ఇటీవల మానవ అక్రమ రవాణాలో ఆధునికత చోటు చేసుకుంది. సాంకేతిక యుగంలో మనం ఉపయోగించే రకరకాల మాధ్యమాలు ఇందుకు ప్రధాన కారణం అవుతున్నాయి. ఈ నవీన కాలంలో హ్యూమన్ ట్రాఫికింగ్ ఏ విధంగా జరుగుతుందో అవగాహన పెంచుకుంటే, జాగ్రత్త పడటం సులువు అవుతుంది.
ఎనిమిదవ తరగతి చదువుతున్న శ్రీజ (పేరుమార్చడమైంది) తన తల్లి ఫోన్‌ని ఉపయోగిస్తుండేది. శ్రీజకు తోడబుట్టిన అక్కచెల్లెళ్లు ముగ్గురు ఉన్నారు. తండ్రి మరణించడంతో తల్లి నాలుగిళ్లలో పాచి పని చేస్తూ పిల్లలను పోషిస్తుంది. ఒక రోజు మొత్తం శ్రీజ కనిపించకపోవడంతో కంగారుపడి పోలీసులను సంప్రదించారు. రెండు రోజులు వెతకగా శ్రీజ కలకత్తాలో ఉన్నట్టు తెలిసింది. అపరిచిత వ్యక్తి ప్రేమ పేరుతో ఫోన్ ద్వారా నమ్మబలికి, శ్రీజ ను రప్పించినట్టుగా, అటు నుంచి ఆమెను మరో చోటుకి తరలించే ప్రయత్నం చేసినట్టు గుర్తించి, తిరిగి తీసుకొచ్చి, తల్లికి అప్పజెప్పారు. ఆడపిల్లలు/మహిళలను తప్పుదోవ పట్టించే నేర ప్రక్రియలో ఇంటర్నెట్ ఒక మాధ్యమంగా మారింది.
సామాజిక మాధ్యమాలలో కనిపించిన ‘కిడ్నీ కావలెను’ అనే ప్రకటన చూసిన రమేష్ (పేరు మార్చడమైనది) అందులో ఇచ్చిన ఫోన్ నెంబర్‌ను సంప్రదించాడు. అవతలి వ్యక్తులు చెప్పిన విషయాలు విని, ఒక కిడ్నీ ఇస్తే తనకు ఆర్థిక బాధలు తొలగిపోతాయని భావించాడు. చెప్పిన చోటికి వెళ్లిన అతను తిరిగి ఇంటికి చేరుకోలేదు.
లైంగిక అత్యాచారం, శ్రమ దోపిడి, శిశువుల అమ్మకాలు, అవయవాలు, వధువుల అక్రమ రవాణాలో ఇప్పటి వరకు ఒక దశలో ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా ట్రాఫికర్లు సైబర్ స్పేస్‌ను కూడా ఉపయోగించుకుంటున్నారు. దీంతో ఈ సమస్య ప్రభుత్వం, పోలీసులు, న్యాయవ్యవస్థకు పెద్ద సవాల్‌గా నిలిచింది.
► సైబర్ ట్రాఫికింగ్‌లో లైంగిక దోపిడీ ప్రాబల్యం రకరకాల రూపాలను చూపుతుంది. యుఎన్ డాట్ జిఎఫ్‌టి గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం సైబర్ ట్రాఫికింగ్‌లో లైంగిక దోపిడీకి, మానవ అక్రమ రవాణా 79 శాతం ఉన్నట్టు గుర్తించింది. బాలికలు 13 శాతం, పురుషులు 12 శాతం, బాలురు 9 శాతం అక్రమ రవాణాకు గురైనట్టు పేర్కొంది.
సైబర్ ఫేక్...
► ట్రాఫికర్లు మహిళలపై హింసకు సోషల్ మీడియా ద్వారా కొత్త మార్గాలను తెరిచారు. నేరస్తులు సోషల్ మీడియా ద్వారా బాధితులను ఆకర్షించడం, మోసగించడం, ట్రాప్ చేయడం ఈ విధానంలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. సామాజిక మాధ్యమాల ద్వారా ముఖ్యంగా అమ్మాయిలను /మహిళలను ట్రాప్ చేయడానికి నేరస్తులు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. ఫేక్ ఐడీలను సృష్టించి స్కూల్, కాలేజీ యువతుల భావోద్వేగాలపైన తమ ప్రభావం చూపుతుంటారు. ప్రేమ పేరుతో చాటింగ్ చేస్తూ, కానుకల ద్వారా ఆకర్షిస్తూ, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోల ద్వారా బెదిరిస్తూ ఇల్లు దాటేలా చేస్తుంటారు.
► సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో బాధితులను తమకు అనుకూలంగా మార్చడం, నియంత్రించడం వంటివి జరుగుతున్నాయి.
► ఉద్యోగాల పేరుతో యువకులను ఆకర్షించి, వారు సైబర్ నేరాలకు పాల్పడేలా వేధింపులకు లోను చేయడం.
► అద్దె గర్భం (సరోగసీ విధానం) కూడా ఇప్పుడు ఆన్‌లైన్ వేదికగా కొత్త పుంతలు తొక్కుతోంది. నమ్మి వెళ్లిన వాళ్లు కొత్త సమస్యలలో చిక్కుకునే పరిస్థితి ఎదురైంది.
► పోర్నోగ్రఫీ అక్రమ రవాణాకు ప్రతి క్షణం ఆజ్యం పోస్తూనే ఉంది. ఈ విష చట్రంలోకి ప్రపంచ వ్యాప్తంగా 12 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలు చేరుతున్నట్టు, ఈ అక్రమ రవాణాకు గురవుతున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి.
డిజిటల్ వేగం
వాడుకలో సౌలభ్యంతో పాటు వేగం ఉండటం వల్ల కూడా నేరస్థులు తమ సామర్థ్యాలను మెరుగుపరచుకుని ఇంటర్నెట్ మాధ్యమాల్లో వాటిని చూపుతున్నారు. దీని వల్ల డిజిటల్ జాడలు కనిపెట్టి, మనవారిని రక్షించడం అనేది పెద్ద ప్రయాసగా మారింది.
అప్రమత్తతే అడ్డుకట్ట
ఇంటర్నెట్ వాడకం వల్ల అపారమైన ప్రయోజనాలు ఉన్నట్టే, సరిహద్దులు దాటి సుదూర దేశాల నుండి మనల్ని మరో మార్గంలో ప్రయాణించేలా చేయడానికి సైబర్ ట్రాఫికర్స్ పొంచి ఉన్నారు. అందుకే, సోషల్ మీడియా వాడకంలో తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. స్కూళ్లు, కాలేజీలు ఇంటర్నెట్ వాడకం ద్వారా జరిగే నష్టాలు, మానవ అక్రమ రవాణాకు జరుగుతున్న ప్రయత్నాల గురించి అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది.
డార్క్ టీమ్స్ ఉంటాయి జాగ్రత్త
సైబర్ ఎనేబుల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఈ మధ్య కొత్త పదం వచ్చింది. మన దేశం నుంచి విదేశాలకు మంచి ఉద్యోగం ఇప్పిస్తామని తీసుకెళ్లి, సైబర్ క్రైమ్ చేయిస్తుంటారు. విదేశాలకు వెళ్లాలనే కోరిక అధికంగా ఉన్నవారిని గుర్తించి ఈ విధానానికి ఎంచుకుంటారు. తాము చెప్పినట్టుగా ఒప్పుకోనివారిని వేధిస్తారు. లేదంటే, వారి ఆర్థిక స్థితిని బట్టి డబ్బు వసూలు చేసి, వదిలేస్తారు. ఆ తర్వాత సైబర్ ట్రాఫికింగ్‌లో ఆర్గాన్ ట్రేడింగ్, సరోగసి కూడా ప్రధానంగా ఉన్నాయి. నేరస్థులు సైబర్ డార్క్ టీమ్స్‌ను ఏర్పాటు చేస్తారు. వీరి ద్వారా అమాయకులను ట్రాప్ చేసి, అక్రమ రవాణాకు పాల్పడుతుంటారు. అందుకని అపరిచితులతో పరిచయాలను పెంచుకోవద్దు. ఒంటరి మహిళలను ట్రాప్ చేయడానికి సైబర్ నేరగాళ్లు ఎప్పుడూ శోధిస్తూనే ఉంటారు. మన వివరాలను ఆన్‌లైన్‌లో బహిరంగ పరచకూడదు. ఆన్‌లైన్ అగ్రిమెంట్‌లాంటివి చేయకూడదు. సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వచ్చే ప్రకటనలు చూసి మోసపోకూడదు.
– అనీల్ రాచమల్ల, సైబర్ నిపుణులు, ఎండ్ నౌ ఫౌండేషన్
Comments
Please login to add a commentAdd a comment