వాటర్ ఉమన్ నదుల గొప్పతనం గురించి చెప్పమంటే మాటల్లో ఎన్ని అయినా చెబుతాం. అలాంటి పుణ్య నదులు నిర్లక్ష్యం బారిన పడి జీవం కోల్పోయే పరిస్థితిలో ఉంటే మాత్రం పట్టించుకోము. ఈ ధోరణికి భిన్నమైన మహిళ శిర్ప పథక్. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శిర్పకు నదులు అంటే ఇష్టం. వాటికి సంబంధించిన పురాణ కథలు అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్న పుణ్యనది గోమతి సంరక్షణ కోసం వెయ్యిన్కొక్క కిలోమీటర్ల పాదయాత్ర చేసింది...
సన్నని ప్రవాహమై బయలుదేరే గోమతి ప్రయాణంలో బలపడుతుంది. ‘ప్రయాణం గొప్పతనం బలం’ అని ఆ నది మౌనంగానే చెబుతుంది. అందుకేనేమో ‘గోమతి నదిని రక్షించుకుందాం’ నినాదానికి బలం ఇవ్వడానికి పాదయాత్ర చేసింది శిర్ప పథక్. పారిశ్రామిక వ్యర్థాలు, నివాసాలలో నుంచి వచ్చే మురుగు నీరు... మొదలైన వాటి వల్ల గోమతి అనేక ప్రాంతాలలో కలుషితం అవుతుంది. మురుగునీటి శుద్ధి కర్మాగారాల వల్ల కూడా పెద్దగా ప్రయోజనం జరగడం లేదు.
‘గంగానదితో పోల్చితే గోమతి ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటోంది’ అని నివేదికలు తెలియజేస్తున్నాయి. ‘ఎవరో వస్తారని... ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మన నదిని మనమే రక్షించుకుందాం’ అంటుంది శిర్ప. పంచతత్వ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలైన శిర్ప పథక్ ‘వాటర్ ఉమన్’గా పేరు తెచ్చుకుంది. ‘గోమతి నదిని రక్షించుకుందాం’ నినాదంతో పదిహేను జిల్లాలలో ఊళ్లు, పల్లెలు, పట్టణాల గుండా సాగిన పాదయాత్రలో ఆ పుణ్యనది ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల గురించి ప్రజలకు తెలియజేసింది.
‘పరిస్థితి ఇది. మనం చేయాల్సింది ఇది’ అంటూ స్పష్టంగా చెప్పింది. ప్రతిరోజు 30 నుంచి 35 కిలోమీటర్‌ల వరకు పాదయాత్ర చేసింది. ‘నది ఒడ్డున మొక్కలు నాటుదాం’ అని ప్రజలతో ప్రమాణం చేయించింది. శిర్ప వెంట ప్రజలు వచ్చేవాళ్లు. పర్యావరణ సంబంధిత విషయాలను చర్చిస్తూ ఆమె పాదయాత్ర ముందుకు సాగేది. ‘ఆక్రమణలను అడ్డుకుందాం. పుణ్యనదిని కాపాడుకుందాం’ అనే నినాదంతో ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు, అధికారులతో మాట్లాడేది. ఈ పాదయాత్రలో పాల్గొన్న వందలాది మంది ప్రజలు మొక్కలు నాటడాన్ని ఒక ఉద్యమంలా చేసుకున్నారు.
‘నా పాదయాత్రలో భాగంగా నది చుట్టు పక్కల ప్రాంతాలలో నివసించే ఎంతోమందితో మాట్లాడాను. నది పరిస్థితి తెలిసినప్పటికీ ఏంచేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. అలాంటి వారికి మార్గనిర్దేశం చేశాను’ అంటుంది శిర్ప. శిర్ప విషయానికి వస్తే... నదుల సంరక్షణ గురించి పల్లెలు, పట్టణాల గుండా యాత్ర చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో నర్మద నది సంరక్షణ కోసం 3600 కిలోమీటర్ల యాత్ర చేసింది.
‘నదులకు ఏమైతే మనకేమిటి? మనం హాయిగానే ఉన్నాం కదా అనే భావన నుంచి బయటికి రావాలి. నదుల మనుగడలోనే మనుషుల మనుగడ ఉంది. ప్రకృతి వనరులే మన శక్తులు. నదులకు ముప్పు వాటిల్లితే మన కుటుంబ పెద్దలకు ముప్పు వాటిల్లినట్లుగా భావించి తక్షణ చర్యలపై దృష్టి పెట్టాలి. మనిషికి రక్తం ఎంత అవసరమో నది ఆరోగ్యానికి కలుషితం కాని నీరు అంతే అవసరం’ అంటోంది శిర్ప. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుదౌన్ జిల్లాకు చెందిన శిర్ప ఉన్నత చదువులు చదివింది.
‘ఏదో ఒక ఉద్యోగం చేయడం కంటే నదుల పరిరక్షణకు నా వంతుగా ఏదైనా చేస్తాను’ అంటూ ప్రయాణం మొదలు పెట్టింది. ఆ ప్రయాణం వృథా పోలేదని ఎన్నో ఊళ్లలో వచ్చిన మార్పు తెలియజేస్తుంది. నదిలో నీళ్లు మాత్రమే కాదు ఆ నది కార్చే కన్నీళ్లు కూడా ఉంటాయి. నీళ్లు అందరికీ కనిపిస్తాయి. కన్నీళ్లు కొందరికి మాత్రమే కనిపిస్తాయి. ఆ కొందరు అందరిలో అవగాహన రావడం కోసం ప్రయత్నిస్తారు. అలాంటి ఒక వ్యక్తి... వాటర్ ఉమన్ శిర్ప పథక్. ‘నా వల్ల ఏమవుతుంది అనే మాట బలహీనమైది. నా వల్ల కూడా అవుతుంది అనేది బలమైనది. బలమైన మాటే మన బాట అయినప్పుడు మార్పు సులభం అవుతుంది’ అంటుంది శిర్ప పథక్.
(చదవండి: చిద్విలాస చిత్రగణితం! మ్యాథ్స్‌తో ఆర్ట్‌ను మిళితం చేసే సరికొత్త ఆర్ట్!)
Comments
Please login to add a commentAdd a comment