సోవియట్ రష్యాలో అణుప్రమాదం జరిగిన చెర్నోబిల్ పట్టణం సంగతి చాలామందికి తెలుసు. ప్రస్తుతం యుక్రెయిన్ భూభాగంలో ఉన్న చెర్నోబిల్ పట్టణంలోని అణు విద్యుత్ కేంద్రంలోని రియాక్టర్ 1986 ఏప్రిల్ 26న పేలిపోయింది. అప్పటి నుంచి ఈ పట్టణం ఎడారిగా మారింది. ఇప్పటికీ అక్కడి గాలిలో అణుధార్మిక శక్తి వ్యాపించే ఉంది. అక్కడ ఊపిరి తీసుకున్నా ప్రమాదమే! అయితే, చెర్నోబిల్‌ను తలపించే మరో పట్టణం ఆస్ట్రేలియాలో ఉంది. ఆస్ట్రేలియా పశ్చిమ ప్రాంతంలోని విటెనూమ్‌లో పట్టణం మరో చెర్నోబిల్‌గా పేరు పొందింది. అలాగని విటెనూమ్ అణు రియాక్టర్ పేలుడు ఏదీ సంభవించలేదు. దశాబ్దాల కిందట ఇక్కడ యాజ్బెస్టాస్ గనులు ఉండేవి.
ఈ ప్రాంతంలో 1930ల నుంచి గనులు ఉన్నా, 1947 గోర్జ్ కంపెనీ ఇక్కడి గనులను స్వాధీనం చేసుకుని, గని కార్మికుల కోసం 1950లో ఈ పట్టణాన్ని నిర్మించింది. ఆ తర్వాత 1966 నాటికి గనులు మూతబడ్డాయి. గనులు మూతబడిన తర్వాత కూడా ఇక్కడ జనాలు ఉంటూ వచ్చారు. అయితే, యాజ్బెస్టాస్ ధూళి కణాలు పరిసరాల్లోని గాలిలో వ్యాపించి ఉండటంతో జనాలు తరచు ఆరోగ్య సమస్యలకు లోనయ్యేవారు. వారిలో చాలామంది క్యాన్సర్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు.
దీంతో పశ్చిమ ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇక్కడి ప్రజలను వేరే ప్రదేశాలకు తరలించి, పట్టణాన్ని పూర్తిగా ఖాళీ చేయించింది. ఇప్పటికీ ఇక్కడి గాలిలో ప్రమాదకరమైన యాజ్బెస్టాస్ ధూళికణాలు ఉన్నాయని, ఇక్కడ ఊపిరి తీసుకున్నా ప్రమాదమేనని శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. శాస్త్రవేత్తల సూచన మేరకు ప్రభుత్వం ఈ పట్టణంలో అడుగడుగునా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసింది. జనాలు ఉన్నప్పుడు ఇక్కడ ఏర్పడిన ఇళ్లు, ప్రార్థన మందిరాలు, బడులు, హోటళ్లు వంటివన్నీ ఇప్పుడు ధూళితో నిండి బోసిగా మిగిలాయి.
(చదవండి: చాయ్ తాగాలంటే కొండ ఎక్కాల్సిందే! శిఖరాగ్ర పానీయం!)
Comments
Please login to add a commentAdd a comment