రాజధానుల బిల్లు మళ్లీ పెట్టండి! | Andhra Pradesh Three Capitals Bill Put Again in Assembly: Imam Opinion | Sakshi
Sakshi News home page

రాజధానుల బిల్లు మళ్లీ పెట్టండి!

Published Thu, Mar 10 2022 11:03 AM | Last Updated on Thu, Mar 10 2022 11:03 AM

Andhra Pradesh Three Capitals Bill Put Again in Assembly: Imam Opinion - Sakshi

నేడు రాష్ట్రంలో చాలా ఆందోళనకరమైన పరిణామాలు నెలకొన్నాయి. ప్రత్యేకించి ఇటీవల హైకోర్టు... రాజధాని విషయంగా తీర్పునిస్తూ...  అమరావతి ప్రాంతంలోనే రాజ ధానిని కొనసాగించాలని తీర్పు నిచ్చింది. ఈ తీర్పు రాయల సీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు ఆశని పాతం లాంటిది.

1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేశారు. పరిపాలన వికేంద్రీకరణకు ఇంతటి చక్కని ఉదాహరణ మరొకటి లేదు. అయితే అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణతో కలసి 1956లో భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. ఆ సందర్భంలో కర్నూలులోని రాజధానీ, గుంటూరులోని హైకోర్టూ హైదరాబాదుకు మారాయి.

ఇటీవల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవటంతో 1953 నాటి ఆంధ్రరాష్ట్రం తిరిగి పునరావృతం అయింది. విభజన చట్టం ప్రకారం పదేళ్ళపాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా కొనసాగే వీలున్నప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘ఓటుకు నోటు’ కేసు ఒత్తిడిలో హైదరాబాద్‌ ను వదిలి అమరావతికి చేరారు. శివరామన్‌ కమిటీ సిఫారసులను కూడా లెక్కచేయకుండా అమరావతినే రాజధానిగా ప్రకటించారు. ఆ సందర్భంలో  రాయలసీమ వాసుల అభిప్రాయా లను, శ్రీబాగ్‌ ఒప్పందం స్ఫూర్తిని పట్టించుకోకుండా అమరావతినే ఏకపక్షంగా రాజధాని అన్నారు.

చంద్రబాబు ఏకపక్ష నిర్ణయాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ జగన్‌మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. ప్రజల ఆకాంక్షలను గుర్తించి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధీ సమాంతరంగా జరగటానికి... రాజధానిలోనే అన్ని పాలనా వ్యవస్థలను కేంద్రీకరించకుండా... మూడు ప్రాంతాలలో మూడు పాలనా వ్యవస్థ లను ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ ద్వారా సీఎం జగన్‌ చట్టం చేశారు. ఈ ప్రజాస్వామిక  నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలందరూ స్వాగతించారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న మూడు రాజధానుల నిర్ణయం చరిత్రాత్మకమైంది. ఈ విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయకుండా వెంటనే అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును సమగ్రంగా ప్రవేశపెట్టి వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల ప్రయోజనాలు కాపాడాలని కోరుతున్నాం. 

- ఇమామ్‌ 
‘కదలిక’ సంపాదకుడు, అనంతపురం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement