జెండా ఊంచా రహే హమారా! | Har Ghar Tiranga Celebrations For 75 Years Of Independence | Sakshi
Sakshi News home page

జెండా ఊంచా రహే హమారా!

Published Tue, Aug 2 2022 1:01 AM | Last Updated on Tue, Aug 2 2022 4:35 AM

Har Ghar Tiranga Celebrations For 75 Years Of Independence - Sakshi

జెండా అనేది మన గుర్తింపు. నాగరికత పుట్టినప్పటినుంచే అవి మన అస్తిత్వంలో ప్రధాన పాత్రను పోషించాయి. భారతదేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తవుతున్న అద్భుతమైన సందర్భంలో ఉన్నాం. జెండాలతో భావోద్వేగ బంధాన్ని ఏర్పర్చే లక్ష్యంతో ‘హర్‌ ఘర్‌ తిరంగా’ (ఇంటింటికీ మువ్వన్నెల జెండా) కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దేశవ్యాప్తంగా జెండాలు పంపిణీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. త్రివర్ణ పతాకాన్ని ఇంటిపై రెపరెపలాడించడం ద్వారా భారతీయులందరిలోనూ జాతీయవాద భావన మేల్కొల్పాలనేది ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. అప్పుడే దేశమంతా ఒకే తాటిపైకి వస్తుంది. జాతి నిర్మాణంలో మనమంతా భాగస్వాములు కావాలనే స్ఫూర్తి రగులుతుంది. 

మహాభారతంలో దుర్యోధనుడి పరాజయంతో కురుక్షేత్ర యుద్ధం ముగుస్తుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడి రథానికి కట్టిన గుర్రాలను విడిపించి, ఆ రథం నుంచి అర్జునుడిని దూరంగా తీసుకెళ్తాడు. అదే సమయంలో, కురుక్షేత్ర యుద్ధం ఆసాంతం అర్జునుడి రథానికి పైభాగంలో రక్షణ కవచంలా ఉన్నటువంటి హనుమంతుని చిత్రం పతాకం నుంచి మాయమైపోతుంది. ఆ మరుక్షణమే రథం ఒక్క సారిగా నిప్పులు చిమ్ముతూ పేలిపోతుంది. ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడిని ఉద్దేశిస్తూ జగన్నాథుడు, ‘యుద్ధంలో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి మహామహులు నీపై వినియో గించిన శక్తిమంతమైన అస్త్రాలతో నీ రథం ఎప్పుడో తునాతునకలు అయి ఉండేది. కేవలం నీ రథం మీద ఉన్న జెండాపై కపిరాజే నీకు నిరంతరం రక్షగా నిలిచాడు’ అని చెబుతాడు.

నాగరికత పుట్టినప్పటినుంచే మన అస్తిత్వంలో, మన రక్షణలో జెండాలు పోషించిన పాత్రను తెలియజేసే ఉదాహరణలు ఎన్నో చెప్పుకోవచ్చు. వివిధ సందర్భాల్లో ప్రజలు తమ విధేయతను చాటు కునేందుకు కూడా పతాకాలు ఎంతో ఉపయుక్తం అయ్యాయి. మన ధర్మాన్నీ, మన ఆచార వ్యవహారాలనూ ఈ పతాకాలు ప్రతిబింబి స్తాయి. కార్తికేయుడు సేవల్‌ కోడి పతాకాన్ని వినియోగించడం, రాముడు లంకానగరంపై యుద్ధానికేగినపుడు సూర్యపతాకాన్ని వాడటం, త్రేతాయుగంలో యుధిష్ఠిరుడు బంగారు వర్ణంలోని చంద్రుడి జెండాను వినియోగించడం మొదలుకుని... ఒడిశాలోని పరమ పవిత్రమైన పూరిలోని జగన్నాథాలయంలో వాయుదిశకు వ్యతిరేకంగా రెపరెపలాడే పతాకం (పతితపాబన్‌ బనా) వరకు యుగయుగాలుగా పతాకాలు మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైపోయాయి. 

1947 జూలై 22న రాజ్యాంగ సభ మన జాతీయ పతాకానికి ఆమోదం తెలిపింది. మన తెలుగువాడైన పింగళి వెంకయ్య  రూపొం దించిన జాతీయ పతాకానికి 1921లో మహాత్మా గాంధీ ఆమోదం తెలిపారు. వివిధ మార్పులతో 1947లో త్రివర్ణ పతాకంగా రూపు దిద్దుకుంది. ఇవాళ మనకు నిరంతర స్ఫూర్తిని నింపుతున్న వెంకయ్య ప్రముఖ జాతీయవాది, స్వాతంత్య్ర సమరయోధుడు, బహుభాషా కోవిదుడు కూడా. 1913లో జపనీస్‌ భాషలో వారు చేసిన అద్భుత మైన ప్రసంగానికిగానూ ‘జపాన్‌ వెంకయ్య’గా  పేరుపొందారు. ఆగస్టు 2న ఆ మహనీయుడి జయంతి సందర్భంగా... మన మువ్వన్నెల జెండాను రూపొందించడంలో వారి కృషిని మనమంతా తెలుసుకుని ప్రేరణ పొందాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఏళ్లు పోరాడి, ఎందరో వీరుల అసమానమైన త్యాగాల అనంతరం స్వాతంత్య్రాన్ని సంపాదించుకున్న తర్వాత కూడా జాతీయ జెండాతో మన అనుబంధం... భావోద్వేగ బంధం కంటే నియమబద్ధమైన (ఫార్మల్‌), సంస్థాగతమైన బంధంగా మాత్రమే కొనసాగింది.

అలాంటి పరిస్థితిని మార్చి, మువ్వన్నెలను మన జీవితా లతో పెనవేసి, భావోద్వేగ బంధాన్ని ఏర్పర్చే లక్ష్యంతోనే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ‘హర్‌ ఘర్‌ తిరంగా’ (ఇంటింటికీ మువ్వన్నెల జెండా) కార్యక్రమాన్ని రూపొందించారు. భారతదేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తవుతున్న పవిత్రమైన, అద్భుతమైన సందర్భంలో ఉన్నాం. ప్రతి భారతీయుడూ త్రివర్ణ పతాకాన్ని ఇంటిపై రెపరెప లాడించడం ద్వారా జాతీయవాద భావన ప్రతి ఒక్కరిలోనూ మేల్కొ ల్పాలనేది ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. ప్రజల భాగస్వామ్యంతోనే ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమం విజయవంతం అవు తుంది. అప్పుడే దేశమంతా ఒకే తాటిపైకి వస్తుంది.

ఈ ఉద్యమంలో రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలూ, కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలూ సంపూర్ణమైన ఉత్సాహంతో పాల్గొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినట్లుగా ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు దేశమంతా త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్వాతంత్య్ర పోరాట ఘట్టాలను, దేశభక్తిని, భారతీయుల ఐక్యతను ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. జాతీయ జెండా ఎగురవేసేందుకు ఇదివరకున్న నియమ, నిబంధనల్లో స్వల్ప మార్పులు తీసుకొచ్చారు. తద్వారా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ఓ కార్యక్రమంగా మాత్రమే కాకుండా ‘మన దేశం’ అనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఇది పెంపొందిస్తుంది. జాతి నిర్మాణంలో మనమంతా భాగస్వాములు కావాలనే బాధ్యతను కూడా ఈ కార్యక్రమం గుర్తుచేస్తుంది. 

జాతీయ జెండాను చూడగానే ఇవాళ మన దేశ యువతకు దేశ ఉజ్వలమైన భవిష్యత్తు కనబడుతోంది. జాతీయ జెండాను చూసిన పుడు ఓ తల్లికి తనతోపాటు తన కుటుంబానికి ఉన్న విస్తృతమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ సైనికుడికి మువ్వన్నెలను చూసిన పుడు... దేశ రక్షణ కోసం ఊపిరున్నంతవరకూ పోరాడాలన్న స్ఫూర్తి అందుతుంది. ఓ ప్రభుత్వాధికారి జెండాను చూసినపుడు ప్రభుత్వ, రాజ్యాంగ లక్ష్యాలను అమలుచేసేందుకు కావాల్సిన ఉత్సాహం, సమాజంలోని చివరి వ్యక్తి వరకూ పథకాల ఫలాలు అందించాలన్న తపన పెరుగుతాయి.

‘ఇంటింటికీ మువ్వన్నెలు’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకుగానూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జెండాలు పంపిణీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది.  ఇందులో భాగంగా ప్రతి పోస్టాఫీసులో 2022 ఆగస్టు 1 నుంచి జాతీయ జెండాలను అందు బాటులోకి తీసుకువస్తోంది. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జాతీయ జెండాలను ప్రజలకు అందుబాటులోకి ఉంచేందుకు భాగ స్వామ్య పక్షాలతో కలిసి పనిచేస్తున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ ఈ–మార్కెట్‌లోనూ (జెమ్‌) జెండాలు అందుబాటులోకి రాను న్నాయి. వివిధ ఈ–కామర్స్‌ కంపెనీలతో, స్వయం సహాయక బృందాలతోనూ కేంద్రం సమన్వయంతో పనిచేస్తోంది. భౌతికంగా ఇంటిపై జెండా ఎగురవేయాలి. దీంతోపాటుగా వర్చువల్‌ గా కూడా ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు జరుగు తున్నాయి. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన వెబ్‌సైట్లో ఎవరైనా జెండాను పిన్‌ చేయడంతోపాటు, ఇళ్లపై ఎగుర వేసిన త్రివర్ణ పతాకంతో సెల్ఫీ తీసుకుని పోస్ట్‌ చేయవచ్చు.

1947 జూలై 22న రాజ్యాంగ సభలో త్రివర్ణ పతాకంపై తీర్మానం సందర్భంగా సరోజిని నాయుడు మాట్లాడుతూ... ‘ఈ సభలోని ప్రతి ఒక్కరూ మువ్వన్నెల ప్రాధాన్యతను భావ కవితల రూపంలో వెల్లడిం చారు. ఓ కవయిత్రిగా, ఓ మహిళగా నా భావాన్ని వ్యక్తపరుస్తున్నాను. మహిళలం ఎప్పుడూ దేశ ఐక్యత, సమగ్రత కోసం నిలబడతాం. ఈ జెండాకు రాజు, సామాన్యుడు, ధనవంతుడు, పేదవాడు అనే తేడాలే లేవు. ప్రత్యేకమైన హక్కులంటూ ఏమీ లేవు.

జెండాను చూసినపుడు దేశం కోసం మనం చేయాల్సిన కర్తవ్యం, బాధ్యత, త్యాగం మాత్రమే మనకు గుర్తుకురావాలి. మనం హిందువులమో, ముస్లింలమో, క్రిస్టియన్లమో, సిక్కులమో, జొరాస్ట్రియన్లమో లేక వేరొక మత స్తులమో కావొచ్చు. కానీ మన భారతమాత హృదయం, ఆత్మ అవిభాజ్యమైనవి. నవభారతంలో జన్మించే ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకానికి సెల్యూట్‌ చేస్తారు. తమ గౌరవాన్ని చాటుకుంటారు’ అని పేర్కొన్నారు. ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా మనం జెండా ఎగురవేస్తున్నప్పుడు, సరోజిని నాయుడు చెప్పిన మాటలన్నీ మన గుండెల్లో మార్మోగుతూ ఉండాలి. జాతీయవాద భావన మనలో నిరంతరం స్ఫూర్తి రగిలిస్తూ ఉండాలి.

వ్యాసకర్త కేంద్ర సాంస్కృతిక, పర్యాటక,
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖామాత్యులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement