు కులాలు.. ప్రేమతో ఒక్కటవ్వాలనుకున్నారు. కానీ, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఒకరు.. కాదని మరొకరు అభిప్రాయ భేదాలకు గురై.. చివరకు ఇద్దరూ ఉరివేసుకున్నారు.
కేవలం పెద్దలు పెళ్లికి అంగీకరించరనే భయంతోనే గడిచిన మూడు నెలల్లో పదిహేనుకుపైగా ప్రేమజంటలు ఆత్మహత్యలకు పాల్పడ్డాయి. చనిపోవడానికి కూడా ధైర్యం కావాలి.. అదే ధైర్యాన్ని వారు పెద్దల్ని ఒప్పించడానికి లేదా కలిసి బతకడానికి చూపాలని అంటున్నారు ఒకప్పటి ప్రేమికులు. కులమతాలు వేరైనా.. ‘ప్రేమ కోసం ధైర్యంగా నిలబడ్డాం. ఆ ధైర్యంతోనే ఇరుపక్షాల పెద్దల్ని ఒప్పించాం. ఇప్పుడెలాంటి స్పర్థలు లేకుండా ఆనందంగా ఉన్నాం’ అంటున్నాయి ‘ప్రేమ–పెళ్లి’లో సక్సెస్ అయిన జంటలు. నొప్పించకుండా పెద్దలను ఒప్పించగలగాలి.. అందుకోసం ఎన్నాళ్లైనా వేచిచూడగలగాలి.. ఇలాంటివి లోపించే నేటి ప్రేమలు విషాదాంతమవుతున్నాయని చెబుతున్న వీరు.. నాడు తామేం చేశామన్న సంగతిని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ తో పంచుకున్నారు.
చనిపోవడానికైనా ధైర్యం కావాలి.. ఆ ధైర్యంతోనే కలిసి బతకొచ్చు ప్రేమలో సఫలం కావడానికి మేం చేసింది ఇదీ.. ‘ప్రేమికుల దినోత్సవం’ సందర్భంగా నాటి ప్రేమజంటలు చెబుతున్న సక్సెస్ స్టోరీస్
పెద్దల అంగీకారంతో..
జగిత్యాల: ‘ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. పెద్దల్ని ఒప్పించి చేసుకున్నా.. ఒకరినొకరు అర్థం చేసుకోవడమనేది ముఖ్యం’ అంటున్నారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు. 37 ఏళ్ల కిందట వీరు పెద్దల సమక్షంలో ఆషాఢమాసంలో కులాంతర వివాహం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన స్నేహలత తండ్రి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. ఆ సమయంలో సింగరేణిలో పనిచేస్తూ కమ్యూనిస్ట్ పారీ్టలో ఉన్న కొప్పుల ఈశ్వర్ స్నేహలతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె అసలు పేరు కోకిలాదేవి. కమ్యూనిస్ట్ ఉద్యమ సమయంలో చనిపోయిన తన తోటి సహచరి స్నేహలత పేరును ఈశ్వర్ తన సతీమణికి పెట్టుకున్నారు.
ఉద్యమం కలిపింది..
తొర్రూరు: ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు చెందిన సబీహాబాను, మహబాబూబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన మంగళపల్లి శ్రీనివాస్ 25 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆదివాసీలు, గిరిజనుల సమస్యలపై శ్రీనివాస్‌తో కలిసి సబీహాబాను ఉద్యమాలు చేపట్టింది. ఆ ఉద్యమ సాహచర్యం కాస్తా ప్రేమ.. పెళ్లికి దారితీసింది. ఇంటర్ వరకు చదివిన సబీహాబానును హిందీలో పీజీ చదివించి ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సాధించేలా శ్రీనివాస్ సహకరించాడు. ప్రస్తుతం ఆమె చెర్లపాలెం ప్రభుత్వ పాఠశాలలో హిందీ టీచర్‌గా పనిచేస్తున్నారు. శ్రీనివాస్ ప్రత్యక్ష రాజకీయాల్లో చేరి తొర్రూరు జెడ్పీటీసీగా గెలుపొందారు. వీరికి ఇంజనీరింగ్ చదివే వాసే, 9వ తరగతి చదివే అమన్ సంతానం. ‘ప్రేమించడం తప్పుకాదు. నేడు దాన్ని సాధించేందుకు ఎంచుకునే మార్గాలే అభ్యంతరకరంగా ఉంటున్నా’యనేది వీరిమాట.
ఒప్పించే చేసుకున్నాం
మంచిర్యాలటౌన్: ‘మాది ప్రేమ వివాహమే. అయితే పెద్దల్ని ఒప్పించి చేసుకున్నాం’ అంటున్నారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి. ‘మాది కర్ణాటకలోని బెల్గాం జిల్లా గోకాక్ గ్రామం. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో హైదరాబాద్ ఆర్‌సీ రెడ్డి ఐఏఎస్ స్టడీసర్కిల్‌లో 2002లో చేరాను. అప్పుడే ఏపీలోని కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన సీవీ శంకర్‌రెడ్డి పరిచయమయ్యారు. మా ఇద్దరి భాషలు, రాష్ట్రాలు వేరు. అయినా ప్రేమ చిగురించింది. అయితే అది చదువుకు, లక్ష్యానికి అడ్డురాకూడదని నిర్ణయించుకున్నాం.
2002–03లో కోచింగ్ పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లాం. ప్రేమ గురించి ఇంట్లో వాళ్లకు చెప్పాం. అలా పెద్దలను ఒప్పించి 2007లో పెళ్లి చేసుకున్నాం. 2009లో ఐపీఎస్‌కు, 2010లో ఐఏఎస్‌కు ఎంపికయ్యా. ఆయనకు తెలంగాణ టూరిజంలో ఉద్యోగం వచి్చంది. ప్రస్తుతం ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరక్టర్. ఇప్పుడు మాకో పాప. పేరు ఆధ్య. మా అత్తగారు నన్ను కోడలిగా కాకుండా కూతురుగా చూసుకుంటుంది. అలాంటి మంచి కుటుంబాన్ని నా భర్త అందించారు.
ఒప్పించడానికి నాలుగేళ్లు..
కోదాడ: ‘ప్రేమించినంత తేలిక్కాదు తల్లిదండ్రులను ఒప్పించడం. అందుకు ఓపికుండాలి.. నమ్మివచ్చిన భాగస్వామికి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. మేం ప్రేమ వివాహం చేసుకున్నాక తల్లిదండ్రులను ఒప్పించడానికి నాలుగేళ్లు పట్టింది. అందరం కలిసిపోయాం. పిల్లలతో ఆనందంగా ఉన్నా’మని చెబుతున్నారు కోదాడకు చెందిన కందుల మధు– విజయలక్ష్మి దంపతులు.
ఉస్మానియా యూనివర్సిటీలో 2010లో ఎంబీఏ చదివే రోజుల్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. సామాజికవర్గాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు. నాలుగేళ్ల తరువాత వీరి అన్యోన్య దాంపత్యాన్ని చూసిన ఇరుపక్షాల పెద్దలు ఇప్పుడు దగ్గరయ్యారు.
నలభై ఐదేళ్ల క్రితం..
డోర్నకల్: ‘నలభై ఐదేళ్ల క్రితం.. ఇప్పటితో పోలిస్తే ఆ కాలంలో కట్టుబాట్లు ఎక్కువ. పెద్దలు కొందరు సరేనన్నారు. మరికొందరు కాదన్నారు. అయినా ధైర్యంగా పెళ్లి చేసుకుని నిలబడ్డాం’ అంటున్నారు డోర్నకల్ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన దేవకృపామణి, ఉప్పరి నారాయణ. వీరి కులమతాలు వేర్వేరు. పక్కపక్కిళ్లలో ఉండటం, ఒకే పాఠశాల, కళాశాలలో చదువుతున్న క్రమంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటామంటే ఇరుపక్షాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
పెళ్లి చేసుకుని ఒక్కటవ్వడమే కాక.. అందరినీ మెప్పించాలని ధైర్యంచేసి 1976, నవంబర్ 19న పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇరు కుటుంబాలు కలసిపోయాయి. పిల్లల్లేకున్నా ఒకరికొకరుగా జీవితం సాగిస్తున్నారు నారాయణ, కృపామణి దంపతులు. ‘ప్రస్తుతం ప్రేమ పేరుతో జరుగుతున్న హింస, పెళ్లి చేసుకోలేమనే భయంతో ప్రాణాలు తీసుకోవడం వంటి సంఘటనలు వింటుంటే బాధ కలుగుతుంది. ధైర్యంగా ముందడుగు వేస్తే అన్నీ సర్దుకుంటాయి’ అంటున్నారు వీరు.
నాలుగేళ్లకు ఒప్పించాం..
మహబూబాబాద్: తమ ప్రేమ.. పెళ్లి వైపు నడిపించిన రోజుల్ని గుర్తుచేసుకున్నారు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్. ‘32 ఏళ్ల క్రితం నేను వరంగల్ ఆర్‌ఈసీ (ప్రస్తుతం నిట్)లో చదువుకుంటున్న సమయంలో ఒక ఫెస్ట్‌లో మెడిసిన్ చదువుతున్న సీతామహాలక్ష్మి (గుంటూరు జిల్లా తెనాలి) పరిచయమైంది. అదికాస్తా ప్రేమగా మారింది. ఇద్దరి సామాజిక వర్గాలు వేర్వేరు. ఆమె ఇంట్లో విషయం తెలియడంతో.. మా ఇద్దరి మధ్య మాటలు బందయ్యాయి. అప్పట్లో ఇప్పటి మాదిరి సమాచార వ్యవస్థ లేదు. మా ప్రేమను కమ్యూనికేట్ చేసుకోవడానికి ఇబ్బంది పడేవాళ్లం.
ఇద్దరం ప్రభుత్వోద్యోగాలు సాధించి పెద్దల్ని ఒప్పిద్దామనుకుంటే అప్పుడూ నిరాకరణే ఎదురైంది. వాళ్ల అంగీకారం కోసం నాలుగేళ్లు వేచిచూశాం. అయితే, మా ప్రేమలోని నిజాయితీని తరువాత పెద్దలు గుర్తించారు. చివరకు 1994లో వారే దగ్గరుండి పెళ్లి చేశారు. నేను ఆర్‌అండ్‌బీ డీఈగా ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సీతామహాలక్ష్మి ఎంతో సహకరించింది. ఆమె డాక్టర్. సూర్యచంద్ర, తేజస్వి.. మాపిల్లలు. ప్రేమకు కులమతాలు అడ్డుకాదు. కాకపోతే, జీవితంలో స్థిరపడి, పరస్పరం నమ్మకం, భరోసా ఏర్పడ్డాకే పెళ్లి చేసుకోవాలి. తొందరపడి ప్రేమలోకి దిగి.. పెద్దల భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రేమికులను చూస్తే బాధ కలుగుతుంది’.
ఒప్పించి.. మెప్పించాం
కోల్‌సిటీ (రామగుండం): ‘మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటే కనుక పెద్దలను ఒప్పించాలి’ అంటున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన డాక్టర్లు మహేందర్‌కుమార్, లావణ్య. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన మహేందర్‌కుమార్‌కు, గోదావరిఖని లక్ష్మీనగర్‌కు చెందిన లావణ్యకు సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజీలో 2006లో సీటొచి్చంది. చదువులో చురుగ్గా ఉండే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే కులాలు వేర్వేరు. మహేందర్ దాపరికం లేకుండా ఇంట్లో విషయం చెప్పి ఒప్పించాడు. లావణ్యా అలాగే చేసింది.
చదువుకు తమ ప్రేమ అడ్డుకాకుండా.. ఇద్దరూ డాక్టర్లయ్యాక 2012 నవంబర్ 29న పెద్దల సమక్షంలో ప్రేమపెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులు నేటి ప్రేమల గురించి మాట్లాడుతూ– ‘ప్రేమలో పరిపక్వత ఉండాలి. పేరెంట్స్‌ను ఒప్పించి పెళ్లి చేసుకోగలమనే నమ్మకం ఉండాలి. మా కాలేజీలో దాదాపు 50 ప్రేమజంటల్ని చూశాం. కేవలం ఆరుజంటలే పెళ్లి చేసుకున్నాయి’ అని చెప్పారీ దంపతులు. మహేందర్ ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ పీహెచ్‌సీలో మెడికల్ ఆఫీసర్, డీడీవోగా, డాక్టర్ లావణ్య జగిత్యాల జిల్లా మల్యాల పీహెచ్‌సీలో మెడికల్ ఆఫీసర్, డీడీవోగా పని చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment