
‘ఆకలికి అన్నము వేదనకు ఔషధం’ అనే నానుడి మనకందరికీ తెలిసినదే! శారీరక ఆరోగ్యానికి ఆహారం ఎంత అవసరమో అలాగే ఆనారోగ్య శరీరాలకు ఔషధం అనేది కూడా అంతే ముఖ్యం. కానీ ఔష ధాన్ని నిర్ణయించాల్సింది మటుకు వైద్యులే అనేది జగమెరిగిన సత్యం! రోగిని పరీ క్షించటం, వ్యాధిని నిర్ణయించి తగిన సమయంలో సరియైన మోతాదులలో మందులు వాడటం అనేది వైద్యుల బాధ్యతే. అయితే ‘విత్తం ఉంటేనే వైద్యం’ అనే రీతిలో ప్రస్తుత పరిస్థితులు ఉండ టంతో సమాజంలోని పేద, మధ్యతరగతి వారు వైద్యం అందక నానా ఇబ్బందులు పడుతున్నారు.
పూర్వం గ్రామాల్లో స్థిర నివాసం ఉండే వైద్యులు ఉండేవారు. వారికి ఆ ఊళ్లో ఉన్న అన్ని కుటుంబాల ఆరోగ్య స్థితుల పట్ల ఒక అవగాహన ఉండేది. అందువల్ల ఆయా కుటుంబాలకు వైద్య చికిత్స అందించడం తేలికయ్యేది. వారందరినీ ఫ్యామిలీ డాక్టర్లుగా వ్యవహరించడం కద్దు. అయితే ప్రస్తుతం వైద్యుల సంఖ్య పెరుగుతున్నా ఈ ఆధునిక కాలంలో పల్లెల్లోనే కాదు, పట్టణాల్లోనూ ప్రజలందరికీ డాక్టర్లు అందుబాటులో ఉండటంలేదు. ఇందుకు వైద్యం ఖరీదైనదిగా మారటం ఒక కారణమైతే, డబ్బు సంపాదనే ధ్యేయంగా ఎక్కువ మంది డాక్టర్లు పెద్ద ఆసుపత్రుల్లో తమ సేవలను అందించడం ఇంకో కారణం. దీంతో ఆయా గ్రామాల్లో కానీ, లేదా పట్టణాల్లోని వార్డుల్లో కానీ జీవించే వారికి ఫ్యామిలీ డాక్టర్ అనదగిన వైద్యుని సేవలు పొందే అవకాశం లేకుండా పోయింది.
పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కొద్దో గొప్పో లభిస్తూనే ఉంటాయి. అలాగే వైద్య సౌకర్యాలు ఫరవాలేదు. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు తక్కువ. అలాగే రోగం, రొప్పు వస్తే అర్హత గల డాక్టర్ వైద్య సేవలు మృగ్యం. నాసిరకం మందులు, నాటు మందులు మాత్రమే వారికి లభిస్తాయి. మూఢనమ్మకాలతో కూడిన వైద్యం వారిని కాటేస్తున్నది. నాణ్యమైన వైద్యం కావాలంటే... అప్పుల పాలు కావటమో, ఆస్తులు తాకట్టు పెట్టటమో, నగ నట్రా లేదా ఆస్తులు అమ్ముకోవటమో చేయాల్సి వస్తున్నది.
ముఖ్యంగా స్త్రీలలో ప్రసవ వేదన సమస్యలు, సాధారణ స్త్రీ ఆరోగ్య సమస్యలు; దీర్ఘకాలిక వ్యాధులున్నవారి సమస్యలు, వృద్ధాప్యంలో వచ్చే సహజమైన ఆరోగ్య సమస్యలు, పిల్లల్లో కలిగే రుగ్మతలు, పౌష్టికాహార లోపం వల్ల వచ్చే వ్యాధులు వంటి వాటికి చికిత్స పొందే తాహతు పల్లెల్లో కానీ, పట్టణాల్లో కానీ చాలా తక్కువ మందికే ఉంది. అందుకే ప్రజలందరికీ ఉచిత నాణ్యమైన వైద్యం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు సిద్ధమయింది.
మాటలతో మానసిక భరోసా, అవసరమైన వరకే మందులతో వైద్యం చేసే పరిస్థితి ప్యామిలీ డాక్టర్ విధానంలో ఉంటుంది. నిజంగా ఇది ‘కారుచీకటిలో కాంతి పుంజం’ వంటిదని చెప్పవచ్చు. ‘ఫ్యామిలీ డాక్టర్స్ వ్యవస్థ ఆవిష్కరణ మన రాష్ట్రానికే కాదు దేశానికే, ఆదర్శం, హర్షణీయం. ఇదేదో ప్రభుత్వ ఆకర్షణీయ పథకం అనుకుంటే పొరపాటే! ప్రభుత్వం ప్రజలందరి ఆరోగ్య స్థితిగతుల గురించిన సమాచారాన్ని సేకరించి... తగిన విధంగా వైద్య సేవలను అందచేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి ఈ విధానం ఎంతో ఉపక రిస్తుంది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ, రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకే), వాలంటరీ వ్యవస్థ, నూతన విద్యా విధానాల వైపు దేశం యావత్తూ ఆసక్తికరంగా చూస్తోంది. ఇప్పుడు జగన్ ప్రభుత్వ తీసుకువస్తున్న ‘ఫ్యామిలీ డాక్టర్స్’ విధానం మరింతగా దేశ ప్రజలను ఆకర్షించి మంచి ఫలితాలు పొందడానికి మార్గదర్శకమవుతుంది. ఇంగ్లాండ్‌లో ఈ విధానం ఇప్పటికే అమలులో ఉంది. వైద్యునికి రోగికి మధ్య సత్సంబంధాలు మెరుగుపరచటమే కాక.... సకాలంలో సరియైన రీతిలో ప్రజలకు పెద్దగా ఆర్థిక భారం లేని వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రావడానికి ఈ విధానం దోహదం చేస్తుంది. అందుకే ఈ విధానా నికి ఆహ్వానం పలుకుదాం! ఆరోగ్యకర మైన సమాజాన్ని నిర్మిద్దాం! (క్లిక్ చేయండి: మన మందులు మంచివేనా?)
- అమరనాథ్ జగర్లపూడి
కౌన్సెలింగ్ సైకాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment