మూడో వేవ్ మూడో వేవ్ అంటూ కొంతకాలం ఆందోళనతో గడిచిపోయినా...ఆ తర్వాత ఎందుకో కరోనా కాస్త చల్లబడింది. అయితే ఒమిక్రాన్ అనే కొత్త వేరియెంట్ ప్రపంచవ్యాప్తంగా విజృంభించడంతో మళ్లీ అలజడి మొదలైంది. పిల్లలపై దీని ప్రభావం పెద్దగా ఉంటుందనే భయాందోళనలు నిపుణుల్లో వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులపై ఒమిక్రాన్ ప్రభావం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం.
మొదటి వేవ్, రెండో వేవ్‌లో కరోనా చిన్నారులపై అంతగా ప్రభావం చూపలేదు. అయితే ఇప్పుడీ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ పిల్లలపై ఎందుకు ప్రభావం చూపనుందనే ఆందోళనకు డాక్టర్లు కొన్ని దాఖలాలు చూపుతున్నారు. అవి...∙కరోనా వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి దాన్ని తొలుత 65 ఏళ్లకు పైబడిన వారికి ఇవ్వడం... ఆ తర్వాత ఆ వయోపరిమితిని 45 ఏళ్లకు తగ్గించడం... కొద్దికాలం తర్వాత 18 ఏళ్లకు తగ్గించడంతో ఇప్పటివరకు చురుగ్గా జరిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియ అంతా కేవలం 18 ఏళ్లకు పైబడినవారికే పరిమితమైంది. కొన్ని పాశ్చాత్యదేశాల్లో ఫైజర్ వంటి వ్యాక్సిన్లు పిల్లలకూ సురక్షితమని తేలడంతో... అక్కడ 12 ఏళ్లకు పైబడిన పిల్లలకు ఇచ్చినప్పటికీ మొత్తం వ్యాక్సినేషన్ చేయించుకున్న పిల్లల సంఖ్య, శాతం ఇప్పటికీ చాలా తక్కువ. ఇక మన దేశంలో నిర్వహించిన పరిశోధనల్లో సైతం మనం రూపొందించిన వ్యాక్సిన్లు చిన్నారుల్లో సురక్షితమని తేలినప్పటికీ... పిల్లలకు వేయాల్సిన మోతాదు, ఎన్ని విడతల్లో ఇవ్వాలి... ఇలాంటి మార్గదర్శకాలేవీ ఇప్పటికీ రూపొందలేదు. దాంతో అధికారికంగా 18 ఏళ్లలోపు పిల్లలంతా వ్యాక్సిన్లు వేయించుకోనివారే.
∙కనుగొన్న వెంటనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఒమిక్రాన్‌ను ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రకటించింది. డెల్టా విషయంలో అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాతగానీ ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా చెప్పలేదు. కానీ... ఒమిక్రాన్ విషయంలో మాత్రం కేవలం వంద మందికి సోకగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి...
వ్యాప్తి (ట్రాన్స్‌మిటబిలిటీ) : దాని వ్యాప్తి తీరును పరిశీలించినప్పుడు ఒమిక్రాన్ కనుగొన్న దేశాల్లో దాని వ్యాప్తి అత్యంత వేగంగా జరుగుతున్నట్లు గుర్తించారు. అప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారిలోనూ దీని వ్యాప్తి చురుగ్గా ఉన్నట్లు గమనించిన పరిశోధకులు... ఎలాంటి వ్యాక్సిన్ ఇవ్వని పిల్లల్లో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంటుందేమోనని అనుమానిస్తున్నారు.
చిన్నారుల్లో లక్షణాలు / చికిత్స : ఒమిక్రాన్‌లోనూ సాధారణ కరోనా లక్షణాలే ఒమిక్రాన్‌లోనూ కనిపిస్తున్నాయి. జ్వరం, తీవ్రమైన నిస్సత్తువ, నీరసం, అలసట, ఒళ్లునొప్పులు, ఎడతెరిపి లేకుండా దగ్గు, విపరీతమైన తలనొప్పి, గొంతు బొంగురుబోవడం వంటివి పిల్లల్లో కనిపించే లక్షణాలు. దాంతోపాటు పాటు చిన్నారుల ఒంటిపైన ర్యాష్ కూడా కాస్త ఎక్కువగానే కనిపిస్తుండటం విశేషం. ఇక చికిత్స విషయానికి వస్తే... ఇప్పటివరకూ ఇస్తూ వస్తున్న సాధారణ చికిత్సే వీరికి ఇవ్వాల్సిన అవసరం ఉంది.
పిల్లలకు వ్యాక్సినేషన్ : మనదేశంలో పిల్లలకు ఇంకా వ్యాక్సినేషన్‌పై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అయితే పెద్దలకు ఇచ్చిన మోతాదులోనే పిల్లలకు ఇవ్వడం కుదరకపోవచ్చు. పైగా చిన్నారుల వయసును, బరువును బట్టి వారికి ఇవ్వాల్సిన మోతాదును సైతం నిర్ణయించాల్సిన అవసరముంది. ఉదాహరణకు ఐదేళ్ల నుంచి ఎనిమిదేళ్ల వారికీ, తొమ్మిది నుంచి పన్నెండేళ్ల వారికీ, పన్నెండేళ్ల నుంచి 18 ఏళ్లలోపు వారికి ఏయే మోతాదుల్లో వ్యాక్సిన్ ఇవ్వాలనేదీ శాస్త్రీయంగా నిర్ధారణ చేయాల్సి ఉంది. ఇప్పటికే భారత్‌లో రూపొందిన కోవాక్సిన్, జైడస్ వంటి వ్యాక్సిన్‌లు పిల్లల విషయంలో సురక్షితమని తేలినప్పటికీ... సరైన మార్గదర్శకాలు రూపొందేవరకు అవి పిల్లలకు లభ్యమయ్యే అవకాశం లేదు. (ప్రస్తుత వ్యాక్సినేషన్ ఒమిక్రాన్‌ను ఎదుర్కొంటుందా అన్న సందేహం ఉన్నప్పటికీ) చిన్నారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముంది.
తీవ్రత / విస్తృతి : పిల్లల్లో వ్యాప్తివిస్తృతిపై ఇంకా అధ్యయనాలూ, పరిశీలనలూ జరుగుతున్నప్పటికీ... గతంలో ఆల్ఫా మొదలుకొని డెల్టా వరకు వచ్చిన వేరియెంట్లతో పోలిస్తే... ఒమిక్రానే పిల్లల్లో గణనీయంగా వ్యాప్తిచెందిన దాఖలాలు (డేటా) లభ్యమయ్యాయి. అయితే తీవ్రత విషయంలో ఇంకా డాక్యుమెంటేషన్ ప్రక్రియ జరుగుతోంది. పిల్లలకు వ్యాక్సినేషన్ ఇంకా జరగకపోవడం... పిల్లలకు అంత ప్రమాదకరం కాదని మున్ముందు తేలినా... ఒకవేళ వారికి గనక వస్తే అది పిల్లల నుంచి ఇంట్లోని పెద్దలకూ, వృద్ధులకూ సోకే అవకశం ఉన్నందున... ఈ మేరకు పిల్లలు వ్యాధిని వ్యాప్తిచెందించే వాహకులు (ట్రాన్స్‌మిటర్స్)గా ఉండగలరనే అభిప్రాయాలు నిపుణుల్లో వ్యక్తమవుతున్నాయి ఇప్పటికి కరోనాతో హాస్పిటల్‌లో చేరిన చిన్నారుల విషయానికి వస్తే... దక్షిణాఫ్రికా గణాంకాల ఆధారంగా ఒమిక్రాన్‌తో చేరిన పిల్లల సంఖ్యే ఎక్కువనీ, అందునా ఐదేళ్లలోపు పిల్లలు ఎక్కువగా ప్రభావితమయ్యాయని తేలింది. ఈ అంశం కూడా శాస్త్రవేత్తలు, అధ్యయన వేత్తలు, వైద్యనిపుణులను ఆందోళనలో ముంచెత్తుతోంది.
డా. రవీందర్‌రెడ్డి పరిగె,
సీనియర్ పీడియాట్రీషియన్ – నియోనేటాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment