‘‘మన అన్నల చంపిన
మన చెల్లెళ్ల చెరిచిన
మానవాధములను మండలాధీశులను
మరిచిపోకుండగ గుర్తుంచుకోవాలె
కాలంబురాగానె కాటేసి తీరాలె
పట్టిన చేతులను పొట్టులో బెట్టాలె
తన్నిన కాళ్లను దాగలిగ వాడాలె...’’
ఏ దృశ్యం ఈ కవిత చెప్పటానికి కాళోజీ కలాన్ని కదిలించింది! ఏ భావం కాళోజీ కన్నీళ్లను కరిగించి అక్షరాలుగా మార్చింది! అదే 1948లో జరిగిన రజాకార్ల స్వైరవిహారం. ఒక్క కాళోజీనే కాదు; యావత్ తెలంగాణ ప్రజలందరి గుండెల నుండి అగ్గిరవ్వలు రేపిన దుశ్చర్య! రజాకార్ మూకల దాడులనెదుర్కోవడానికి సమాయత్తమైన ఈ పోతుగడ్డ ప్రజల ధైర్యసాహసాలు వేనోళ్లా్ల పొగడవచ్చు. విధి వక్రించినా, చరిత్ర తమను గుర్తించకున్నా ఉక్కుమనిషి పటేల్ రూపంలో రక్షణ కవచం దొరికింది. అదే దక్కను పీఠభూమి ప్రజలకు భరతమాత ఒడిలో వాలే అవకాశం దక్కినరోజు. అదే సెప్టెంబర్ 17, 1948.
క్రీ.శ.1656లో బతుకుదెరువు కోసం ఖులీజ్ ఖాన్ టర్కీలోని బోఖరా నుండి భారత్‌కు వచ్చాడు. నాటి మెుఘల్ పాలకుడైన షాజహాన్ కొలువులో చేరాడు. అతని మనుమడే ఖుమ్రుద్దీన్. ‘నిజాముల్ ముల్కు’ అనే బిరుదు పొందాడు. వీళ్ళ వంశం ఆసఫ్‌జాహి. ఆ తర్వాత ఔరంగజేబు పాలనలోకి వచ్చాక దక్కన్ ప్రాంతానికి సుబేదార్లుగా, ఔరంగజేబు మరణం తర్వాత 1724లో దక్కన్ నవాబులయ్యారు. ఈ నవాబుల్లో చివరివాడు, ఏడవవాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్. కొందరు పేర్కొన్నట్లు నవాబు అభివృద్ధి కారకుడైతే, పరమత సహనం కలవాడైతే భాగ్య (భాగ్) నగరం హైదరాబాద్‌గా, భాగీరథి మహ్మద్‌బీగా, భాగమతి హైదర్బీగా ఎందుకు మారాయో చరిత్రలో ఎవ్వరూ జవాబు చెప్పలేకపోయారు.
1927లో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఏర్పడింది. 1937లో మతపరివర్తన ఉద్యమం ‘తబ్లీగ్’ ప్రారంభించింది. సంస్థానంలోని హరిజనులకు భూములు, ఆర్థిక స్థిరత్వం కల్పిస్తామని మత మార్పిడి చేశారు. బహదూర్ యార్ జంగ్ మరణం తర్వాత మజ్లిస్ అధ్యక్ష పదవి ఖాసీంరజ్వీకి లభిం చింది. రజాకార్ అనే మాటకు వాలంటీర్ అని అర్థం. సేవా దృక్పథం ఉండాల్సిన రజాకార్లు, వారి అధ్యక్షుడు పరమత సహనం కోల్పోయారు.
1947లో దేశమంతా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకొంటుంటే ఈ నైజాం ప్రాంతంలో బతుకమ్మ పండుగ మెుదలైంది. వాడీ స్టే్టషన్ దాటిన రైలును ఆపి అందులో స్త్రీలను దించి, ట్రక్కుల్లో ఎక్కించారు. గాండ్లాపూర్ సమీపంలోని ఠాణాకు తీసుకెళ్ళి వాళ్ళను వివస్త్రల్ని చేసి లాఠీలతో కొడుతూ బతుకమ్మ ఆడించారు. ఈ దురాగతాల్ని నెహ్రూ 1947 సెప్టెంబర్ 7న నిరసించారు. హైదరాబాద్ సమీపంలో అమీర్‌పేట గ్రామంలోకి మహమ్మద్ అస్లం, మహ్మద్ కరీం అనే రజాకార్లు ప్రవేశించారు. స్త్రీల ముక్కుపుడకలను లాగి వాళ్ళు బాధపడుతుంటే ఆనందించారు. సైదాబాద్‌లో 15 మంది స్త్రీలను మానభంగం చేశారు. ఆనాటి పంజగుట్ట గ్రామంలో భర్తల ఎదుట తల్లీ కూతుళ్ళపై ఖాదర్‌జిలాని, సికిందర్‌ఖాన్, అబ్దుల్ జబ్బార్ అనే నాయకుల నేతృత్వంలో క్రూరమైన అత్యాచారం జరిగింది. ఈ దుస్సంఘటల్ని ఖండిస్తూ ఇమ్రోజ్ పత్రికలో పుంఖానుపుంఖాలుగా వార్తలొచ్చాయి. వాటిని రాసిన షోయబుల్లాఖాన్‌ను కిరాతకంగా రజాకార్లు హత్య చేశారు. ఈ హత్య తర్వాత నెహ్రూ మేల్కొన్నారు. విద్యార్థులు, రైతులు నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి నేతృత్వంలో భారత సైన్యాన్ని హైదరాబాద్‌కు తరలించారు వల్లభ్‌భాయ్ పటేల్. 1948 సెప్టెంబర్ 13న సైన్యం దిగింది. మూడు రోజులు ఎదిరించిన అనంతరం నిజాం సైన్యం చేతులెత్తేసింది. ఎలాంటి రక్తపాతం జరక్కుండానే సెప్టెంబర్ 17న నిజాం తలవంచాడు.
ఏ జాతి తమ చరిత్ర లోతుపాతులను విస్మరించి కరదీపిక లేకుండా ప్రయాణం చేస్తుందో, ఆ జాతి త్వరలోనే ధ్వంసం అవడం ఖాయం అంటాడో చరిత్రకారుడు. మసిపూసి మారేడు కాయ చేసి కొందరి పట్ల ‘రాగం’, మరికొందరి పట్ల ‘ద్వేషం’ కల్గించే పక్షపాతుల చేతుల్లో చరిత్ర పడితే? సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినంపై కూడా అలాంటి ఎర్రమబ్బులు కమ్ముకొన్నాయి. నరకుణ్ణి చంపిన రోజును దీపావళిగా జరుపుకొనే సంస్కృతిని ఏమార్చి, ‘నరకాసురుడు’ నాయకుడు అనడానికి అలవాటుపడ్డ చారిత్రకులకు ఈ దేశంలో కొదవలేదు. ‘‘నా సిద్ధాంతాన్ని అగ్నిలో వేసి పరీక్షించుకోవచ్చు’’ అని గౌతమబుద్ధుడు చెప్పినట్లే మనమూ సరైన చరిత్రను సమాజం ముందు పెట్టి క్షీరనీర న్యాయం కోరుకుందాం! (రేపు తెలంగాణ విమోచన దినం)
వ్యాసకర్త: డా.పి. భాస్కరయోగి, ప్రముఖ రచయిత, కాలమిస్టు
మొబైల్ : 99120 70125
విమోచన మీద కమ్ముకున్న మబ్బులు
Published Wed, Sep 16 2020 2:06 AM | Last Updated on Wed, Sep 16 2020 2:06 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment