గ్రామీణ భారత్‌లో 3–16 సంవత్సరాల వారి చదువుల మీద వెలువడిన ‘యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు–2022’ (ఏఎస్‌ఈఆర్) ఒక విలువైన నివేదిక. 6–14 సంవత్సరాల మధ్య వయసు విద్యార్థులలో 98.4 శాతం మంది పాఠశాలల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారన్న వాస్తవం ప్రశంసకు అర్హమైనది. అయితే విద్యావంతులైన యువత మాత్రమే సమ్మిళితమైన జాతీయ భద్రతా ఇమేజీని ప్రకాశవంతం చేయగలదు. ఏ అగ్ర రాజ్యమైనా సాంకేతికపరమైన వ్యక్తిత్వం సాధించడానికి అత్యున్నత నాణ్యతతో కూడిన జాతీయ విద్యా విధానం మాత్రమే వీలు కల్పిస్తుంది. ఉనికిలో ఉన్న విద్యావిధానం సాంకేతికంగా సన్నద్ధుడైన సైనికుడి స్వభావానికి ఆచరణీయమైన వ్యవస్థగా ఉంటుందా అనేది పరిశీలనాంశం.
గ్రామీణ భారత్‌లో 3–16 సంవత్సరాల వయో బృందపు విద్యా పరిస్థితిపై సర్వే చేసిన ‘యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు –2022’ (ఏఎస్‌ఈఆర్)ను ఒక విలువైన డాక్యుమెంట్‌గా పేర్కొనాలి. ప్రభుత్వేతర సంస్థ అయిన ప్రథమ్ ఫౌండేషన్‌కు నిజంగానేకృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే ఇది విద్యా రంగంలో అసాధారణ సేవను అందిస్తున్న సంస్థ. జాతీయ సర్వేల శుష్కత్వం, విశ్వస నీయమైన హెచ్‌డీఐ (మానవాభివృద్ధి సూచిక) గణాంకాల దృష్ట్యా చూస్తే, ఈ సమగ్రమైన నివేదికను రూపొందించడంలో ప్రథమ్ ఫౌండేషన్ కీలకపాత్ర పోషించింది. ఏఎస్‌ఈఆర్ సర్వేను చివరిసారిగా 2018లో నిర్వహించారు. కోవిడ్ సంవత్సరాలు కలిగించిన అంతరాన్ని ఈ తాజా నివేదికతో పూరించినట్లయింది.
3–16 సంవత్సరాల వయో బృందంలోని దాదాపు 7 లక్షల మంది పిల్లలను పరిశీలిస్తూ, దేశవ్యాప్తంగా 616 జిల్లాలలో నిర్వహించిన సమగ్ర గృహ సర్వే నుంచి ఏఎస్‌ఈఆర్–2022 నివేదిక రూపొందింది. వరుస క్రమంలో అమర్చనప్పటికీ, కొంత డేటాను ప్రాథమికంగా విశ్లేషణ చేయడం ద్వారా, జాతీయ భద్రత అల్లికకు సంబంధించిన కొన్ని లంకెలను ఇది అందించింది. పైగా వస్తుగత పాలసీ సమీక్ష, చర్చకు ఇది హామీ ఇచ్చింది.
నమోదు పెరిగింది
ఈ రిపోర్టులోని పరిమాణాత్మక బుల్లెట్ పాయింట్లు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి. 6–14 సంవత్సరాల వయసున్న విద్యా ర్థులలో దాదాపు 98.4 శాతం మంది గ్రామీణ భారత్‌లోని పాఠశా లల్లో ఇప్పుడు తమ పేర్లు నమోదు చేసుకున్నారన్న వాస్తవం నిజంగా ప్రశంసకు అర్హమైనది. ఈ ధోరణి సానుకూలమైనది. 2010 లోని 96.6 శాతంతో పోలిస్తే, 2014లో అది 96.7 శాతానికి పెరిగింది. 2018లో 97.2 శాతం నుంచి 2022లో 98.4 శాతానికి చేరడం అంటే విద్యార్థుల నమోదులో సత్వర పెరుగుదలనే ఇది సూచిస్తోంది. అయితే యువ భారతానికి సంబంధించి ఏఎస్‌ఈఆర్–2022 లోని గుణాత్మక అంశం ప్రగాఢ ఆందోళనకు కారణమవుతుంది. ఇది బయట పెట్టిన విషయాలు ఉద్వేగభరితమైన జాతీయవాదం, తప్పుడు ధ్రువీకరణల మిశ్రమంతో దూకుడు ప్రదర్శిస్తూ, ఇప్పుడు తనను తాను విశ్వగురువుగా చెప్పుకొంటున్న దేశానికి అసంగతంగా కనిపిస్తాయి.
భారతదేశంలో విద్య రాష్ట్రాలకు చెందిన అంశంగా ఉంటున్నందున పిల్లలు నేర్చుకునే నైపుణ్యాలు వివిధ రకాలుగా ఉంటాయి. ఈ విషయంలో ఒక ఆసక్తి కలిగించే అంశం మహారాష్ట్రకు సంబంధించినది. తలసరి ఆదాయం, మానవ భద్రతా సూచికల రీత్యా అత్యంత పురోగామి రాష్ట్రాల్లో ఇదొకటి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో గణిత శాస్త్ర నైపుణ్యాలు ప్రమా దకర స్థాయిలో తగ్గిపోతున్నాయని ఈ నివేదిక పేర్కొంది. 2018లో 3వ తరగతిలోని 28 శాతం మంది పిల్లలు మాత్రమే తీసివేతలను చేయగలిగారనీ; 5వ తరగతిలో 31 శాతం పిల్లలు, 8వ తరగతిలోని 41 శాతం పిల్లలు భాగహారాన్ని సంతృప్తికరంగా చేయగలిగారనీ తెలి పింది. అదే 2022లో 3వ తరగతిలో 18.5 శాతం, అయిదో తరగతి పిల్లల్లో 20 శాతం, 8వ తరగతిలో 38 శాతం మంది మాత్రమే వీటిని చేయగలిగారని నివేదిక పేర్కొంది.
ఒక రాష్ట్రం (మహారాష్ట్ర)లో ఈ పతనానికి అనేక అంశాలు కారణం కావచ్చు. బోధనా పద్ధతుల్లో, పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సామర్థ్యాలకు సంబంధించి కోవిడ్ మహమ్మారి కలిగించిన అంతరాయం దీనికి కారణం కావచ్చు. అయితే మరొక వర్గపు డేటా స్ఫూర్తిదాయకం కావచ్చు. ఈ నివేదిక భారతదేశ స్థాయిలో ప్రైవేట్ విద్యాసంస్థల్లోని ధోరణిని ఎత్తిచూపింది. అలాంటి ఎంపిక చేసుకున్న విద్యార్థుల శాతం 26.4 నుంచి 2022లో 30.5 శాతానికి పెరిగింది. ఈ జాబితాలో బిహార్ 71.7 శాతంతో అగ్రస్థానంలో ఉంది. అయితే ప్రైవేట్ చదువులో ఈ పెరుగుదలకు గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, త్రిపుర రాష్ట్రాలు మాత్రం మినహాయింపుగా ఉన్నాయి.
యుద్ధాల తీరు మారుతోంది
భారత్‌లో మొత్తం విద్యాపరమైన సూచిక, జాతీయ భద్రత మధ్య లంకెను రెండు మార్గాలలో సమీక్షించవచ్చు. జనవరి 16న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్రివిధ దళాలకు చెందిన అగ్నివీర్‌ల తొలి బ్యాచ్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త నియామక పథకం ద్వారా మార్గదర్శకులు అవుతున్నందుకు వారికి అభినందనలు తెలిపారు. 21వ శతాబ్దిలో జరుగుతున్న యుద్ధాల తీరు మారిపోతోందనీ, సాంకేతికంగా ముందంజలో ఉన్న సైనికులు మన సాయుధ బలగాల్లో కీలక పాత్ర పోషిస్తారనీ చెప్పారు. ఏఎస్‌ఈఆర్– 2022 అంచనా ప్రకారం, ఉనికిలో ఉన్న విద్యా వ్యవస్థ ప్రధాని మోదీ పేర్కొన్నట్లుగా, సాంకేతికంగా సన్నద్ధుడైన సైనికుడి తరహా స్వభావానికి అత్యంత ఆచరణీయమైన ఎకో సిస్టమ్‌గా ఉంటుందా అనేది పరిశీలనాంశం. అన్ని స్థాయుల్లో భారతీయ సైన్యంలో రిక్రూట్ కావడం అనేది తీవ్రమైన పోటీతో కూడి ఉంటుంది. ఉత్తమమైన, చురుకైన అర్హత కలిగిన వారే యూనిఫామ్ ధరించగలరు. రాబోయే దశాబ్దాల్లో, విద్యావంతులైన యువత మాత్రమే సమ్మిళితమైన జాతీయ భద్రతా ఇమేజీని ప్రకాశవంతం చేయగలదు. దీనికి వ్యతిరేకమైనది ఏమిటంటే, పెరుగుతున్న అవిద్యావంతులైన యువత శాతం; వీరు ఉత్పాదక భారత్ ఆకాంక్షను వెనక్కు లాగడమే. ఇది దేశంలో అంతర్గత భద్రతాపరమైన చిక్కులను కొనితేగలదు. నిరుద్యోగం, నిరాశా నిస్పృహలకు గురైన అఖిల భారత జనాభా సమూహం కచ్చితంగా అత్యంత ప్రమాదకర పరిస్థితిని తెచ్చిపెట్టగలదు.
పరిశోధనా పత్రాల్లో చైనా టాప్
విద్యను జాతీయ భద్రతతో అనుసంధానించే రెండో మార్గం భారతీయ విధాన నిర్ణేతలకు సముచితమైనదిగా ఉంటుందని అమెరికాలోని ఒహాయో స్టేట్ యూనివర్సిటీకి చెందిన విద్యావేత్త కరోలిన్ వాగ్నర్ చేసిన సర్వే ద్వారా అర్థమవుతుంది. 2019లో ఆమె వెల్లడించిన సర్వే ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన 8,422 శాస్త్రీయ పత్రాలను చైనా ప్రచురించింది. కాగా తర్వాతి స్థానంలో అమెరికా 7,959 పత్రాలు, యూరోపియన్ యూనియన్ 6,074 శాస్త్రీయ పత్రాలను ప్రచురించాయి. ఇక 2022లో కృత్రిమ మేధపై అమెరికా పరిశోధకుల కంటే మూడు రెట్లు అధికంగా శాస్త్రీయ పత్రాలను చైనా పరిశోధకులు ప్రచురించారని వాగ్నర్ అధ్యయనం తెలిపింది. పరిశోధన ఎంత నాణ్యతతో జరుగుతున్నదో తేల్చడానికి ఉపకరించే ఉటంకింపుల దృష్ట్యా చూసినా కూడా– అనేక శాస్త్ర సాంకేతిక విభాగాల్లో ప్రచురించిన పత్రాల్లో చైనా పరిశోధకులు టాప్ 1 శాతంతో అగ్రస్థానంలో ఉంటున్నారు.
20వ శతాబ్దిలో కీలకమైన దేశ సమ్మిళిత సైనిక సామర్థ్యాన్ని..
దృఢమైన జాతీయ పరిశోధన, అభివృద్ధి, పారిశ్రామిక, వస్తూత్పత్తి పునాది నిర్ణయించిందని భావిస్తున్నారు. అయితే ప్రస్తుత యుగంలో ఏ ప్రముఖ అగ్రరాజ్యమైనా సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కో వాల్సి ఉంటుంది. వాటితో వ్యవహరించేందుకు అవసరమైన సాంకే తికపరమైన వ్యక్తిత్వం సాధించడానికి అత్యున్నత నాణ్యతతో కూడిన జాతీయ విద్యా విధానం మాత్రమే వీలు కల్పిస్తుంది. అందుకే భారత్ ముందు కఠిన ప్రయాసతో కూడిన మార్గం ఉందని ఏఎస్‌ఈఆర్– 2022 సర్వే ఎత్తి చూపింది.
వ్యాసకర్త సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్
(‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment