చండ్ర పుల్లారెడ్డి
దేశం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచ ఆకలి సూచిలో దయనీయ స్థానంలో దేశం కనిపిస్తోంది. ప్రజాస్వామ్యం పేరిట నోట్లస్వామ్యం, రాజకీయాల్లో మతోన్మాదం రాజ్యమేలుతున్నాయి. పాలక పక్షం ప్రతిపక్షాల్ని సైతం తొక్కిపడ్తూ కాళ్లు, చేతులు ఆడనివ్వడం లేదు. అధికారం అనేది నియంతృత్వానికి సోపానమవుతుండగా విప్లవ ప్రతి పక్షం రోజూ నెత్తురోడుతున్నది. ప్రత్యామ్నాయ రాజకీయ విశ్వాసాలు సైతం బందీ అవుతున్నాయి.
ప్రత్యామ్నాయ ప్రజా ప్రతిపక్షం అంతా ఒక శక్తిగా ముందుకొచ్చే తరుణంలో నవంబర్ మాసానికి ఒక ప్రత్యేకత ఉన్నది. విప్లవ శక్తుల ఐక్యతా కృషిలో నిమగ్నమై ఉన్న కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 1984 నవంబర్ 9న కలకత్తాలో గుండె పోటుతో అమరులయ్యారు.
1917లో కర్నూలు జిల్లా వెలుగోడు గ్రామంలో జన్మించిన చండ్రపుల్లారెడ్డి భూస్వామ్య కుటుంబ వారసత్వాన్ని కాలదన్నాడు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో గెలిచిన బూర్జువా శాసన సభ్యత్వ హోదాను త్యజించి, 50వ ఏట గోదావరిలోయ అడవిలోకి అడుగుపెట్టాడు. 66వ ఏట ఉద్యమంలోనే చివరిశ్వాస వదిలాడు.
ఇదే మాసంలో విప్లవ సింహంగా పేరుగాంచిన కామ్రేడ్ పొట్ల రామనర్సయ్య, విప్లవ ఉపాధ్యాయుడు నీలం రామచంద్రయ్య, విప్లవ విద్యార్థి నాయకుడు జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, విప్లవ నాయకురాలు రంగవల్లి, కిషన్‌జీలతో పాటు ఎందరో తమ అమూల్యమైన ప్రాణాలర్పించారు. సామాజిక విప్లవకారుడు జ్యోతిబా పూలే నవంబర్ 26న అమరులైనారు. వీరంతా ఒక మనిషిని వేరొక మనిషి దోపిడి చేయని సమాజం కావాలన్నారు. వారందరికీ విప్లవ జోహార్లు అర్పిస్తూ జరిగే సంస్మరణ సభను జయప్రదం చేయాలని కోరుతున్నాము.
– డేగల రమ, (రుద్రారం) తెలంగాణ
– రమణారెడ్డి, (బొల్లవరం) ఏపీ అమరుల స్మారక కమిటీ
(నేడు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంస్మరణ సభ)
Comments
Please login to add a commentAdd a comment