
కొందరికి మల విసర్జన ద్వారం వద్ద సన్నటి పగులు ఏర్పడుతుంది. ఈ పగులునే ‘యానల్ ఫిషర్ లేదా ఫిషర్ ఇన్ ఏనో’ అంటారు. ప్రతి 350 మందిలో ఒకరికి వచ్చే ఈ వ్యాధిసాధారణంగా 15 నుంచి 40 ఏళ్ల స్త్రీ, పురుషుల్లో కనిపిస్తుంది. ఇది చెప్పలేనంత నొప్పితో తీవ్రంగా బాధిస్తుంది. తమ బాధను ఎవరితోనైనా చెప్పుకోడానికీ, ఆ పగులును ఎవరికైనా చూపించడానికీ, బిడియం అడ్డువస్తుంది. తొలిదశలో చికిత్స తీసుకోకపోతే మరింత లోపలికి చీరుకు΄ోయి వేధిస్తూ ఉండే ‘యానల్ ఫిషర్’ గురించి తెలుసుకుందాం...
నిజానికి మలద్వారమిలా చీరుకుపోయి ఫిషర్ ఏర్పడటానికి కారణాలేమిటన్నది ఇంకా పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే మలవిసర్జన సమయంలో ఈ చీలిక మరింతగా ఒరుసుకు΄ోయేలా మలం బయటికి వస్తుండటం వల్ల తీవ్రమైన నొప్పి కలగడం వల్ల దీని ఉనికి తెలుస్తుంది. తాము తీసుకునే ఆహారంలో ముదురాకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు, తాజాపండ్ల వంటి పీచు (ఫైబర్)ను పుష్కలంగా కలిగి ఉంటే ఆహార పదార్థాలు తక్కువగా తీసుకుంటూ ఉండటం వల్ల కూడా ఫిషర్ ఏర్పడుతుందని అనేక అధ్యయనాల్లో నిర్ధారణ అయ్యింది.
మలద్వారం వద్ద ఉండే కండరాలు కొన్ని సందర్భాల్లో మందంగా, గట్టిగా మారడం వల్ల మలవిసర్జన సాఫీగా జరగదు. ఈ క్రమంలో మలం మందంగా, గట్టిగా మారిన కండరాలను బలంగా ఒరుసుకుంటూ బయటకు వస్తుంది. అలా ఒత్తిడితో బలంగా బయటకు వచ్చే క్రమంలో మొదట చిన్న చిరుగు, ఆ తర్వాత చీలిక ఏర్పడటం, ఆ తర్వాత అది మరింత విస్తరించడం వల్ల యానల్ ఫిషర్ రావచ్చు.
మలబద్దకం కారణంగా కొందరు ముక్కుతూ ముక్కుతూ మల విసర్జన చేస్తుంటారు. మలబద్ధకం కారణంగా మలాశయం దగ్గర మలం చాలా గట్టిగా (ఫీకోలిథ్‌గా) మారడం వల్ల ఇలా ముక్కాల్సి వస్తుంటుంది. ఇలా మలం గట్టిగా రాయిలా మారడం వల్ల కూడా మల విసర్జన సమయంలో ఆప్రాంతం చీరుకుపోవచ్చు. మరికొందరిలో దీర్ఘకాలం పాటు నీళ్లవిరేచనాలు అవుతుండటం వల్ల... చాలాకాలం పాటు ఆ ప్రాంతం తడిగానూ, తేమగానూ ఉండటంతో ఆ ప్రాంతానికి రక్తసరఫరా తగ్గడం వల్ల కూడా ఫిషర్ ఏర్పడవచ్చు.
మల విసర్జన జరిగిన తర్వాత... ఇక అక్కడి నుంచి మలం మళ్లీ లీక్ కాకుండా ఉండేందుకు మలద్వారాన్ని చాలా గట్టిగా మూసుకు΄ోయేలా చేసే స్ఫింక్టర్ కండరాలు మలద్వారం చుట్టూతా ఉంటాయి. ఈ స్ఫింక్టర్ కండరాల వల్లనే... మల విసర్జన తర్వాత మళ్లీ ఇంకోసారి మల విసర్జనకు వెళ్లే వరకు ఎలాంటి మలమూ లీక్ కాదు. అయితే ఏదైనా కారణం వల్ల కొందరిలో మలద్వార ప్రాంతంలో శస్త్రచికిత్స జరిగిన తర్వాత స్ఫింక్టర్‌కు గాయం కావచ్చు లేదా మలద్వారం ఉండాల్సిన రీతిలో కాకుండా సన్నబడిపోవచ్చు. ఇలా సన్నబడి పోవడాన్ని స్టెనోసిస్ అంటారు. ఇలా జరిగినప్పుడు ఆ సన్నబడ్డ ద్వారం నుంచి మలం బయటకు రావాలంటే చాలా బలంగా ఒత్తిడి కలిగించాల్సి వస్తుంది. ఈ కారణంగా మలద్వారం చీరుకుపోయి ఫిషర్‌కు దారితీసే ప్రమాదం ఉంది.
కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక టీబీ, ల్యూకేమియా, క్యాన్సర్లు, ఎయిడ్స్ వంటి జబ్బుల కారణంగా దీర్ఘకాలంలో మలవిసర్జన ప్రాంతంలో ఇన్‌ఫ్లమేషన్ ఏర్పడటం, అది క్రమంగా ఫిషర్‌కు దారితీయడం కూడా జరగవచ్చు.
సెక్స్ ద్వారా సంక్రమించే వ్యాధులు (ఎస్‌టీడీలు) సోకినప్పుడు అవి క్రమంగా ముదిరి కొంతకాలం తర్వాత ఫిషర్‌కు దారితీయవచ్చు. ఉదాహరణకు సిఫిలిస్, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్, క్లమీడియా వంటి వ్యాధులు మలవిసర్జన ద్వారానికీ విస్తరించడం వల్ల అక్కడ పగుళ్లు రావడం, చీరుకుపోవడంతో ఫిషర్ ఏర్పడవచ్చు.
గర్భవతులైన మహిళల్లో ప్రసవం సమయంలో మలద్వారం చీరుకుపోయి ఫిషర్ రావచ్చు.
కొందరిలో క్రోన్స్ డిసీజ్, మాటిమాటికీ మలవిసర్జనకు వెళ్లాల్సి వచ్చే అల్సరేటివ్ కొలైటిస్, మలవిసర్జన తర్వాత మలద్వార ప్రాంతాన్ని శుభ్రంగానూ, పొడిగానూ ఉంచుకోకపోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత విధానాలు పాటించకపోవడంతో (పూర్ టాయిలెటింగ్ హ్యాబిట్స్) కూడా ఫిషర్ ఏర్పడవచ్చు.
లక్షణాలు
మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇలా వచ్చిన నొప్పి మల విసర్జన తర్వాత కూడా కొద్ది గంటల సేపు బాధిస్తూనే ఉంటుంది. ఈ నొప్పి మలవిసర్జనకు వెళ్లిన ప్రతిసారీ తిరగబెడుతుంటుంది. దీంతో మలవిసర్జనకు వెళ్లాలంటేనే బాధితులు తీవ్రమైన ఆందోళనకు గురై, మలవిసర్జనకు వెళ్లడానికి విముఖత చూపుతారు. దాంతో మలబద్దకం ఏర్పడి, మలవిసర్జన క్రమం (సైకిల్) దెబ్బతినవచ్చు. పైగా మలవిసర్జనకు వెళ్లడానికి విముఖత చూపుతూ... మాటిమాటికీ ఆపుకోవడం వల్ల మలం మరింత గట్టిగా మారి, మలవిసర్జన ప్రక్రియ మరింత బాధాకరంగా మారుతుంది.
చాలా మంది బాధితుల్లో మల విసర్జన జరిగినప్పుడు రక్తస్రావం కావడం లేదా ప్రక్షాళన సమయంలో చేతికి లేదా టాయిలెట్ పేపర్‌కు రక్తం అంటుకుంటుంది. అయితే ఫిషర్ విషయంలో చాలా ఎక్కువ రక్తస్రావం జరగదు. కాస్తంత రక్తం మాత్రమే కనిపించి, మలద్వార ప్రాంతంలో దురదగా (ప్రూరిటస్ యానీ) అనిపించవచ్చు. ఇక మరికొందరిలో మలద్వారం వద్ద దుర్వాసనతో కూడా స్రావాలూ కనిపించవచ్చు.కొంతమందిలో మూత్రవిసర్జన కూడా నొప్పిగా ఉంటుంది. కొందరిలోనైతే ఒక్కోసారి అసలు మూత్రవిసర్జన జరగడమే కష్టంగా అనిపించవచ్చు.
యానల్ ఫిషర్ అంటే...
మలద్వారం వద్ద చిన్న పగులులా కనిపించే యానల్ ఫిషర్...తన తొలి దశలో మలద్వారం అంచున చిన్న చిరుగులా కనిపిస్తుంది. అంటే తొలిదశలో ఇది కేవలం చర్మం తాలూకు పై పొరకు (ఎపిథీలియమ్‌కు) మాత్రమే పరిమితమై ఉంటుంది. ఆ దశలో ఎలాంటి చికిత్సా తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే క్రమంగా అది అక్కడి మృదువైన లోపలి పొరల్లోకి (మ్యూకస్ మెంబ్రేన్‌లలోకి) పగుళ్లు ఏర్పడేలా చీరుకు΄ోయే ప్రమాదం ఉంది. ఫిషర్‌లలో రకాలు... ఫిషర్ ఏర్పడిన వ్యవధిని బట్టి దీన్ని రెండు రకాలుగా చెప్పవచ్చు.
మొదటిది అప్పటికప్పుడు కనిపించే అక్యూట్ ఫిషర్.
రెండోది దీర్ఘకాలం పాటు కొనసాగుతూ బాధించే క్రానిక్ ఫిషర్.
ఆక్యూట్ ఫిషర్
ఇందులో తొలుత మలద్వారం బయటి చర్మం చీరుకు΄ోయినట్లుగా అవుతుంది. ఆ తర్వాత అక్కడి మెత్తటి కణజాలం పొరల (మ్యూకోజా)లో కూడా పగుళ్లు ఏర్పడినట్లు అవుతుంది. ఒకవేళ ఈ ఫిషర్‌కు తగిన చికిత్స తీసుకోకుండా అలాగే వదిలేసి, అలా చాలాకాలం పాటు ఉంటే అదే దీర్ఘకాలం కొనసాగే ఫిషర్ (క్రానిక్ ఫిషర్)గా రూ పొందవచ్చు.
క్రానిక్ ఫిషర్
ఇది దీర్ఘకాలం పాటు కొనసాగే ఫిషర్. ఇలా చాలాకాలంపాటు కొనసాగే క్రానిక్ ఫిషర్‌లో కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు కనిపిస్తుంటాయి.ఉదాహరణకు మలద్వారాన్నిగట్టిగా, బలంగా మూసుకుపోయేలా చేసే స్ఫింక్టర్ కండరాలు చీరుకుపోయినట్లుగా కనిపిస్తుంటాయి. ఫిషర్ చివరల్లో మలద్వారం వద్ద చీరుకుపోయిన చోట కండ పెరిగినట్లుగా ఉండి, దాని చివరభాగం బయటకు తోసుకొచ్చినట్లుగా కనిపిస్తుంది.
నిర్ధారణ: క్లినికల్‌గా తెలుసుకునే ప్రక్రియలో... బాధితుల వ్యాధి చరిత్రను (డిసీజ్ హిస్టరీని) అడిగి తెలుసుకోవడం, విసర్జన ద్వారం ఉన్న ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా ఫిషర్‌ను నిర్ధారణ చేయవచ్చు. ఒక్కోసారి ఆ ప్రాంతంలో నిశితంగా చూసినా కూడా ఫిషర్ కనిపించకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆ ప్రాంతంలో పూతమందు రూపంలో లభ్యమయ్యే నొప్పి, స్పర్శ తెలియనివ్వని మత్తుమందును (లోకల్‌గా ఇచ్చే టాపికల్ అనస్థీషియా) అక్కడ పూసి పరిశీలించాల్సిన అవసరం ఏర్పడవచ్చు.
ఇక మలద్వారం నుంచి రక్తస్రావం అయ్యేవారిలో... ఆప్రాంతంలో సిగ్మాయిడోస్కోపీతో పరీక్షించాల్సిన అవసరం ఏర్పడవచ్చు. సాధారణంగా బాధితులు 50 ఏళ్లలోపు వారైతే ఈ పరీక్ష అవసరమవుతుంది. యాభై ఏళ్లు దాటిన కొందరిలో ఒకవేళ వాళ్ల కుటుంబాల్లో మలద్వార క్యాన్సర్ ఉన్న కుటుంబ చరిత్ర ఉన్నవారైతే వారి పెద్దపేగునంతా పరిశీలించడానికి డాక్టర్లు కొలనోస్కోపీ అనే పరీక్షను చేసే అవకాశం ఉంది.
అయితే ఇవన్నీ వెంటనే కాకుండా కొంతకాలం మందులు ఇచ్చి చూసి, మెరుగుదల కనిపించడాన్ని బట్టి అవసరమైతే పైన పేర్కొన్న పరీక్షలను చేయాల్సి రావచ్చు. ఇక కొందరిలో మలద్వారం స్ఫింక్టర్ మూసుకు΄ోయేందుకు కలిగే ఒత్తిడి ఎంత ఉందో పరిశీలించేందుకు ‘యానోరెక్టల్ మ్యానోమెట్రీ’ అనే పరీక్షనూ చేయాల్సి రావచ్చు.
ఫిషర్‌నునివారించడం
ఇలా... ఫిషర్ కేవలం నొప్పిని కలిగించేదే కాదు... అది సామాజికంగానూ చాలా ఇబ్బందిని కలిగించే సమస్య. ఎవరికైనా చూపించుకోవాలన్నా, నలుగురితో బాధ పంచుకోవాలన్నా చాలా కష్టం. అందుకే వచ్చాక దీనికి చికిత్స చేయించుకోవడం కంటే అసలు రాకుండానే నివారించుకోవడం చాలా మంచిది. ఫిషర్‌ను నివారించుకోవడం చాలా సులువు కూడా.
నివారణ మార్గాలివి...
ఆహారంలో తేలిగ్గా జీర్ణమయ్యే పీచు (సొల్యుబుల్ ఫైబర్) ఎక్కువగా ఉండే ఆకుకూరలు, తాజా పండ్లు వంటివి ఎక్కువగా తీసుకోవడం, రోజులో ఎక్కువసార్లు మంచినీళ్లు తాగుతూ ఉండటం.
మలం గట్టిగా మారడానికి తోడ్పడే ఆహారపదార్థాలైన మసాలాలూ, మాంసాహారం, పచ్చళ్లను బాగా తగ్గించుకోవడం.
మాటిమాటికీ నీళ్ల విరేచనాలు అవుతున్నవారు, ఇలా తరచూ ఎందుకు జరుగుతుందన్న విషయాన్ని డాక్టర్‌ను సంప్రదించి తెలుసుకుని తగిన చికిత్స తీసుకోవడం.
మలవిసర్జన తర్వాత ఆ ప్రాంతాన్ని చక్కగా శుభ్రం చేసుకోవడం పొడిగా ఉంచుకోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) విధానాలను పాటించడం.
మలవిసర్జన తర్వాత టాయిలెట్ పేపర్‌తో శుభ్రపరచుకునే వారు చాలా మృదువైన వాటినే ఉపయోగించడం.
ఒకవేళ అప్పటికే చిన్న పాటి ఫిషర్ ఉన్నవారు మలవిసర్జన సాఫీగా జరిగేలా అక్కడ ఒరిపిడిని తగ్గించే ల్యూబ్రికేటింగ్ ఆయింట్‌మెంట్స్ వాడటం... లాంటి నివారణ చర్యలు తీసుకోవడం అవసరం.
చికిత్స
అక్యూట్ ఫిషర్‌ను కనుగొన్నప్పుడు... నేరుగా ఫిషర్‌కే చికిత్స అందించడం కాకుండా... దాదాపు 80 శాతం సందర్భాల్లో... అసలు ఫిషర్ ఏర్పడటానికి కారణమైన అంశాలను నివారించడానికే చికిత్స చేస్తుంటారు. ఇందుకోసం తొలుత మలబద్దకాన్ని నివారించే మందుల్ని సూచించడం, మలాన్ని మృదువుగా మార్చే మందులు వాడటం, మలవిసర్జన సమయంలో కలిగే నొప్పిని తగ్గించే మందులు ఇవ్వడం లాంటి చికిత్సలు అందిస్తారు. అలాగే మలవిసర్జన సాఫీగా జరిగేలా పేగు కదలికలు (బవెల్ మూవ్‌మెంట్స్) క్రమబద్ధంగా జరిగేలా చూసే మందులిస్తారు.
శస్త్ర చికిత్స
ప్రక్రియలు అక్యూట్ ఫిషర్‌కు మందులను 3 నుంచి 4 వారాల పాటు వాడినా పెద్దగా గుణం కనిపించని సందర్భాల్లోనూ లేదా యానల్ ఫిషర్ దీర్ఘకాలిక ఫిషర్ (క్రానిక్)గా మారినప్పుడు శస్త్రచికిత్స (సర్జరీ) అవసరం పడవచ్చు.
ఆ సర్జరీ విధానాలివి... ల్యాటరల్ ఇంటర్నల్ స్ఫింక్టరెక్టమీ : ఈ శస్త్రచికిత్సను కూడా దేహమంతటికీ పూర్తి మత్తు (జనరల్ అనస్థీషియా) ఇవ్వడం ద్వారా... లేదా వెన్నెముకకు మత్తుమందు (స్పైనల్ అనస్థీషియా) ఇవ్వడం ద్వారా చేస్తారు. ఇందులో స్ఫింక్టర్‌లో గట్టిబారిన కండర ప్రాంతాన్ని (హైపర్‌ట్రొఫాయిడ్ ఇంటర్నల్ స్ఫింక్టర్‌ను) జాగ్రత్తగా ఒలిచినట్లుగా తొలగిస్తారు. దాంతో స్ఫింక్టర్ కండరం తన బిగుతును కోల్పోయి మునుపటిలా మృదువుగా మారుతుంది. ఫలితంగా మలవిసర్జన సమయంలో ఒరిపిడి తగ్గి, మలద్వారం వద్ద ఉన్న పగులు/చిరుగు క్రమంగా తగ్గిపోతుంది.
ఇక రెండోదశ చికిత్సగా (సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్‌మెంట్) మలద్వారం లోపలికి 0.4% నైట్రోగ్లిజరిన్ వంటి మందులతో పాటు గ్లిజెరాల్ ట్రైనైట్రేట్ ఆయింట్‌మెంట్ వంటివి స్ఫింక్టర్ లోపల పూతమందుగా వాడాల్సి ఉంటుంది. నిఫైడిపైన్ ఆయింట్‌మెంట్, డిల్షియాజెమ్ ఆయింట్‌మెంట్ వంటి పూతమందులు కూడా బాగానే పనిచేస్తాయి.
స్ఫింక్టర్ డయలేషన్ : ఈ సమస్యకు చేసే శస్త్రచికిత్సలో దేహానికంతటికీ మత్తు (జనరల్ అనస్థీషియా) ఇచ్చి సర్జరీ నిర్వహిస్తారు. ఇందులో మలద్వారాన్ని గట్టిగా మూసుకు΄ోయేలా చేసే స్ఫింక్టర్‌ను వెడల్పు చేస్తారు. నిజానికి ఈ ప్రక్రియను చాలామంది డాక్టర్లు అంతగా సిఫార్సు చేయరు. ఎందుకంటే ఈ తరహా శస్త్రచికిత్స తర్వాత చాలామంది మలనియంత్రణపై అదుపు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించాలంటే సర్జన్‌కు చాలా మంచి నైపుణ్యం ఉండాలి.
ల్యాటరల్ ఇంటర్నల్ స్ఫింక్టరెక్టమీ : ఈ శస్త్రచికిత్సను కూడా దేహమంతటికీ పూర్తి మత్తు (జనరల్ అనస్థీషియా) ఇవ్వడం ద్వారా... లేదా వెన్నెముకకు మత్తుమందు (స్పైనల్ అనస్థీషియా) ఇవ్వడం ద్వారా చేస్తారు. ఇందులో స్ఫింక్టర్‌లో గట్టిబారిన కండర్ర ప్రాతాన్ని (హైపర్‌ట్రొఫాయిడ్ ఇంటర్నల్ స్ఫింక్టర్‌ను) జాగ్రత్తగా ఒలిచినట్లుగా తొలగిస్తారు. దాంతో స్ఫింక్టర్ కండరం తన బిగుతును కోల్పోయి మునుపటిలా మృదువుగా మారుతుంది. ఫలితంగా మలవిసర్జన సమయంలో ఒరిపిడి తగ్గి, మలద్వారం వద్ద ఉన్న పగులు/చిరుగు క్రమంగా తగ్గిపోతుంది.
శస్త్రచికిత్స వల్ల కలిగే దుష్పరిణామాలు (సైడ్ ఎఫెక్ట్స్) :
ఫిషర్‌కు శస్త్రచికిత్స వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు కొన్ని దుష్పరిణామాలను కూడా తెలుసుకోవడం మంచిది. సాధారణంగా ఫిషర్‌కు శస్త్రచికిత్స చేశాక, ఆ ప్రాంతమంతా గాలిసోకని విధంగా, అవయవాల ముడుతల్లో ఉంటుంది కాబట్టి అక్కడ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఎక్కువ. ఒక్కోసారి శస్త్రచికిత్స తర్వాత రక్తస్రావమూ కావచ్చు. ఫిషర్ క్రమంగా లోపలివైపునకు సాగుతూ పేగుల్లో పొడుగాటి పైపులా పాకుతూ... ‘ఫిస్టులా అనే కండిషన్‌కూ దారితీయవచ్చు.
ఇక అన్నింటికంటే ప్రమాదకరమైన పరిస్థితి ఏమిటంటే... శస్త్రచికిత్స తర్వాత కొందరిలో మలాన్ని లోపలే పట్టి ఉంచేలా చేసే నియంత్రణ శక్తి కోల్పోయి... అక్కడి నుంచి కొద్దికొద్దిగా మలం బయటకు వస్తూ ఉండవచ్చు. దీన్నే ‘ఫీకల్ ఇన్‌కాంటినెన్స్’ అంటారు. శస్త్రచికిత్స తర్వాత ఈ ఇన్‌కాంటినెన్స్ వస్తే అది మరింత ఇబ్బందికరం. కాబట్టి ఇలాంటి శస్త్రచికిత్సలు అవసరమైనప్పుడు అత్యంత నిపుణులైన సర్జన్‌ల ఆధ్వర్యంలోనే ఈ శస్త్రచికిత్సలు జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఫిషర్ సర్జరీ విషయంలో మరో ముప్పు... ఫిషర్ సమస్యను తగ్గించడానికి చేసే సర్జరీ విజయవంతమైతే ఎలాంటి ఇబ్బందీ ఉండదుగానీ... ఆరు శాతం కేసుల్లో మాత్రం శస్త్రచికిత్స తర్వాత కూడా ఫిషర్ మళ్లీ తిరగబెట్టే అవకాశముంటుంది. ఈ ముప్పును గుర్తుంచుకోవడం మంచిది. ఫిషర్ అనేది ఇటు వ్యక్తిగతంగానూ, అటు సామాజికంగా నలుగురితో కలుస్తుండాన్ని నిరోధిస్తూ... ఇలా అన్ని విధాలా ఇబ్బంది కలిగించే సమస్య. శస్త్రచికిత్స తో నయం చేసుకోవాలనుకున్నా అప్రయత్నంగా, శస్త్రచికిత్సకుల ప్రమేయం లేకుండా కూడా మళ్లీ మళ్లీ తిరగబెట్టేందుకు ఎక్కువ అవకాశమున్న ఇబ్బంది ఇది.
చికిత్స కంటే నివారణ మేలు అన్న సూక్తి అన్నిటికంటే ఈ సమస్యకే ఎక్కువగా వర్తిస్తుంది. పైగా చికిత్స కంటే నివారణ చాలా సులువు కూడా. కాబట్టి తేలిగ్గా నివారించే మార్గాలైన... వేళకు భోజనం చేయడం, పీచు (ఫైబర్) పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం వంటి మంచి ఆహారపు అలవాట్లతోనూ, మలద్వారం వద్ద వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్)పాటించడం వంటి మంచి టాయిలెట్ అలవాట్లతోనే ఈ సమస్య నివారణ చాలా తేలిగ్గా జరుగుతుంది. కాబట్టి ఈ మార్గాలను అనుసరిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలితో (ఆహారపు అలవాట్లూ, కొద్దిగా తేలికపాటి వ్యాయామాలతో) అసలు ఫిషర్ అనే సమస్యే దరిచేరకుండా నివారించవచ్చని తెలుసుకోవడం మేలు. ఈ ఆరోగ్యకరమైన జీవనశైలి కేవలం ఫిషర్‌నే కాదు... అనేక ఇతర ఆరోగ్యసమస్యలనూ నివారిస్తుందని గుర్తుంచుకోవడం మరీ మంచిది.
Comments
Please login to add a commentAdd a comment