సామాజిక న్యాయానికి బీసీ జనగణన | Demands To Form BC Ministry At Center And BC Population Census | Sakshi
Sakshi News home page

సామాజిక న్యాయానికి బీసీ జనగణన

Published Fri, Nov 18 2022 1:35 AM | Last Updated on Fri, Nov 18 2022 1:35 AM

Demands To Form BC Ministry At Center And BC Population Census - Sakshi

భారత సమాజం కులాల దొంతర అన్న సంగతి తెలిసిందే. ఈ దొంతరలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని ఆదిమ తెగలవారూ, అసలు మనుషులుగా గౌరవం పొందని హిందూ సామాజిక బహిష్కృత ఎస్సీలూ అట్టడుగున ఉంటే... అటు ఓసీలలా గౌరవానికి నోచుకోనివారూ, ఇటు ఎస్సీల్లా మరీ తక్కువ చూపుకు గురికాని బీసీలు మధ్యస్తరంలో ఉన్నారు. దేశ జనాభాలో వీళ్లశాతం సగం కన్నా ఎక్కువే. వీరంతా సంప్రదాయ వృత్తులను అనుసరిస్తూ దేశ సంపద సృష్టిలో ప్రధాన పాత్ర వహిస్తున్నారు.
విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో అణగారిన, వెనుక బడిన వర్గాలకు ప్రభుత్వాలు రిజర్వేషన్‌ కల్పించినా... జనాభా దామాషా ప్రకారం ఆయా కులాల వారికి అందడం లేదనేది ఒక ప్రగాఢమైన విశ్వాసం రిజర్వేషన్‌ పొందుతున్న వర్గాల్లో ఉంది. మరీ ముఖ్యంగా బీసీల్లో ఈ అభిప్రాయం ఉంది.  తాము దేశ జనాభాలో ఎంతమందిమి ఉన్నామో తెలిస్తే... ఆ నిష్పత్తిలో రిజర్వేషన్లు పొందవచ్చని వారు భావిస్తున్నారు. అందుకే  బీసీ జన గణన జరగాలని వారు కోరుకుంటున్నారు. ఇప్పటికే చాలా సార్లు ఈ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టినా అది పట్టించుకోవడం లేదు. దీంతో అనేక రాష్ట్రాల్లో బీసీ జనాభాను లెక్కించాలనీ, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనీ కోరుతూ ఉద్యమాలు రగులుకుంటున్నాయి. 

బీసీ జనగణన చేయమని అడిగితే పట్టించుకోని కేంద్ర ప్రభుత్వంపై దీర్ఘకాలిక ఉద్యమం చేయక తప్పని స్థితి వచ్చింది. ఈ ఉద్యమం దేశ చరిత్రలోనే మరో శాంతియుత బీసీల హక్కుల సాధన జాతీయ ఉద్యమంగా కొనసాగాలి. అది ఏ విధంగా అంటే 14 ఏళ్లు శాంతియుతంగా కొనసాగిన మలిదశ తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమ నమూనాలో కొనసాగాలి. వ్యవసాయరంగాన్ని రక్షించుకోవడానికి ఇటీ వల జరిగిన శాంతియుత రైతాంగ ఉద్యమ రూపం ధరించాలి.  

రిజర్వేషన్‌ శాతాన్ని పెంచాలని తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం భావించి ముస్లింలకు 12 శాతం, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఉండాలని ప్రతిపాదిస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ తీర్మానం పంపి ఇప్పటికి సరిగ్గా ఆరేళ్లు అవుతోంది. కేంద్రం ఇప్పటికీ పెదవి విప్పటం లేదు. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ నేతృత్వంలోని బిహార్‌ ప్రభుత్వం బీసీ జనగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకుని కేంద్రానికి పంపింది. హేమంత్‌ సొరేన్‌ నేతృత్వంలోని జార్ఖండ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 60 శాతం నుంచి 77 శాతానికి రిజర్వేషన్లు పెంచాలనే చట్టసవరణ బిల్లును  అసెంబ్లీ ఆమోదించింది. రిజర్వేషన్ల పెంపుకోసం రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో మార్పులు చేయాలని కేసీఆర్‌ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. తమిళనాడు తరహాలో తెలంగా ణకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఇలా రిజర్వేషన్ల శాతం పెరిగినప్పుడే జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి దక్కుతుంది. 

రాజ్యాంగంలోని 340 ఆర్టికల్‌ను అనుసరించి భారత దేశంలో ప్రప్రథమంగా 1953 జనవరిలో కాకా కాలేల్కర్‌ నేతృత్వంలో వెనుకబడిన తరగతుల కమిషన్‌ను నియ మించడం జరిగింది. ఇది 1955లో తన నివేదికను సమ ర్పిస్తూ దేశంలో 2399 కులాలను వెనుకబడిన కులాలుగా అందులో 837 కులాలను అత్యంత వెనుకబడిన కులాలుగా గుర్తించి కొన్ని సిఫార్సులు చేసింది. అయితే ప్రభుత్వం ఈ కమిషన్‌ చేసిన సిఫార్సులను తిరస్కరించింది.

కేంద్ర ప్రభుత్వం 1979లో బి.పి. మండల్‌ నేతృత్వంలో రెండవ బీసీ కమిషన్‌ను ఏర్పాటుచేయడం జరిగింది. ఈ కమిషన్‌ బీసీల జనాభాను 52 శాతంగా లెక్కకట్టి వీరికి విద్యా ఉద్యోగ రంగాల్లో 27 శాతం రిజర్వేషన్లను కల్పించాలని 1980లో నివేదిక సమర్పించింది.   అయితే, ఈ సిఫారసులు 1992 నుండి మాత్రమే అమలులోకి వచ్చాయి. 2017 అక్టోబర్‌లో జస్టిస్‌ రోహిణి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్‌ను నియమించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాను వర్గీకరించడం ఈ కమిషన్‌ ముఖ్య విధి. ఇప్పటికి ఈ కమిషన్‌ గడువును 13 సార్లు పొడిగించడం జరిగింది. ఇంతవరకు ఈ కమిషన్‌ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించలేదు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత బి.ఎస్‌. రాములు నేతృత్వంలో నియమించబడ్డ తొలి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ ఏప్రిల్‌ 2017లో ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తూ, బీసీ–ఇ గ్రూప్‌లో ఉన్న ముస్లింలలోని కొన్ని వెనుకబడిన వర్గాలకు అందించబడుతున్న రిజర్వే షన్లను 4 శాతం నుండి 10 శాతానికి పెంచాలని సిఫారసు చేయడం జరిగింది. ఈ సిఫారసులను ప్రభుత్వం అంగీక రిస్తూనే, సుధీర్‌ కమిషన్, ఇతర నివేదికలను అనుసరించి వీరికి రిజర్వేషన్లను పన్నెండు శాతానికి పెంచుతూ  నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2019లో ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్‌ మరో నివేదిక సమర్పిస్తూ... సంచార, అర్ధ సంచార జాతులకు చెందిన 17 కులాలను తెలంగాణ రాష్ట్ర బీసీ జాబితాలో చేర్చాలని సిఫారసు చేయడం జరిగింది. ఈ సిఫారసులను కేసీఆర్‌ క్యాబినెట్‌ యధాతథంగా ఆమోదించి అమలుచేయడం జరిగింది.

2011లో జరిగిన సామాజిక ఆర్థిక కులగణన వివరాలు ఉన్నాయని చెప్పిన కేంద్రం ఆ వివరాలు ఎందుకో బైట పెట్టకుండా దాటవేసింది. దేశంలో సగానికి పైగా జనాభా వున్న బీసీల విషయంలో కేంద్రం లెక్కలేనితనం చూపడం దారుణమైనది. దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారు? వీళ్ల ఆర్థిక స్థితి గతులేమిటి? వీరి చదువులు ఎలా వున్నాయి? వీరి ఉద్యోగ అవకాశాలేమిటి? వీరింకా దారిద్య్ర రేఖకు దిగువన ఉండటానికి కారణాలు ఏమిటి? బీసీలలో ఇంకా సంచారజాతులుగా వున్న వారి దీనస్థితికి విముక్తి ఎప్పుడు? ఈ సమాచారం లేకుండా దేశాభివృద్ధికి వ్యూహాలు రచించడం కష్టం. అందుకే బీసీ జన గణన అత్యంతావశ్యం. 

జూలూరు గౌరీశంకర్‌, వ్యాసకర్త చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement