![Covid-19 3rd Wave Economy Set To Become Major Challenge Central-State Government - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/17/Covid-19.jpg.webp?itok=JjXces6h)
ఆర్థికవ్యవస్థపై కోవిడ్–19 మహమ్మారి థర్డ్ వేవ్ ప్రభావాన్ని ఎదుర్కోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెను సవాలుగా మారనుంది. కాంట్రాక్ట్ లేబర్‌ని ఎక్కువగా కొనసాగించే రంగాలు ఇప్పటికే ప్రమాదకర పరిస్థితుల్లో కూరుకుపోతున్నాయి. మరోవైపున నెలవారీ జీఎస్టీ రాబడులు గత ఆరునెలలుగా లక్ష కోట్ల రూపాయలకు పైనే వసూలు కావడం, విదేశీ మారక చెల్లింపు నిల్వలు రికార్డు స్థాయికి చేరుకోవడం, ఎగుమతులు పుంజుకోవడం వంటి అనేక సానుకూల ఆర్థిక సూచికలు ఈ 2022వ సంవత్సరంలో దేశాన్ని ముందుకు తీసుకుపోవచ్చు. అయితే ఈ సానుకూలతల మధ్యన కూడా కొనసాగుతున్న ఇతర ఆర్థిక దౌర్బల్యాలు మన అభివృద్ధి చట్రాన్ని వెనక్కు లాగే ప్రమాదముంది. నిరుద్యోగితా రేటు, పెరుగుతున్న చమురు ధరలు, ద్రవ్యోల్బణపు ఒత్తిళ్లు అనేవి... ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ ప్రయత్నాలకు గండి కొట్టే అవకాశం ఉంది.
రాబోయే నెలల్లో మన ఆర్థిక వ్యవస్థ వరుస సవాళ్లను ఎదు ర్కొంటుందనడంలో సందేహమే లేదు. మహమ్మారి కారణంగా ఉత్పన్నమైన ఆర్థిక మాంద్యం నుంచి దేశం బయట పడుతున్నట్లు కనిపిస్తుండగా, ఆర్థిక వ్యవస్థకు తొలి సవాలు ఇప్పటికే ఎదురవడం చూస్తున్నాం. దేశం కోలుకుంటున్న ప్రక్రియను శక్తిమంతంగా అడ్డు కునేలా కొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ దూసుకొచ్చింది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకుంటున్న పరిస్థితులు తగ్గుముఖం పట్టి, దాని పునరుద్ధరణ ప్రక్రియ అసమాన స్థితిలోకి వెళుతుండటం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే కొత్త వేరియంట్ లక్షణాలు ప్రమాదకరం కాదనీ, గతంలోని డెల్టా రకంతో పోలిస్తే ఒమిక్రాన్ దశలో ఆసుపత్రుల పాలయ్యేవారి సంఖ్య, మర ణాల సంఖ్య తక్కువగా ఉంటుందనీ నిపుణులు హామీ ఇస్తున్నారు. కానీ చాలామంది ప్రజలతోపాటు ప్రత్యేకించి ఆరోగ్య సిబ్బంది కూడా ఒమిక్రాన్ ప్రభావానికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉన్నందున, వైద్య మౌలిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదముంది. దేశవ్యాప్తంగా సెలవుల్లో అసంఖ్యాకంగా ప్రజలు మార్కెట్లకు పోటెత్తుతుండడం చూస్తున్నప్పుడు ఆందోళన కలుగకమానదు.
కోవిడ్–19 మహమ్మారి థర్డ్ వేవ్ రూపంలో ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, మున్ముందు ఇది తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది. ఆర్థికవ్యవస్థపై దాని తక్షణ ప్రభావాన్ని ఎదుర్కోవడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ 2022వ సంవత్సరంలో కీలక సవాలుగా మార నుంది. «థర్డ్ వేవ్ ఇప్పటికే తొలి దెబ్బ తీసింది. లక్షలాది మంది ఉద్యో గులను నియమించుకునే రెస్టారెంట్, హోటల్ పరిశ్రమ మరో సారి తిరోగమన బాట పట్టాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి పూర్వ స్థాయిని ఇప్పుడిప్పుడే అందుకుంటున్న విమానయాన రంగం మళ్లీ టేకాఫ్‌కు నోచుకోని పరిస్థితిని ఎదుర్కొంటోంది. నియత, అనియత రంగంలో విస్తృతంగా ఉంటున్న ఆతిథ్య రంగం స్పష్టంగా నిరాశా జనకమైన భవిష్యత్తును ఎదుర్కొంటోంది.
2020 మార్చి నెల నుంచి మహమ్మారి ధాటికి బాగా పెరిగి పోయిన నిరుద్యోగ సమస్య మళ్లీ సమాజాన్ని అతలాకుతలం చేయ నుంది. కోవిడ్ వైరస్ దాడి చేయకముందే చాలా రంగాల్లో ఉపాధి అవకాశాలు నిరాశను కలిగించే స్థాయికి చేరుకున్నాయి. అప్పట్లో లాక్ డౌన్ తర్వాత ఇది తీవ్ర సంక్షోభంగా మారిపోయింది. గత ఏడాది డిసెంబర్ నాటికి దేశంలో నిరుద్యోగ రేటు నాలుగు నెలల్లో అత్యధిక స్థాయికి, అంటే 7.9 శాతానికి పెరిగిందని భారత ఆర్థికరంగా పర్య వేక్షణా కేంద్రం (సీఎమ్‌ఐఈ) తాజా డేటా పేర్కొంది. ఇంత సంక్షోభ సమయంలోనూ ఆశలు రేపే విషయం ఏమిటంటే, ఉపాధి కల్పనకు సంబంధించి పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాలు మెరుగ్గా కొనసాగాయి. అయితే చాలామంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి ఉపాధి పథకాలపైనే ఆధారపడటంతో గ్రామీణ ఉపాధి రంగంలో నాణ్యత పేలవ స్థాయిలోనే కొనసాగింది. మరో మాటలో చెప్పాలంటే పట్టణ ప్రాంతాల్లో మెరుగైన ఉపాధి అవ కాశాలు తగ్గి పోతుండగా, అనిపుణ రంగంలో ఎక్కువగా ఉపాధి అవశాలు లభిస్తున్నాయని సీఎమ్‌ఐఈ డేటా చెబుతోంది.
చేదు వాస్తవం ఏమిటంటే దేశంలోని ఉపాధి అవకాశాల్లో అత్యధిక భాగం అసంఘటిత రంగంలో ఉండటమే! 2020వ సంవ త్సరంలో లాక్ డౌన్ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోని తమ స్వస్థ్థలాలకు వెళ్లిపోయిన వలస కార్మికుల్లో చాలామంది, పట్టణ ప్రాంతాల్లో పని చేయడానికి తిరిగి రాలేదు. సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి ఆయా సంస్థలు సిబ్బందిని నియమించుకునే విషయమై ఊగిసలాడుతున్నం దున తగినంతమంది కార్మికులు అందుబాటులో లేకుండా పోయారు. కరోనా మహమ్మారి సమయాల్లో కంటే పరిస్థి తులు ఇప్పుడు మెరుగ్గా ఉన్నాయని, పలు ఆర్థిక సూచికలను ప్రస్తావిస్తూ పేర్కొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉపాధి అవకాశాల గురించి మాత్రం ప్రస్తావించలేదు. వాస్తవానికి, నిరుద్యోగితా స్థాయులను గణనీయంగా తగ్గించనంతవరకు, సామాజిక నిచ్చెన చివరి మెట్లపై నిలుచున్న వారిని ఉపాధి రాహిత్యం వెంటాడుతూనే ఉంటుందని గ్రహించాలి.
అంతర్జాతీయ చమురు ధరల పెంపుదల ఎంతో ఆందోళనను కలిగిస్తోంది. బెంచ్ మార్క్ అయిన బ్రెంట్ ముడి చమురు గత అక్టోబర్‌లో బ్యారెల్‌కు 86 డాలర్ల మేరకు పెరిగి ఆర్థిక వ్యవస్థకు చుక్కలు చూపించింది. చమురు వినియోగంలో 80 శాతం వరకు దిగు మతులపైనే మన దేశం ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ఒమి క్రాన్ భయాల కారణంగా చమురు ధర కాస్త తగ్గుముఖం పట్టినట్లు మార్కెట్ సంకేతాలు చూపుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు ప్రస్తుతానికి ప్రమాదకరంగా కనిపించనప్పటికీ వైరస్ బారిన పడు తున్న వారి సంఖ్య పెరిగి పోతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇది తక్షణం విచ్ఛిన్నపరచకపోవచ్చు కానీ చమురు ధరలు మాత్రం మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఇటీవలి నెలల్లో అధికంగా పెరిగిన చమురు ధరలు దేశ కరెంట్ అకౌంట్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి.
గత జూలై నుంచి సెప్టెంబర్ వరకు రెండో త్రైమాసికంలో ఇది మిగులు నుంచి లోటుకు దారితీసింది. అంతకు ముందటి త్రైమాసికంలో మన వాణిజ్య లోటు 30.7 బిలియన్ డాలర్ల నుంచి 44.4 బిలియన్ డాలర్లకు పెరగడమే దీనికి కారణం. ఇలా లోటు పెరగడం అనేది తక్షణం ప్రమాదకరం కాకపోవచ్చు. ఎందుకంటే చమురేతర దిగుమతుల పెరుగుదల కారణంగా ఆర్థిక వ్యవస్థ కాస్త ఉత్తేజితమైంది. అయితే చమురు దిగుమతుల వ్యయంలో పెరుగుదల కొనసాగుతుండటం సమస్యా త్మకమే అవుతుంది. ప్రత్యేకించి వ్యాక్సినేషన్లు, మౌలిక సౌకర్యాల కల్పనలో, గ్రామీణ ఉపాధి పథకాల్లో పెట్టుబడులు వంటి కీలక రంగాలకు ప్రభుత్వ ఆదాయాన్ని కేటాయించాల్సి ఉన్న సమయంలో... చమురు దిగుమతుల వ్యయం పెరగడం దేశానికి క్షేమకరం కాదు.
వినియోగదారీ ధరల సూచీ పైపైకి ఎగబాకుతున్నందున, ప్రపంచ చమురు ధరలు పెరుగుతున్న వేళ ద్రవ్యోల్బణపు ఒత్తిళ్లు మరింతగా ఎక్కువవుతాయి. మన విధాన నిర్ణేతలు పరిష్కరించాల్సిన మరొక పెను సవాలు ద్రవ్యోల్బణమే. అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఇప్పటికీ అస్థిరంగా ఉంటున్నందున చమురు ధరల పెంపుదల వల్ల మరింతగా పెరగనున్న ధరలను నిర్వహించడం కష్టమే. ద్రవ్యోల్బణానికీ, వృద్ధిని ప్రోత్సహించడానికీ మధ్య సమ తౌల్యం సాధించాల్సిన అవసరం రిజర్వ్ బ్యాంక్‌ను అనిశ్చితిలోకి నెడు తోంది. అనేక దేశాల్లో బ్యాంకులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొం టున్నాయి. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ద్రవ్యోల్బణం ఇప్పుడు కనీవినీ ఎరుగని స్థాయులకు చేరడం గమనార్హం. దీనివల్ల సరళీకృత ద్రవ్య విధానాలు అంపశయ్య ఎక్కే పరిస్థితి ఉంటుంది.
అయితే 2022లో కొన్ని సానుకూల ఆర్థిక సూచికలు దేశాన్ని ముందుకు తీసుకుపోయే సూచనలు కనబడుతున్నాయి. నెలవారీ జీఎస్టీ రాబడులు గత ఆరునెలలుగా ప్రతినెలా లక్ష కోట్ల రూపాయలకు పైనే వసూలవుతున్నాయి. పైగా మన విదేశీ మారక చెల్లింపు నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత ఆరునెలల్లో పదివేల అంకుర సంస్థల ఆవిర్భావంతో దేశీయ ఎగుమతులు బాగా పుంజు కున్నాయి. అదే సమయంలో... ఇన్ని సానుకూలతల మధ్యన కూడా కొనసాగుతున్న ఇతర ఆర్థిక దౌర్బల్యాలు మన అభివృద్ధి చట్రాన్ని వెనక్కు లాగే ప్రమాదముంది. కాంట్రాక్ట్ లేబర్‌ను ఎక్కువగా కొనసా గించే విభాగాల్లో మందకొడితనానికి కారణమవుతున్న నిరుద్యోగితా రేటు, పెరుగుతున్న చమురు ధరలు, ద్రవ్యోల్బణపు ఒత్తిళ్లు అనేవి... ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ ప్రయత్నాలకు, ప్రజారాశుల సంక్షేమాన్ని మెరుగుపర్చడానికి గండి కొడతాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండా ల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– సుష్మా రామచంద్రన్, సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment