బస్సులో అతి చేస్తే... పోకిరీలు ఆ బస్సులో ఉండరు. జైలులో ఊచలు కౌంట్ చేస్తూ కూర్చుంటారు. ఆ బటన్ నొక్కితే చాలు... భద్రత ఇచ్చే బటన్ కోల్‌కతాలోని ఒక ప్రాంతం. బస్సులో కూర్చున్న కాలేజీ అమ్మాయిలు బ్యాగ్‌లో నుంచి టెక్ట్స్‌బుక్స్ తీసి చదువుకుంటున్నారు.
పరీక్షకేంద్రం చేరడానికి చాలా సమయం ఉంది కాబట్టి ఆ సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే ఒక స్టాప్‌లో బస్సులోకి పోకిరీ బృందం ఎక్కింది. అల్లరి మొదలు పెట్టారు. పెద్దగా కేకలు.
వారి దృష్టి కాలేజీ అమ్మాయిలపై పడింది. రకరకాల కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. న్యూస్‌పేపర్‌ను చించి ఉండలుగా చేసి అమ్మాయిలపై విసురుతూ రాక్షసానందాన్ని పొందుతున్నారు. పరీక్షకు వెళ్లే టైమ్‌లో గొడవ ఎందుకు...అనుకున్నారేమో ఆ అమ్మాయిలు మాత్రం పుస్తకాల నుంచి తలెత్తడం లేదు. అయితే పోకిరీల ఆగడాలు మితిమీరి పోయాయి.
ఒక అమ్మాయి లేచి వారితో గొడవ పడింది. అయితే వారిలో తప్పు చేస్తున్నామనే భావన ఏ కోశానా కనిపించలేదు. ఆ అమ్మాయినే తిట్టడం మొదలుపెట్టారు. బస్సులో కూర్చున్న ప్రయాణికులు తలోమాట అనడంతో పోకిరీలు తగ్గారు. ఏదో స్టాప్ రాగానే దిగి పారిపోయారు.
పరీక్షకేంద్రంలో పరీక్ష రాస్తున్నారన్న మాటేగానీ ఆ అమ్మాయిలకు మాత్రం బస్సులో పోకిరీల ఆగడాలే పదేపదే గుర్తుకువస్తున్నాయి. తెలిసిన సమాధానాలు కూడా సరిగ్గా రాయలేకపోయారు. ‘వారిని విడిచి పెట్టకుండా ఉండాల్సింది. పోలీసులకు పట్టించాల్సింది’ అనే మాటలు వారి మనసులో పదేపదే ప్రతిధ్వనిస్తున్నాయి.
ఇక ముందు వారికి బాధాకరమైన ప్రయాణ అనుభవాలు ఎదురు కాకపోవచ్చు. ఒకవేళ ఎదురైనా...పోకిరీలు తప్పించుకునే ఛాన్స్ ఉండకపోవచ్చు.
ఎందుకంటే...
పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిర్భయ ప్రాజెక్ట్‌లో భాగంగా మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవెట్ బస్సులలో సీసీ కెమెరాలతో పాటు ప్యానిక్ బటన్స్ ఏర్పాటు చేయనుంది. బస్సులో ప్రతి సీటుకు ఈ బటన్‌ను బిగిస్తారు.
అత్యవసర సమయం, ఇబ్బందికరమైన పరిస్థితులలో సీటుకు ఉండే ప్యానిక్ బటన్‌ను నొక్కితే పోలీస్ కంట్రోల్‌రూమ్, ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ కంట్రోల్‌రూమ్‌లను అలర్ట్ చేస్తుంది. వీడియో ఫుటేజిని అందిస్తుంది.
ఫలితంగా...
దగ్గరలోని పోలీస్‌స్టేషన్ లేదా పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్‌లు ఎలార్ట్ అవుతాయి. పోకిరీల పనిపడతాయి. ప్యానిక్ బటన్‌ను ఎలాంటి పరిస్థితులలో ఉపయోగించాలి? దాని సాంకేతిక ప్రాముఖ్యత, దుర్వినియోగం చేయకూడదు... వంటి విషయాలపై నిరంతర అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.
‘బస్సులలో ప్యానిక్ బటన్ వార్త చదివి సంతోషంగా అనిపించింది. నేను చాలా సార్లు బస్సులలో రకరకాల చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను. బస్సులో ప్యానిక్ బటన్‌లు ఉన్నాయనే భయంతో అమ్మాయిలను వేధించడానికి ఎవరూ సాహసం చేయరు’ అంటుంది సుష్మ అనే కాలేజి స్టూడెంట్.
Comments
Please login to add a commentAdd a comment