కర్కాటక రాశి (ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 5, అవమానం 4)
కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం యోగవంతంగా ఉంది. తృతీయ చతుర్థ స్థానాలో కేతువు, అష్టమస్థానంలో శని, భాగ్య దశమ స్థానాలలో గురురాహువులు, రవి చంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యమిలు కీలక ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. నూతన గృహ వస్తు వాహనాలను సమకూర్చుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అదృష్టం కలిసివస్తుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీ పేరుమీద నడిచే సంస్థలకు ఆదరణ లభిస్తుంది. జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ఇతరుల కుయుక్తులు మీపై ప్రభావం చూపవు. మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. అందరినీ కలుపుకొనిపోయి విజయాలు సాధిస్తారు. ఎరుపు, పసుపు వత్తులతో అష్టమూలికాతైలం కలిపి దీపారాధన చేయండి.
స్త్రీల సహాయసహకారాలు లాభిస్తాయి. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సంవత్సర ద్వితీయార్ధంలో విదేశీయాన ప్రయత్నాలు లాభిస్తాయి. సాఫ్ట్‌వేర్ రంగంలోని వారికి ఒడిదుడుకులు సూచిస్తున్నాయి. కార్యాలయంలో మీపై దుష్ప్రచారం చేసేవారికి బదిలీ జరుగుతుంది. సాంకేతిక విద్యారంగంలో రాణిస్తారు. నూనె, అపరాలు, విత్తనాలు, యంత్ర, వాహన వ్యాపారాలలో రాణిస్తారు. ముద్రణ, ప్రచురణ వ్యాపారాలు లాభిస్తాయి. విడిపోయిన రెండు కుటుంబాలను కలుపుతారు. బంధువులతో, దాయాదులతో వివాదాలు సంభవిస్తాయి. ఇతరులు మీపై మోపిన ఆరోపణలు బహుళ ప్రచారంలో ఉంటాయి. మొండి బాకీలు రాబట్టుకోవడానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. భూమి కొనుగోలు, అమ్మకాల వల్ల లబ్ధి పొందుతారు. పన్నుల అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కీ
ళ్ళు, పాదాలకు సంబంధించిన ఇబ్బందులు సంభవం. కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాలలోని వారికి సాధారణ ఫలితాలు వస్తాయి. ఆర్థిక ఒత్తిడుల నుంచి బయటపడతారు. అమ్మకాలు, కొనుగోలు వ్యవహారాలలో మోసపోయే అవకాశం ఉంది. ఏరు దాటాక తెప్పను తగలేసే వ్యక్తులు మీ మనోవేదనకు కారణం అవుతారు. భగవంతునిపై భారం వేసి చాలా కార్యక్రమాలు చేస్తారు. తనఖాలో ఉంచిన విలువైన వస్తువులను విడిపించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధనం బాగా వెచ్చిస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి వైద్యుల సలహాను అమలుపరచడం మంచిది. జీవితభాగస్వామికి విలువైన బహుమతులు కానుకగా ఇస్తారు. శక్తిసామర్థ్యాలు ఉన్నా, సరైన గుర్తింపు రాలేదన్న భావన మనోవేదనకి గురిచేస్తుంది.
వ్యతిరేకమైన ఆలోచనా ధోరణి, ఇతరులపై అనుమానం మానసిక సంఘర్షణకు దారితీస్తాయి. విదేశాలలో విద్య, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, లైసెన్సులు లీజులు లాభిస్తాయి. దైవానుగ్రహం వెన్నంటి రక్షిస్తున్నట్లుగా భావిస్తారు. సంతానం లేనివారికి సంతానప్రాప్తి. వివాహం కాని వారికి వివాహప్రాప్తి. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూమైన కాలం. నూనె, లోహ వ్యాపారులకు, వస్త్ర వ్యాపారులకు, రత్న వ్యాపారులకు, రవాణా వ్యాపారులకు అనుకూలమైన కాలం, మంచి లాభాలు వస్తాయి. ఆస్తి వ్యవహారాల్లో మీకు తెలియకుండా రహస్య చర్చలు జరుగుతాయి. నమ్మకద్రోహం గురించి సమాచారం తెలిసిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.
ముఖ్యమైన కార్యక్రమాల బాధ్యతలు మీ సన్నిహితులకు అప్పగించినా మీ పర్యవేక్షణ లోపం ఉండదు. ప్రతి విషయంలోనూ ఎంతోకొంత సొంతలాభం లేకుండా తలదూర్చరు. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం అఘోరపాశుపత హోమం చేయాలి, రాహుకేతు గ్రహదోష పరిహార కంకణం లేదా రూపు ధరించాలి. గతంలో ఉచితంగా చేసిన కార్యక్రమాలకు, ప్రజాసేవకు కొన్ని వ్యాఖ్యానాలు రావడం మీలోని ఈ మార్పుకు కారణం అవుతుంది. మధ్యవర్తిత్వం చేసి కొందరి మధ్య సయోధ్య కుదురుస్తారు. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్ధం కన్నా ద్వితీయార్ధం బాగుంది.
స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్నింటిలోనూ మెరిట్ మార్కులు సంపాదిస్తారు. ప్రతిష్ఠాత్మకమైన ఉద్యోగానికి ఎంపికవుతారు. కుటుంబానికి అండగా ఉండటానికి భగవంతుడు ఈ అవకాశం కల్పించాడని మీరు భావిస్తారు. ఎక్కడా ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోరు. సొంతవాళ్ళను ఇతరులు అవమానిస్తే వాళ్ళకు తగినవిధంగా బుద్ధి చెబుతారు. సంతాన పురోగతి బాగుంటుంది. విద్యారంగంలో చక్కగా రాణిస్తారు. పిల్లలను చదివించడానికి అవసరమైన డబ్బు లేకపోవడం వల్ల ఇతరుల సహాయం మీద ఆధారపడటం, అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం సంభవిస్తుంది.
పేదరికం వల్ల చదువుకోలేని చదువులు కనీసం పిల్లలైనా చదువుకోవాలని ఆశిస్తారు. దొంగ స్వామీజీలను, దొంగ బాబాలను, దొంగ గురువులను నమ్మి మోసపోతారు. పిల్లల ప్రవర్తన, క్రమశిక్షణ, అలవాట్లు, స్నేహితులు మొదలైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేశకాలమాన పరిస్థితులను బట్టి మీ ప్రత్యేక పర్యవేక్షణ చాలా అవసరం. మెరిట్ మార్కులు సాధించినా, ఇతరాత్ర రంగాలలో మీకు మెరిట్ సర్టిఫికెట్లు ఉన్నా ఏ విద్యాసంస్థలోనూ ఫీజులో రాయితీ లభించదు. ధర్మదేవత ఒంటికాలి మీద నడవటం స్పష్టంగా కనబడుతుంది. ఆర్థికాభివృద్ధి కోసం స్వర్ణాకర్షణ భైరవ యంత్రాన్ని ఉపయోగించండి. క్రీడారంగంలో, కీలకమైన పోటీలలో విజయాలు సాధిస్తారు. ఉద్యోగం చేసే చోట వాతావరణం కలుషితం అవుతుంది.
ప్రేమ వివాహం పట్ల ఊహించుకున్న ఆశల సౌధాలు కూలిపోతాయి. కొత్తకొత్త రంగాలలో ఉన్న నైపుణ్యాన్ని తెలుసుకుంటారు. విదేశాలలో ఉద్యోగం చేయాలన్న కోరిక నెరవేరుతుంది. అవివాహితులకు వివాహప్రాప్తి. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. గైనిక్ సమస్యలను అధిగమిస్తారు. సంతానం క్రమశిక్షణ తప్పడం ఆందోళనకు కారణం అవుతుంది. సివిల్ సర్వీస్‌లకు, గ్రూప్–1 సర్వీస్‌లకు, మెడికిల్, ఐఐటీ వంటి వాటికి ఎంపిక అవుతారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఏదో ఒక ఉద్యోగం మీరు సంపాదించగలుగుతారు. మీరు జీవితంలోకి ఆహ్వానించాలనుకున్న వ్యక్తికి ఇది వరకే రెండు పెళ్ళిళ్ళు అయ్యాయన్న విషయం తెలుసుకోగలుగుతారు. మనసు దృఢపరచుకుంటారు. పాతాళంలోకి పడిపోయినట్లుగా అనిపిస్తుంది.
మనస్సు నివ్వెరపోతుంది. నవనాడులూ కృంగిపోతాయి. మీ మనస్సు, మీ కళ్ళు రెండూ మోసం చేశాయని గ్రహిస్తారు. నేను చాలా తెలివిగల దానిని అనే అహంభావం ఉన్న మీకు, మీరెంత తెలివి తక్కువాళ్ళు అనేది రుజువవుతుంది (ఇది కొంతమంది విషయంలో మాత్రమే, అందరికీ కాదు). పెళ్ళికి సంబంధించి తల్లిదండ్రుల మాటలు వినాలని నిర్ణయించుకుంటారు. వివాహాది శుభకార్యాలు ప్రారంభంలో విసుగు కలిగించినా మధ్యవర్తుల ప్రమేయంతో నిశ్చయం అవుతాయి. మీ ఆలోచనలకు అనుగుణంగా పిల్లలను వృద్ధిలోకి తీసుకొస్తారు.
విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరులు మీ పేరు మీద చేసే వ్యాపారాలు బాగుంటాయి. మీకు మాత్రం లాభాలు అంతంతమాత్రంగా ఉంటాయి. రాజకీయంలో తలదూర్చవలసిన పరిస్థితులు వస్తాయి. రాజకీయ పదవి లభిస్తుంది. సమాజంలో మీ స్థాయిని, స్థానాన్ని పెంచుకోవడానికి దివారాత్రులు విశేషంగా కృషి చేస్తారు. చాలామంది అసూయపరులు మీరు అభివృద్ధి చెందకూడదని వాళ్ళ చేతుల్లో ఉన్న ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. స్త్రీకి స్త్రీయే శత్రువు అనే నానుడి మీ విషయంలో నిజమవుతుంది. సంవత్సర ద్వితీయార్ధంలో సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment