గోదావరి జిల్లా వాసులంటే తిండితో చంపేస్తారురా బాబు అంటుంటారు. గోదావరి తీరాన వంటకాలకు ప్రసిద్ధి చెందిన పల్లెలు చాలానే ఉంటాయి. కండ్రిగ పాలకోవా, నగరం గరాజీలు, ఆత్రేయపురం పూతరేకులు, అంబాజీపేట ΄పొట్టిక్కలు... ఉసులుమర్రు పచ్చళ్లు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వశిష్ట గోదావరి గట్టుకు ఆనుకుని తణుకుకు అరగంట ప్రయాణ దూరంలో ఉండే ఆ గ్రామం ఎప్పుడూ సముద్రంలో ఉప్పునూ చెట్టు మీద కాయను కలిపి పచ్చళ్లు పెట్టడంలో నిమగ్నమై ఉంటుంది.
వ్యక్తిగతంగా కావచ్చు, యజమాని కింద కావచ్చు ఆ గ్రామంలోని స్త్రీలలో ముప్పై, నలభై శాతం పచ్చళ్లు పెట్టడంలో ఉపా ధి ΄పొందుతూ ఉంటారు. వీరితో పా టు ఇరవై శాతం మగవారు ఈ పనిలో ఉంటారు. ఇక్కడి స్త్రీల చేతికి రుచి ఎక్కువ. అందుకే ఉసులుమర్రు పచ్చళ్లకు గిరాకీ ఎక్కువ.
40 సంవత్సరాల క్రితం నుంచి
ఉసులుమర్రి జనాభా 2500 మాత్రమే. వీరిలో ఐదు వందల మంది స్త్రీలకు పైగా, మూడు వందల మంది పురుషులకు పైగా అందరూ కలిసి దాదాపు 1000 మంది వరకు సీజన్‌లో పచ్చళ్లు పెట్టడంలో బిజీగా ఉంటారని అంచనా. ఏప్రిల్ నుంచి జూన్ వరకు చిన్న, పెద్ద, ముసలి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు క్షణం తీరిక లేకుండా రేయింబవళ్లు అనేక రకాల పచ్చళ్లు పెడుతుంటారు. ఊరు ఊరంతా ఏ కంపెనీ కోసం, ఏ యజమాని కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపా ధిని కల్పించుకున్నారు.
40 సంవత్సరాల క్రితం పిళ్లా పెదకాపు కుటుంబం వారు మొదటిసారిగా పచ్చళ్లను తయారు చేయడం మొదలుపెట్టారు. మంచి లాభాలు, మిగులు ఉండడంతో వారిని చూసి వారి బంధువులు మొదలుపెట్టారు. అలా ఒకరిని చూసి మరొకరు అదే పనిని నేర్చుకుని స్వంతంగా తయారు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. 200 కుటుంబాలకు పైగానే ఈ చిరు వ్యాపా రాన్ని చేస్తున్నారు. ఇప్పుడు తయారీలో మూడోతరం నిమగ్నమైంది.
ఇవీ ప్రత్యేకం
టమాటా, ఉసిరి, అల్లం, మాగాయి, ఆవకాయ, గోంగూర, కాలీఫ్లవర్, పండుమిరప, నిమ్మ తదితర పచ్చళ్ళకు ఉసులుమర్రు ప్రత్యేకం. పచ్చళ్ల తయారీలో మహిళలకు కనీసం 300 రోజు కూలీ దక్కుతోంది. అన్ని రకాల పచ్చళ్ళు పెట్టాలంటే రూ.5 లక్షలు పెట్టుబడి అవుతుంది. ఖర్చులు పొ గా మిగిలే లాభంతో తమకెంతో సంతోషంగా ఉంటుందంటున్నారు. ఈ ఒక్క పల్లెలో అన్ని రకాల పచ్చళ్లూ కలిసి ఏడాదికి 500 టన్నులు పచ్చళ్లు పడుతుంటారని అంచనా. టన్ను పచ్చడి రూ.2.50 లక్షలు వంతున విక్రయిస్తుంటారు.
ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే రూ.10 నుంచి రూ.12 కోట్లు. మహిళలు ఇళ్లవద్ద పచ్చళ్లు పెడితే పురుషులు మాత్రం ఏడెనిమిది నెలలపా టు ఊళ్లు తిరుగుతూ చివరిడబ్బా అమ్మేశాక మాత్రమే ఇంటికి తిరిగొస్తారు. కుటుంబాన్ని వదిలి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, వరంగల్, నల్గొండ, బోధన్, హైదరాబాద్, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, ఖమ్మం, మిరియాలగూడ, అశ్వారావుపేట తదితర ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు.
ఏడాది ΄పొడవునా నిల్వ
ఉసులుమర్రు ఆవకాయ అంటే ఏడాది ΄పొ డవునా నిల్వకు తిరుగుండదంటారు. ముదురు మామిడికాయలను ముక్కలుగా కోసి ఆరబెట్టి ఆవపిండి, మెంతులు, ఎర్రపచ్చడి కారం, వేరుశెనగ లేదా నువ్వుల నూనె కలిపి మూడు రోజుల తరువాత జాడీలో పెడతారు. ఉప్పు, కారం, ఆవపిండి కలిపిన ముక్కలను డ్రమ్ములో వేసుకుని ఎక్కడ అవసరమైతే అక్కడే వారి కళ్లెదుటే అన్నీ కలిపి ఇవ్వడంతో నమ్మకం రెట్టింపు అయ్యిందంటారు.
వేసవిలో పండుమిరప, ఉసిరి, ఆవకాయ, గోంగూర, కాకరకాయ పెడతారు. వానాకాలం బ్రేక్ ఇచ్చి మళ్లీ ఆగస్టు నుంచి అల్లం, వెల్లుల్లి, టొమాటో, కాలీఫ్లవర్, కొత్తిమీరలాంటివి పెడతారు. మిక్స్‌డ్ వెజిటబుల్ అడిగితే పెట్టి ఇస్తారు. నిమ్మకు నిల్వ తక్కువ కాబట్టి తక్కువగా పెడతారు. చికెన్, రొయ్యలతో నాన్‌వెజ్ పచ్చళ్లు కూడా చేసి ఇస్తారు. సరుకును బట్టి లాభం. ఉదాహరణకు డ్రమ్ (200 కిలోలు) పండు మిరప పచ్చడి పట్టడానికి 20 వేలు అవుతుంటే మార్కెట్‌లో కిలో రూ.250కు అమ్ముతుంటారు.
– లక్కింశెట్టి శ్రీనివాసరావు
సాక్షి, కాకినాడ ,ఫొటోలు: పంతం వెంకటేశ్వర్లు, పెరవలి
అందరూ ఆవకాయ పెట్టుకోరు. బయటి నుంచి తెచ్చుకునేవారు. ఎప్పుడూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఆ ఊరి స్త్రీలు ఆవకాయ పెడతారు. మే నుంచి జూన్ వరకూ ఉమ్మడి తూ.గో.జిల్లాలోని ఉసులుమర్రు స్త్రీలు ఆవకాయతో పా టు రకరకాల పచ్చళ్లు పెడుతుంటారు. వాటిని తీసుకుని మగవారు జిల్లాలకు బయలుదేరి నెలల తరబడి అమ్ముతారు. రోజూ ఏదో ఒక పచ్చడి తయారు చేసే ఆ ఊరి స్త్రీలు శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతినిధులు.
Comments
Please login to add a commentAdd a comment