ప్రతీకాత్మక చిత్రం
‘ఏదైనా ఒక విషయం లేదా ఒక ఆలోచన నిన్ను భౌతికం గా కానీ, మేధోపరంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ బలహీన పరుస్తుంటే తక్షణమే దానిని విషంగా భావించి దూరం పెట్టాలి’ అన్నారు స్వామి వివేకానంద. అలాగే ‘రోజుకు కనీసం ఒక్కసారైనా నీతో నీవు మాట్లాడుకో. అలా చేయని పక్షంలో ప్రపంచంలోని ఒక అద్భుతమైన వ్యక్తితో మమేకమయ్యే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నట్లే’ అని కూడా చెప్పారాయన.
మరింత స్పష్టంగా... ‘నీ మీద నీకు విశ్వాసం లేనంత వరకు నువ్వు భగవంతుడిని కూడా విశ్వసించలేవ’ని కూడా చెప్పారు. ఇవన్నీ ఒత్తిడులను జయించమని, నీకు హాని కలిగించే ఆలోచనను విసర్జించగలిగిన పరిణతిని సాధించమని, జీవితాన్ని ఆనందమయం చేసుకోమని చెప్పడమే. కేరళలోని కొన్ని మారుమూల జిల్లాల్లో పిల్లలు పోషకాహార లోపంతో ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇలాంటి పరిస్థితులను అరికట్టడానికి ప్రభుత్వం కమ్యూనిటీ కిచెన్‌లు ఏర్పాటు చేసి భోజనం పెడుతోంది. కనీసం ఒక పూట అయినా కడుపు నిండా భోజనానికి భరోసా ఉంటే ప్రాణాలను కాపాడవచ్చనుకున్నారు పాలకులు. ఇది ఇలా ఉంటే... ప్రజలు కమ్యూనిటీ కిచెన్‌లో భోజనం చేస్తూ తాము పని చేసి సంపాదించుకున్న కొద్దిపాటి డబ్బును మద్యం కోసం ఖర్చు చేస్తున్నారు. రెండోపూట పస్తులుంటున్నారు.
ఈ ఉదంతంతో ఏం తెలుస్తోంది? కష్టాలను కొనితెచ్చుకోవడం అనేది మనిషి స్వయంగా తనకు తానుగా చేసుకుంటున్నట్లు అనిపించడం లేదా? ఇందుకు వారి బలహీనమైన మానసిక స్థితి కూడా కారణం కావచ్చు. మనసు మీద ఆధిపత్యం సాధించగలిగితే జీవితం మన చేతుల్లోనే ఉంటుంది. సంతోషంగా జీవించవచ్చా, విజయగర్వంతో జీవించవచ్చా అనేది తమకు తాముగానే నిర్ణయించుకోగలుగుతారు. తనతో తాను మాట్లాడుకోగలిగితే ఆ రోజు ఏమేం చేశాననే పునశ్చరణతో పరివర్తనకు బీజం పడుతుంది.
‘దేవుడా! నాకు అదివ్వు ఇదివ్వు’ అని అడగడానికి ముందు తమ మీద తాము విశ్వాసం ఉంచుకోవడం కూడా అవసరమేనన్నారు వివేకానంద. కొత్త సంవత్సరం తీర్మానాల్లో ‘ప్రతిరోజూ ఒకసారి మనతో మనం మాట్లాడుకుందాం. మనకు హాని కలిగించే విషయాన్ని రెండవ ఆలోచన లేకుండా దూరం పెడదాం, అది బయటి వస్తువు కావచ్చు లేదా మన మెదడులోనే ఉండవచ్చు. ఆ విషం మనలో ఉన్నదే అయినా సరే తక్షణం వదిలేద్దాం. అలాగే మన మీద మనం విశ్వాసాన్ని పెంచుకుందాం’. ఏడాదంతా క్షేమంగా జీవిద్దాం.
చదవండి: Health Tips: రోజూ ఉసిరికాయ తింటున్నారా... ఇందులో ఉండే క్రోమియం వల్ల
Comments
Please login to add a commentAdd a comment